స్టాక్ మార్కెట్లలో ఏదో ఒక విభాగం రాణిస్తున్న ప్రతిసారీ, ఇన్వెస్టర్ల మదిలో ఓ ప్రశ్న తలెత్తుతుంది. లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ లేదా స్మాల్ క్యాప్స్.. ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? అయితే, ఆర్థిక వృద్ధి, ఆదాయాలు, వేల్యుయేషన్స్, ఇన్వెస్టర్ సెంటిమెంట్లను బట్టి మార్కెట్లో వివిధ విభాగాలు వివిధ దశల్లో రాణిస్తుంటాయి. దీర్ఘకాలిక ఇన్వెస్టర్ల కోణంలో చూస్తే ఎప్పటికప్పుడు మార్కెట్లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడం ప్రధానంగా ఉంటుంది. ఇలాంటప్పుడు మల్టిక్యాప్ విధానాన్ని పరిశీలించవచ్చు. లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్స్ అన్నింటికి ఒకే పోర్ట్‌ఫోలియోలో చోటు కల్పించడం ద్వారా ఒకే సాధనంతో పలు అవకాశాలను ఇన్వెస్టర్లకు ఇది అందిస్తుంది.
ఈ ఫండ్స్‌లో లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్‌లకు సంబంధించి ఒక్కో విభాగానికి తప్పనిసరిగా కనీసం 25 శాతం కేటాయించాల్సి ఉంటుంది. కొత్త అవకాశాల్లో ఇన్వెస్ట్ చేయడానికి మిగతా మొత్తాన్ని కేటాయించడం ద్వారా ఇవి డైవర్సిఫికేషన్‌లో సమతుల్యత పాటిస్తూనే మెరుగైన రాబడులు అందించేందుకు తోడ్పడతాయి.
మిగతా వాటికి భిన్నంగా.. వివిధ దశల్లో పెట్టుబడులను కొనసాగించడం
మార్కెట్లోని వివిధ పరిస్థితులు, దశలకు అనుగుణంగా వివిధ సెగ్మెంట్లు పని చేస్తాయి. మల్టిక్యాప్ విధానం ద్వారా మార్కెట్ లీడర్‌షిప్ మారే కొద్దీ దానికి అనుగుణంగా పోర్ట్‌ఫోలియోను కూడా తీర్చిదిద్దుకునేందుకు ఉపయోగపడుతుంది. ప్రతి దశలోనూ ఏ సెగ్మెంట్‌కి ఎక్కువగా కేటాయించాలనే దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోకుండా, మార్కెట్లో పరిస్థితులు మారుతున్నా కూడా పెట్టుబడులను కొనసాగించేందుకు దీనితో వీలవుతుంది.
కేటాయింపుల నిర్ణయాలను నిపుణులకు వదిలేయడం...
మార్కెట్లో అవకాశాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. వేల్యుయేషన్స్‌ను మిగతా వాటితో పోల్చి చూసుకోవడం, ఆదాయ అవకాశాలు, వ్యాపార ఫండమెంటల్స్ మొదలైనవి ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడాన్ని ప్రభావితం చేస్తుంటాయి. మల్టిక్యాప్ పోర్ట్‌ఫోలియో కింద నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా కేటాయింపులను జరపాల్సిన బాధ్యత ఫండ్ మేనేజరుపై ఉంటుంది. దీనితో ప్రతి మార్పును ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుంటూ, తామే రీబ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను కొనసాగించేందుకు వీలవుతుంది.
ఒకే పోర్ట్‌ఫోలియోతో పలు అవకాశాలు
వివిధ మార్కెట్ సెగ్మెంట్స్‌వ్యాప్తంగా ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు సాధారణంగా ప్రతి కేటగిరీకి ప్రత్యేకంగా కేటాయింపులు జరుపుతుంటారు. అయితే, దీనివల్ల అనేక రకాల పెట్టుబడులను పెడుతుండటం, మళ్లీ మొత్తం కేటాయింపుల్లో వాటి వాటాను ఎప్పటికప్పడు తామే స్వయంగా సమీక్షించుకుంటూ ఉండాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఇలాంటి సమస్యలు రాకుండా మల్టిక్యాప్ వ్యూహం కింద ఒకే పోర్ట్‌ఫోలియోలో లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి. దీనితో మార్కెట్లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూనే ఇన్వెస్ట్‌మెంట్ ప్రస్థానాన్ని కూడా సులభతరంగా కొనసాగించేందుకు వీలవుతుంది.
మార్కెట్ లీడర్‌షిప్ మారినా కేటాయింపుల్లో సమతుల్యత
కాలక్రమేణా మార్కెట్ లీడర్‌షిప్ మారుతుంటుంది. ఒక దశలో ఓ సెగ్మెంట్ సారథ్యం వహిస్తే, ఆ తర్వాత ఆర్థిక, వ్యాపార పరిస్థితులు మారిన తర్వాత మరొకటి సారథ్యం వహిస్తుంది. మార్కెట్ క్యాప్‌లవ్యాప్తంగా పెట్టుబడులను కొనసాగించడం ద్వారా ఏదో ఒక సెగ్మెంట్‌పైనే ఆధారపడకుండా కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మల్టిక్యాప్ విధానం ఉపయోగపడుతుంది. ఈక్విటీల్లో సమతూకంతో పెట్టుబడులను కొనసాగించేందుకు అనువైనదిగా ఉంటుంది.
దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి..
దీర్ఘకాలిక ఇన్వెస్టర్ల విషయానికొస్తే, మార్కెట్లో ప్రతి కదలికను బట్టి పోర్ట్‌ఫోలియోలను మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఒక పద్ధతి ప్రకారం ఒకే పోర్ట్‌ఫోలియో ద్వారా అన్ని సెగ్మెంట్లవ్యాప్తంగా పెట్టుబడులు ఉండటం వల్ల వివిధ కాలావధులు, ఆర్థిక లక్ష్యాలపై ఫోకస్ పెట్టేందుకు ఇన్వెస్టరుకు వీలవుతుంది. మల్టిక్యాప్ వ్యూహం అన్నంత మాత్రాన ఈక్విటీలపరమైన రిసు్కలు ఉండవని, కచ్చితంగా మెరుగైన రాబడులు వస్తాయని కాదు. లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్స్ అన్నీ కూడా ఏదో ఒక దశలో తీవ్ర హెచ్చుతగులకు లోనవుతుంటాయి. వాటి పని తీరు కూడా సరిగ్గా ఉండకపోవచ్చు. అయితే, మారే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పెట్టుబడులను కొనసాగించేలా ఇన్వెస్టర్లను ప్రోత్సహించే విధంగా ఇది ఉంటుంది.
ఎవరికి అనువైనది?
ఒకే ఇన్వెస్ట్‌మెంట్ సాధనంతో మార్కెట్ క్యాప్‌ల వారీగా పెట్టుబడుల పెట్టేందుకు వీలుగా ఉండే సొల్యూషన్స్‌ని కోరుకునే ఇన్వెస్టర్లకు ఇది అనువుగా ఉంటుంది. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌ను వేర్వేరుగా పరిగణిస్తూ, ఆ పెట్టుబడులను ఎప్పుడు రీబ్యాలెన్స్ చేయాలనే దానిపై ఇన్వెస్టర్లు కసరత్తు చేయాల్సిన అవసరం లేకుండా ఇన్వెస్టర్లు ప్రొఫెషనల్స్ నిర్వహణలో ఉండే పోర్ట్‌ఫోలియోపై ఆధారపడొచ్చు. తద్వారా ఒకే పెట్టుబడి సాధనం ద్వారా భారత వృద్ధి గాథలో విస్తృతంగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ మల్టిక్యాప్ ఫండ్స్ అనువుగా ఉంటాయి. మధ్య నుంచి దీర్ఘకాలిక పెట్టుబడుల అవసరం ఉన్నవారు, అత్యధిక రిస్కు సామర్థ్యాలు ఉన్న వారు వీటిని ఎంచుకోవచ్చు. 
ఇదీ చదవండి: చైనాలో ఎంత బంగారమైనా కొనొచ్చా? గోల్డ్ రూల్స్ ఇవే..


