స్వల్ప నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు | stock market updates on april 16 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: స్వల్ప నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Apr 16 2025 9:26 AM | Updated on Apr 16 2025 11:30 AM

stock market updates on april 16 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ(Nifty) 30 పాయింట్లు తగ్గి 23,298కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 76 పాయింట్లు పుంజుకొని 76,651 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 99.81 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 64.51 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.33 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.17 శాతం నష్టపోయింది. నాస్‌డాక్‌ 0.05 శాతం దిగజారింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతీకార సుంకాల నుంచి ఎల్రక్టానిక్స్‌ ఉత్పత్తులను మినహాయించారు. దాంతో పాటు ఆటోమొబైల్స్‌పై సుంకాలు సవరించే వీలుందని సంకేతాలివ్వడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు నిన్న భారీగా లాభపడ్డాయి. ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు కస్టమర్లకు బదిలీలో భాగంగా పలు బ్యాంకులు డిపాజిట్ల రేట్లు తగ్గిస్తున్నాయి. ఈ ప్రక్రియతో బ్యాంకుల నికర వడ్డీరేట్ల మార్జిన్ల ఒత్తిళ్లు తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

రెండు రోజుల్లో రూ.18.42 లక్షల కోట్లు

దలాల్‌ స్ట్రీట్‌లో గడిచిన రెండు ట్రేడింగ్‌ సెషన్లలో రూ.18.42 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో బీఎస్‌ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.412.24 లక్షల కోట్ల(4.81 ట్రిలియన్‌ డాలర్లు)కు చేరుకుంది. మంగళవారం ఒక్కరోజే రూ.10.8 లక్షల కోట్ల సంపద ఇన్వెస్టర్ల సొంతమైంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement