‘టాటా’ భారీ ప్లాన్‌: అయిదేళ్లలో రూ.40,000 కోట్ల పెట్టుబడి | Tata Motors Rs 40000 Crore Investment 5 Years Targets 12 Lakh Car Sales | Sakshi
Sakshi News home page

‘టాటా’ భారీ ప్లాన్‌: అయిదేళ్లలో రూ.40,000 కోట్ల పెట్టుబడి

Jun 24 2026 3:27 PM | Updated on Jun 24 2026 3:52 PM

Tata Motors Rs 40000 Crore Investment 5 Years Targets 12 Lakh Car Sales

న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ లిమిటెడ్‌ (టీఎంపీవీ) వచ్చే అయిదేళ్లలో రూ.37,500 కోట్ల నుంచి రూ.40,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. 2031 ఆర్థిక సంవత్సరం (ఎఫ్‌వై31) నాటికి దేశీయ ప్యాసింజర్‌ వాహనాల మార్కెట్లో 20 శాతం వాటాను సాధించడంతో పాటు వార్షిక విక్రయాలను ప్రస్తుత 6.4 లక్షల యూనిట్ల స్థాయి నుంచి 12 లక్షల యూనిట్లకు పైగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్వెస్టర్ల సమావేశంలో టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈవో శైలేష్‌ చంద్ర ఈ వివరాలను వెల్లడించారు.

ఆరు కొత్త మోడళ్లు.. ఉత్పత్తి సామర్థ్యం పెంపు  
కంపెనీ ప్రస్తుతం ఏడాదికి 9 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. రానున్న 2–3 ఏళ్లలో అదనంగా మరో 4 లక్షల యూనిట్ల సామర్థ్యాన్ని జోడించి మొత్తం ఉత్పత్తి సామర్థ్యాన్ని 13 లక్షల యూనిట్లకు పెంచనున్నట్లు శైలేష్‌ చంద్ర తెలిపారు. అలాగే ఎఫ్‌వై31 నాటికి ఆరు కొత్త మోడల్‌ శ్రేణులను మార్కెట్లోకి తీసుకురానుంది. దీంతో కంపెనీ మొత్తం మోడల్‌ శ్రేణుల సంఖ్య ప్రస్తుతం ఉన్న తొమ్మిది నుంచి 15కు చేరనుంది. అధిక వృద్ధి అవకాశాలు ఉన్న విభాగాలతో పాటు ఇప్పటివరకు ప్రవేశించని కొత్త ఈవీ విభాగాల్లోనూ ఈ మోడళ్లు అందుబాటులోకి రానున్నాయి.  

పోర్ట్‌ఫోలియోలో 30% ఈవీ వాటా లక్ష్యం  
భవిష్యత్తు అంతా మలీ్ట–పవర్‌ట్రెయిన్‌ (ఈవీ, సీఎన్‌జీ, పెట్రోల్‌/డీజిల్‌) దేనని శైలేష్‌ చంద్ర స్పష్టం చేశారు. ఎఫ్‌వై31 నాటికి టాటా మోటార్స్‌ తన సొంత పోర్ట్‌ఫోలియోలో 30 శాతం ఈవీ భాగస్వామ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 10 ఈవీ మోడళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. రాబోయే రోజుల్లో కంపెనీ సాధించే అదనపు విక్రయాల్లో ఈవీ, సీఎన్‌జీ వాహనాలదే కీలక పాత్ర కానుంది. ‘‘ఎఫ్‌వై20 నుంచి ఎఫ్‌వై26 మధ్య కంపెనీ మార్కెట్‌ వాటా 9 శాతం పాయింట్లు పెరిగిందని, ఎఫ్‌వై26 నుంచి ఎఫ్‌వై31 మధ్య మరో 5–6 శాతం పాయింట్ల వృద్ధితో 20 శాతం మార్కెట్‌ వాటాను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాము’’ అని శైలేష్‌ చంద్ర తెలిపారు.

ఆటో పరిశ్రమ అంచనాలు 
దేశీయ ప్యాసింజర్‌ వాహనాల మార్కెట్‌ ఎఫ్‌వై26 లోని 47 లక్షల యూనిట్ల నుండి ఎఫ్‌వై31 నాటికి 64 లక్షల యూనిట్లకు పెరుగుతుందని శైలేష్‌ చంద్ర అంచనా వేశారు. కొనుగోలుదారుల ఆదాయాలు పెరగడం, ఆధునిక సాంకేతికత తోడవ్వడంతో ప్రస్తుతం ఉన్న కార్ల సగటు ధర రూ.11–12 లక్షల నుండి ఎఫ్‌వై 31 నాటికి రూ.15 లక్షలకు చేరనుందన్నారు. దేశీయంగా ఈవీ విక్రయాలు ఎఫ్‌వై31 నాటికి 10.11 లక్షల యూనిట్లకు (మొత్తం మార్కెట్లో 15–20% వాటా) చేరుకుంటాయని అభిప్రాయపడ్డారు. కాగా, గత ఆర్థిక సంవత్సరంలో 2.2 లక్షలుగా ఉన్న ఈవీ విక్రయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 3.5 లక్షల యూనిట్లకు చేరుకోవచ్చని శైలేష్‌ చంద్ర తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement