పెట్రోల్‌ పాలసీలో ట్విస్ట్‌! పాత వాహనాలకు E10 పరిష్కారమా? | E20 Petrol Debate Bring Back E10 for Older Vehicles Says CEA | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ పాలసీలో ట్విస్ట్‌! పాత వాహనాలకు E10 పరిష్కారమా?

Aug 17 2026 12:54 PM | Updated on Aug 17 2026 1:23 PM

E20 Petrol Debate Bring Back E10 for Older Vehicles Says CEA

దేశంలో పెట్రోల్‌లో ఇథనాల్ కలపడంపై మరోసారి చర్చ మొదలైంది. ప్రస్తుతం పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపిన E20 ఇంధనం వాడుతున్నారు. అయితే.. పాత వాహనాల విషయంలో మాత్రం తక్కువ ఇథనాల్ ఉన్న ఈ10 పెట్రోల్‌ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ సూచించారు.

ఇటీవల ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో రాసిన ఒక అభిప్రాయ వ్యాసంలో.. నాగేశ్వరన్, ఆర్థిక వ్యవహారాల శాఖ కన్సల్టెంట్ ఆకాష్ పూజారితో కలిసి ఈ అంశంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. వీరి ప్రకారం.. E20పై చర్చ కేవలం వాహనాల ఇంజిన్‌కు సమస్య వస్తుందా?, రాదా? అనే దానికే మాత్రమే పరిమితం కాకూడదు. ఇథనాల్ కోసం పంటలు, భూమి, నీటిని ఎక్కువగా ఉపయోగిస్తే భవిష్యత్తులో ఆహారం, ఇంధనం మధ్య పోటీ ఎలా ఉంటుందో.. కూడా తప్పకుండా ఆలోచించాల్సిన అవసరం ఉంది.

పాత వాహనాలకు E10 ఎందుకు?
భారతదేశంలో బీఎస్4 (BS4) ప్రమాణాలకు ముందు.. తయారైన ద్విచక్ర వాహనాల సంఖ్య సుమారు 7.5 కోట్ల నుంచి 8 కోట్ల వరకు ఉంది. వీటిలో చాలావరకు కార్బ్యురేటర్‌తో పనిచేసే వాహనాలే. పాత కార్బ్యురేటర్ వాహనాలు అధిక ఇథనాల్ కలిగిన ఇంధనానికి అనుగుణంగా గాలి, ఇంధన మిశ్రమాన్ని సరిగ్గా సర్దుబాటు చేయలేకపోవచ్చు. అలాగే.. పాత వాహనాల్లోని కొన్ని రబ్బర్ సీల్స్ కూడా ఇథనాల్‌ను ఎక్కువకాలం తట్టుకోకపోవచ్చు. దీంతో కాలక్రమేణా కొన్ని భాగాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది.

అయితే.. ఈ వాహనాలను E20కి అనుగుణంగా మార్చడం అసాధ్యం కాదు. అవసరమైన భాగాలను మార్చడం వల్ల ఇది సాధ్యమవుతుంది. కానీ.. దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్న వాహనాలన్నింటినీ ఇలా మార్చడానికి చాలా సమయం, ఖర్చు అవుతుంది. అందుకే అప్పటివరకు పాత వాహనాలకు E10ను కూడా అందుబాటులో ఉంచడం ఒక మంచి పరిష్కారం.

ప్రభుత్వం ద్రుష్టి ఈ20పైనే!
కేంద్ర ప్రభుత్వం మాత్రం E20నే ప్రామాణిక పెట్రోల్‌గా కొనసాగించాలనే వైఖరిలో ఉంది. ఈ10, ఈ20, సాధారణ పెట్రోల్ ఇలా వేర్వేరు ఇంధనాలను ఒకేసారి అందుబాటులో ఉంచితే నిల్వ, రవాణా, పంపిణీ వ్యవస్థలకు అదనపు ఖర్చులు, ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది.

ఇదే సమయంలో ఈ10 కోసం తయారు చేసిన వాహనాల్లో.. ఈ20 వాడితే ఇంధన సామర్థ్యం సుమారు 3 నుంచి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం అంగీకరించింది. అయితే.. ఈ20 వల్ల ఇంజిన్‌లకు పెద్దఎత్తున నష్టం జరుగుతోందని చెప్పడానికి తగిన ఆధారాలు లేవని చెబుతోంది.

E20 తర్వాత..
ప్రస్తుతం ఈ20లో అందుబాటులో ఉంది. భవిష్యత్తులో E27, E30 వంటి అధిక ఇథనాల్ బ్లెండింగ్‌ వస్తుందా? అనేది ఇప్పుడొక ప్రశ్న.

నిజానికి ఇథనాల్ శాతం పెరిగే కొద్దీ.. దాని కోసం అవసరమైన పంటల పరిమాణం కూడా పెరగాలి. ఒక దశలో ఇంధనం కోసం పంటలను ఉపయోగించడం వల్ల ఆహారం కోసం పండించే పంటలు తగ్గిపోవచ్చు. కాబట్టి ఇథనాల్ శాతం ఇంకెత పెంచగలం? అనే దానికంటే.. ఇథనాల్ కోసం ఇంకెంత పంటను మళ్లించగలం? అనే విషయాన్ని గురించి కూడా ఆలోచించాలని నాగేశ్వరన్ అన్నారు.

మొక్కజొన్నకు డిమాండ్
ఇథనాల్ తయారీలో మొక్కజొన్న పాత్ర కీలకం. ప్రస్తుతం దేశంలో తయారయ్యే ఇథనాల్‌లో దాదాపు సగం వరకు మొక్కజొన్న నుంచి వస్తోందని నాగేశ్వరన్ పేర్కొన్నారు.

మొక్కజొన్నకు ఇథనాల్ పరిశ్రమ నుంచి డిమాండ్ పెరగడంతో.. రైతులు కొంత లాభపడుతున్నారు. కానీ.. ఇక్కడ ఒక సమస్య కూడా ఉంది. మొక్కజొన్న పండించే భూమిలో సోయాబీన్, వేరుశెనగ, ఆవాలు వంటి పంటలను కూడా సాగు చేయవచ్చు. కానీ మొక్కజొన్నకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల.. ఇతర పంటలకు కేటాయించే భూమి తగ్గుతుంది. ఇది అలాగే కొనసాగితే.. చివరకు ఆహార ఉత్పత్తి, నూనెగింజల సాగుపైనా ప్రభావం చూపవచ్చు. తద్వారా ఆహార కొరత వచ్చే అవకాశం ఉంటుంది.

ఇథనాల్ వల్ల ప్రయోజనాలు
👉చెరకు రైతులకు లాభాలు
👉గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆదాయ మార్గం
👉ఇథనాల్‌కు స్థిరమైన మార్కెట్ కల్పించడం
👉చక్కెర మిగులు నిల్వలను తగ్గించడం
👉దేశం క్రూడ్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం

నీటి సమస్య
ఇథనాల్ విషయంలో మరో ముఖ్యమైన సమస్య నీటి వినియోగం. ముఖ్యంగా చెరకు సాగుకు ఎక్కువ నీరు అవసరం. మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే నీటి వనరులపై ఒత్తిడి ఉంది. అందుకే ఇథనాల్ కోసం ఎంత చెరకు సాగు చేస్తున్నాం.. అనే దానితో పాటు, దాని కోసం ఎంత నీరు ఉపయోగిస్తున్నామో కూడా చూడాలి.

వర్షం ద్వారా సహజంగా పంటలకు అందే నీటితో పాటు నదులు, కాలువలు, బోర్లు, భూగర్భ జలాల నుంచి తీసుకునే నీటిపై కూడా దృష్టి పెట్టాలని నాగేశ్వరన్ సూచిస్తున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే.. పెట్రోల్‌లో ఇథనాల్ శాతం ఎంత ఉందనే లెక్క మాత్రమే కాకుండా, ఆ ఇథనాల్ తయారు చేయడానికి ఎంత నీరు ఖర్చవుతోంది అనేదీ ముఖ్యం.

లాభాలతో పాటు.. నష్టాలను లెక్కించాలి
ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇథనాల్ వల్ల వచ్చే ప్రయోజనాలను మాత్రమే చూసి ముందుకు వెళ్లకూడదు. దాని కోసం మనం ఏం కోల్పోతున్నామో కూడా లెక్కించాలి. ఒకసారి రైతులు ఇథనాల్ కోసం ఒక పంటను పెద్దఎత్తున పండించడం మొదలుపెడితే.. దాని ఆధారంగా భూమి, నీటి వినియోగం మారితే.. ఆ నిర్ణయాన్ని తర్వాత వెనక్కి తీసుకోవడం అంత సులభం కాదు. కాబట్టి త్వరగా మార్చుకోగలిగే నిర్ణయాలు ముందుగా తీసుకోవచ్చు. కానీ భూమి, నీరు, పంటల సాగు వంటి వాటిపై దీర్ఘకాలిక ప్రభావం చూపే నిర్ణయాలను మాత్రం పూర్తిగా అలోచించి, విశ్లేషించిన తర్వాతే తీసుకోవాలని నాగేశ్వరన్ సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: వాట్సాప్‌లో KYC చేస్తున్నారా?.. తస్మాత్‌ జాగ్రత్త!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement