ఏకంగా 80 శాతం మందిని తొలగించిన టెక్‌ సీఈవో | Tech CEO lays off 80 percent workforce after employees refuse ai training | Sakshi
Sakshi News home page

ఏకంగా 80 శాతం మందిని తొలగించిన టెక్‌ సీఈవో

Jun 18 2026 12:49 PM | Updated on Jun 18 2026 12:58 PM

Tech CEO lays off 80 percent workforce after employees refuse ai training

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఇప్పుడు దాదాపు ఉద్యోగులందరి వృత్తిగత జీవితంలో భాగమైపోయింది. కంపెనీలు రెండు మూడేళ్ల క్రితం నుంచే ఏఐ వెంట పడుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులకు ఏఐ నైపుణ్యాలు తప్పనిసరి అయిపోయాయి. ఏఐ స్కిల్స్‌ లేని, నేర్చుకోని ఉద్యోగులను కంపెనీలు నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి.

అమెరికాలోని టెక్సాస్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఎంటర్‌ప్రైజ్‌ సాఫ్ట్‌వేర్ సంస్థ ‘ఇగ్నైట్‌టెక్‌’ (IgniteTech) సీఈవో ఎరిక్‌ వాఘన్‌ (Eric Vaughan) తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏఐ వినియోగాన్ని స్వీకరించడానికి నిరాకరించిన ఉద్యోగులను సంస్థ నుంచి తొలగించి, దాదాపు 80 శాతం మంది సిబ్బందిని కొత్త వారితో భర్తీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఇటీవల నిర్వహించిన ఫార్చ్యూన్ బ్రెయిన్‌స్టార్మ్ టెక్ కార్యక్రమంలో వెలుగులోకి వచ్చాయి.

జనరేటివ్‌ ఏఐ వ్యాపార ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తుందని భావించి 2023లో తమ సంస్థను “ఏఐ-ఫస్ట్” మోడల్‌లోకి మార్చే కార్యక్రమాన్ని ఇగ్నైట్‌టెక్‌ సీఈవో ఎరిక్‌ వాఘన్‌ ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతి వారం “ఏఐ మండేస్‌” పేరుతో ఒక రోజంతా ఉద్యోగులు ఏఐ ప్రాజెక్టులపైనే పనిచేయాలని నిబంధన పెట్టారు. ఏఐ టూల్స్‌, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ కోర్సులు నేర్పించడానికి కంపెనీనే ఖర్చు భరించేది. బయటి నుంచి నిపుణులతో శిక్షణ కార్యక్రమాలు సైతం నిర్వహించేది. ఇందు కోసం కంపెనీ తన మొత్తం పేరోల్‌లో సుమారు 20 శాతం వరకు వెచ్చించినట్లు వాఘన్‌ తెలిపారు.

అయితే ఈ మార్పును ఉద్యోగులంతా సమానంగా స్వీకరించలేదని, ముఖ్యంగా సాంకేతిక విభాగాల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైందని వాఘన్‌ చెప్పారు. శిక్షణ, ప్రోత్సాహకాలు ఉన్నప్పటికీ కొందరు ఏఐ వినియోగాన్ని పూర్తిగా తిరస్కరించడంతో 2023 నుంచి 2024 తొలి త్రైమాసికం మధ్య వందలాది మంది ఉద్యోగులను తొలగించి కొత్త వారితో భర్తీ చేయాల్సి వచ్చిందన్నారు. “ఇది మా లక్ష్యం కాదు. కానీ కొత్త నైపుణ్యాలు నేర్పడం కంటే మనస్తత్వాన్ని మార్చడం కష్టమైంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

వివాదాస్పదమైన ఈ నిర్ణయాన్ని ఇప్పటికీ సమర్థిస్తున్న వాఘన్‌, అదే పరిస్థితి మళ్లీ వస్తే ఇదే నిర్ణయం తీసుకుంటానని కూడా పేర్కొన్నారు. అయితే ఇతర సంస్థలూ విధానాన్ని   అనుసరించాలని తాను సిఫార్సు చేయనని స్పష్టం చేశారు. ఏఐ స్వీకరణ కేవలం సాంకేతిక మార్పు మాత్రమే కాకుండా సంస్థ సంస్కృతిలో కూడా మార్పు  అనేది ఆయన అభిప్రాయం. “ఉద్యోగులు సంస్థ లక్ష్యాలతో ఏకీభవించకపోతే శిక్షణ లేదా వ్యూహాలు మాత్రమే సరిపోవు” అని అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement