
సెన్సెక్స్ లాభం 260 పాయింట్లు
బ్యాంకులు, ఐటీ షేర్లకు డిమాండ్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాలతో ముగిసింది. అమెరికా – భారత్ వాణిజ్య ఒప్పందంపై ఆశలు, రికార్డు స్థాయిలో జీఎస్‌టీ వసూళ్లు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్ల అంశాలు కలిసొచ్చాయి. సెన్సెక్స్ 260 పాయింట్లు పెరిగి 80,502 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 13 పాయింట్లు బలపడి 24,347 వద్ద నిలిచింది. ఉదయం సానుకూలంగా మొదలైన సూచీలు ట్రేడింగ్ ప్రారంభంలోనే భారీ లాభాలు ఆర్జించాయి.
ఐటీ, బ్యాంకుల షేర్లకు డిమాండ్ లభించడంతో ఒక దశలో సెన్సెక్స్ 936 పాయింట్లు బలపడి 81,178 వద్ద గరిష్టాన్ని అందుకుంది. నిఫ్టీ 255 పాయింట్లు ఎగసి 24,589 వద్ద ఈ ఏడాది గరిష్టాన్ని నమోదు చేసింది. అయితే ద్వితీయార్ధంలో గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో లాభాలు తగ్గాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి.
⇒ బీఎస్‌ఈలో రంగాల వారీగా సూచీల్లో సర్వీసెస్ 1.67%, ఆయిల్‌అండ్‌గ్యాస్ 0.69%, ఇంధన 0.57%, ఐటీ ఇండెక్సు అరశాతం పెరిగాయి. టెలికమ్యూనికేషన్ 2%, కన్జూమర్ డ్యూరబుల్స్ 1.66%, విద్యుత్, యుటిలిటీ 1%, మెటల్, రియల్టీ సూచీలు అరశాతం నష్టపోయాయి. మిడ్‌క్యాప్ 1.67%, స్మాల్ క్యాప్ సూచీ 0.07 శాతం పతనమయ్యాయి.
⇒ మార్చి క్వార్టర్ నికరలాభం 4% వృద్ధి నమోదుతో అదానీ పోర్ట్స్–సెజ్ షేరు 4% పెరిగి రూ.1,267 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 6% ఎగసి రూ.1,295 వద్ద గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే. కంపెనీ మార్కెట్ విలువ రూ.10,812 కోట్లు పెరిగి రూ.2.73 లక్షల కోట్లకు చేరింది.
⇒ భూషణ్ స్టీల్ అండ్ పవర్‌ను దక్కించుకునేందుకు సమర్పించిన ప్రణాళికలు దివాలా పరిష్కార ప్రక్రియ చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంతో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేరు 5.5% నష్టపోయి రూ.972 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 8% క్షీణించి రూ.948 వద్ద కనిష్టాన్ని తాకింది. షేరు భారీ పతనంతో కంపెనీకి రూ.13,731 కోట్ల నష్టం వాటిల్లింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.2.37 లక్షల కోట్లకు దిగివచి్చంది.