
రిటైల్ పెట్టుబడిదారులలో భయాందోళనల అమ్మకం, విదేశీ పెట్టుబడిదారుల విపరీత ఆఫ్ లోడ్లతో భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. అక్టోబర్ 1 నుండి తమ దేశంలోకి ప్రవేశించే "ఏదైనా బ్రాండెడ్ లేదా పేటెంట్ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తి" పై 100 శాతం సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో దలాల్ స్ట్రీట్ ‘బేరు’మన్నది.
బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ ఈరోజు 733 పాయింట్లు లేదా 0.9 శాతం క్షీణించి 80,426.5 వద్ద ముగిసింది. ఇది ఇంట్రాడే ట్రేడ్ లో 80,332 కనిష్టాన్ని తాకింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ 236 పాయింట్లు లేదా 0.95 శాతం క్షీణించి 24,655 వద్ద ముగిసింది. ఇది 24,629 వద్ద పడిపోయింది. దీంతో, ఈ బెంచ్ మార్క్ ఏడు వారాలలో అత్యంత చెత్త వారపు క్షీణతను నమోదు చేసింది.
ఎం అండ్ ఎం, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, టెక్ ఎం, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, బీఈఎల్, హెచ్సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, ట్రెంట్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ 1 శాతం నుంచి 3.6 శాతం వరకు నష్టపోయాయి. సెన్సెక్స్ ఇండెక్స్లో ఎల్ అండ్ టీ, మారుతి సుజుకి, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్ మాత్రమే లాభపడ్డాయి.
విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.05 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.2 శాతం క్షీణించాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2.3 శాతం, నిఫ్టీ ఫార్మా 2.2 శాతం, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 1 శాతం నష్టపోయాయి.