ఐఫోన్‌ పోగొట్టుకున్నారా? ..సుప్రీం కోర్టు కీలక తీర్పు!

Supreme Court says it is not Apples duty to trace stolen iPhones - Sakshi

దొంగతనాలకు గురైన ఐఫోన్‌లకు సంబంధించి భారత సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులో కస్టమర్లు పోగొట్టుకున్న ఐఫోన్‌లను కనుగొనడంలో యాపిల్ ఇండియా బాధ్యతకు సంబంధించిన కీలక సమస్యను దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావించింది.

యాపిల్‌ సంస్థకు వ్యతిరేకంగా ఒడిశా స్టేట్ కన్స్యూమర్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ తస్కరణకు గురైన ఐఫోన్‌లను ప్రత్యేక గుర్తింపు సంఖ్యలతో ట్రేస్ చేసే బాధ్యత యాపిల్‌ కంపెనీకి లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొందని లైవ్ లా అనే వార్తా సంస్థ నివేదించింది. వినియోగదారుల కమిషన్ ఆదేశాలపై యాపిల్ ఇండియా దాఖలు చేసిన అప్పీల్‌ను న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విచారించింది.

థెఫ్ట్‌ ఇన్సూరెన్స్‌తో ఐఫోన్‌ను కొనుగోలు చేసిన వినియోగదారుడు తన ఫోన్ చోరీకి గురైనట్లు పోలీసులకు, యాపిల్ ఇండియాకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు ప్రారంభమైంది. అయితే పోయిన ఐఫోన్‌ను ట్రాక్ చేయడానికి ఆపిల్ ఇండియా ఎటువంటి చర్య తీసుకోలేదు. దీంతో వినియోగదారుడు ఫిర్యాదు దాఖలు చేయడంతో జిల్లా వినియోగదారుల ఫోరమ్ బాధితుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ నిర్ణయంపై యాపిల్ ఇండియా ఒడిశా స్టేట్ కన్స్యూమర్ కమిషన్‌కు అప్పీల్ చేసింది.

దొంగతనానికి గురైన ఫోన్‌ను ప్రత్యేక గుర్తింపు సంఖ్యలతో ట్రేస్ చేయాల్సిన బాధ్యత ఐఫోన్ తయారీదారుగా యాపిల్‌ ఇండియాకు ఉందని ఒడిశా స్టేట్ కన్స్యూమర్ కమిషన్  తీర్పు పేర్కొంది. ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ యాపిల్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఒడిశా రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆదేశాన్ని అన్యాయమని పేర్కొంటూ దానిని తోసిపుచ్చింది. అయితే బాధితుడికి యాపిల్ ఇండియా పరిహారాన్ని పరిగణనలోకి తీసుకుంటూనే దొంగతనానికి గురై ఫోన్‌లను కనుగొనవలసిందిగా ఆపిల్ ఇండియాను కోరడం అసమంజసమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top