యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్ ఫండ్, నిఫ్టీ ఎనర్జీ ఈటీఎఫ్ పేరిట రెండు న్యూ ఫండ్ ఆఫర్స్‌ను ప్రకటించింది. ఇవి ఆగస్టు 21 వరకు అందుబాటులో ఉంటాయి. నిఫ్టీ ఇండెక్స్ ఫండ్‌లో కనీసం రూ. 100 నుంచి, ఈటీఎఫ్‌లో రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. నిఫ్టీ ఎనర్జీ టీఆర్‌ఐ పనితీరు వీటికి ప్రామాణికంగా ఉంటుంది. దేశీయంగా విద్యుత్ వినియోగం పలు సంపన్న, వర్ధమాన దేశాలతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరగనుండటంతో పునరుత్పాదక విద్యుత్, పంపిణీ మౌలిక సదుపాయాలు, పరికరాలు, కొత్త టెక్నాలజీలు, విద్యుదుత్పత్తి మొదలైన విభాగాలు భారీగా విస్తరించనున్నాయి. వీటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ప్రయోజనాలు పొందేందుకు ఈ 2 ఎన్‌ఎఫ్‌వోలు తోడ్పడతాయి. నిఫ్టీ 500 స్టాక్స్ నుంచి ఎనర్జీ థీమ్‌కి సంబంధించి ఎంపిక చేసిన 40 స్టాక్స్ నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్‌లో ఉంటాయి.
ఏబీఎస్‌ఎల్‌ఐ నుంచి ఏపెక్స్ సిఫ్‌లు
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ (ఏబీఎస్‌ఎల్‌ఐ) తాజాగా ఏపెక్స్ ఈక్విటీ లాంగ్–షార్ట్ ఫండ్, ఏపెక్స్ ఈక్విటీ ఎక్స్–టాప్ 100 లాంగ్–షార్ట్ ఫండ్ పేరిట రెండు స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్‌ను (సిఫ్) ఆవిష్కరించింది. ఇవి ఆగస్టు 24 వరకు అందుబాటులో ఉంటాయి. వీటిలో కనీసం రూ. 10 లక్షల నుంచి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్‌కి నిఫ్టీ 500 టీఆర్‌ఐ ప్రామాణికంగా ఉంటుంది.
లిస్టెడ్ ఈక్విటీలతో పాటు పరిమిత స్థాయిలో డెరివేటివ్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేసే వ్యూహంతో దీర్ఘకాలికంగా సంపద వృద్ధికి తోడ్పడటం దీని లక్ష్యంగా ఉంటుంది. ఏపెక్స్ ఈక్విటీ ఎక్స్–టాప్ 100 లాంగ్ షార్ట్ ఫండ్ అనేది మార్కెట్ క్యాపిటలైజేషన్‌పరంగా టాప్ 100 వెలుపల ఉండే సంస్థలు రాబోయే రోజుల్లో మార్కెట్ లీడర్లుగా ఎదిగే అవకాశాలపై ఆధారితమైనదిగా ఉంటుంది. నియంత్రణ సంస్థల పరిధిలో వైవిధ్యమైన సాధనాల్లో భారీ మొత్తాలను ఇన్వెస్ట్ చేయదల్చుకునేవారు, ఫ్యామిలీ ఆఫీసులు మొదలైన వర్గాలకు ఇవి అనువుగా ఉంటాయి.
జీరోధా ఫండ్ హౌస్ ఆర్బిట్రేజ్ ఫండ్
పన్నులను ఆదా చేసే విధంగా మిగులు నిధులను మెరుగైన సాధనాల్లో ఇన్వెస్ట్ చేయదల్చుకునే వారి కోసం జీరోధా ఆర్బిట్రేజ్ ఫండ్‌ను జీరోధా ఫండ్ హౌస్ ప్రవేశపెట్టింది. మిగతా సాధనాలతో పోలిస్తే తక్కువ రిస్కులతో, ఈక్విటీ ఫండ్స్‌కి సంబంధించిన ట్యాక్సేషన్ వర్తిస్తుంది కాబట్టి అధిక ట్యాక్స్ పరిధిలోకి వచ్చే వారు దీన్ని పరిశీలించవచ్చని సంస్థ తెలిపింది. ఇది ప్రధానంగా ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్ (కనీసం 65 శాతం) డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది.
చదవండి: పెట్రోల్ పాలసీలో ట్విస్ట్! పాత వాహనాలకు E10 పరిష్కారమా?
నిర్దిష్ట స్టాక్స్, వాటి డెరివేటివ్ కాంట్రాక్టుల మధ్య తాత్కాలికంగా ఉండే ధరలపరమైన వ్యత్యాసాలను ఉపయోగించుకుని మెరుగైన రాబడులను సాధించడం దీని లక్ష్యం. అలాంటి అవకాశాలు లేనప్పుడు ఈ ఫండ్ తాత్కాలికంగా తన వద్ద ఉన్న నిధులను స్వల్పకాలిక డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. రిస్కు సామర్థ్యాలు తక్కువగా ఉండి, కొద్ది నెలల వ్యవధికి గాను మిగులు నిధులను ఇన్వెస్ట్ చేయదల్చుకునే మదుపరులు దీన్ని పరిశీలించవచ్చు. కనీసం రూ. 5,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందని సంస్థ తెలిపింది.


