గత వారం స్టాక్ మార్కెట్ కొంత కోలుకోవడంతో పెట్టుబడిదారుల్లో ఆశలు చిగురించాయి. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. ఎందుకంటే.. ఈ రోజు (సోమవారం) మార్కెట్ మళ్లీ భారీ నష్టాలను చవిచూసింది. సెన్సెక్స్ ఏకంగా 920 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ 275 పాయింట్లు నష్టపోయింది. దీంతో గత రెండు రోజులుగా కొనసాగుతున్న మార్కెట్ లాభాలకు బ్రేక్ పడింది. ఈ పతనం వల్ల ఇన్వెస్టర్లు దాదాపు రూ.4 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారు.
మార్కెట్ ఇంతలా పడిపోవడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. అవి బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు పెరగడం, ముడి చమురు ధరలు అధికంగా ఉండటం, విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం.
బ్యాంకింగ్ రంగం.. మార్కెట్ పతనంలో కీలక పాత్ర పోషించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి పెద్ద బ్యాంకుల షేర్లు భారీగా పడిపోయాయి. ఈ బ్యాంకుల త్రైమాసిక ఫలితాలను పరిశీలించిన తర్వాత పెట్టుబడిదారులు కొంత నిరాశకు గురయ్యారు. ముఖ్యంగా యాక్సిస్ బ్యాంక్ కొన్ని కీలక అంశాల్లో మార్కెట్ అంచనాలను అందుకోలేకపోవడంతో దాని షేరు ఇంట్రాడేలో సుమారు 5 శాతం వరకు పడిపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు కూడా దాదాపు 3 శాతం నష్టపోయింది. సెన్సెక్స్‌లో ఈ బ్యాంకులకు అధిక ప్రాధాన్యం ఉండటంతో, వీటి షేర్లు పడిపోవడం మొత్తం మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది.
ముడి చమురు ధరలు పెరగడంతో.. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు సుమారు 108-109 డాలర్ల వద్ద ట్రేడయింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ప్రాంతంలో చమురు సరఫరాకు అంతరాయం కలగవచ్చనే భయాలు ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. భారత్ తన అవసరాలకు సరిపడా చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి చమురు ధరలు పెరిగితే.. దేశానికి దిగుమతి ఖర్చులు పెరుగుతాయి. దీంతో రూపాయిపై ఒత్తిడి ఏర్పడవచ్చు, రవాణా ఖర్చులు పెరగవచ్చు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితులు కంపెనీల లాభాలపై ప్రభావం చూపుతాయనే భయంతో పెట్టుబడిదారులు షేర్లను విక్రయించారు.
విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు కూడా మార్కెట్ పతననానికి కారణమైంది. విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీ మార్కెట్ నుంచి సుమారు రూ.52,100 కోట్లను వెనక్కి తీసుకున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. అంతకుముందు.. సెప్టెంబర్‌లో కూడా వారు దాదాపు రూ.35,861 కోట్లను ఉపసంహరించుకున్నారు. అమెరికా బాండ్లపై పెరుగుతున్న రాబడులు, బలపడుతున్న డాలర్, అధిక చమురు ధరలు వంటి అంశాలు విదేశీ పెట్టుబడిదారులను అప్రమత్తం చేస్తున్నాయి. వారు పెద్ద మొత్తంలో షేర్లను విక్రయించినప్పుడు మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి పెరిగి ధరలు పడిపోయే అవకాశం ఉంటుంది.
ఈ ప్రభావం కేవలం పెద్ద కంపెనీలకే పరిమితం కాలేదు. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు కూడా నష్టాల్లో ముగిశాయి. మార్కెట్‌లో అనిశ్చితి పెరిగినప్పుడు పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోవడానికి వెనుకాడతారు. అందువల్ల చిన్న, మధ్యస్థాయి కంపెనీల షేర్లలో కూడా అమ్మకాలు పెరిగాయి.
పెట్టుబడిదారులు గమనించాల్సిన విషయాలు
ఇకపై మార్కెట్ ఎలా ఉండబోతోంది? దీనిని అంచనా వేయడానికి పెట్టుబడిదారులు కొన్ని ముఖ్యమైన అంశాలను గమనించాలి. కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఎలా ఉన్నాయి?, బ్యాంకుల లాభాలు మరియు రుణాల నాణ్యత ఎలా ఉన్నాయి?, అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గుతున్నాయా?, లేదా?, విదేశీ పెట్టుబడిదారులు మళ్లీ భారత మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్నారా? అనేవి తప్పకుండా గమనించాలి.
ఇదీ చదవండి: గోల్డ్ రేట్లు తగ్గుతున్నాయ్.. ఇకపై ఏం జరగబోతోంది?


