ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రభుత్వాలపై పెరుగుతున్న అప్పుల భారం, డాలర్ విలువలో మార్పులు.. ఇవన్నీ బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు.. పలు దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతున్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో పసిడి ధరలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే.. ప్రస్తుతం మార్కెట్లో మాత్రం బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.
ద్రవ్యోల్బణం పెరుగుతుందా?
అమెరికా ఫెడరల్ రిజర్వ్ రాబోయే సమావేశాల్లో వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలు.. పసిడి ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఒకే రోజు బంగారం ధర దాదాపు 2 శాతం పడిపోయి ఔన్సుకు 4,075 డాలర్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుందనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచితే, డాలర్కు డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో బాండ్లపై వచ్చే రాబడులు కూడా ఆకర్షణీయంగా మారతాయి. దీంతో పెట్టుబడిదారులు బంగారంలో పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసుకుని ఇతర మార్గాల వైపు మొగ్గు చూపవచ్చు. ఫలితంగా పసిడి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంటుంది.
సురక్షితమైన పెట్టుబడిగా బంగారం
అయితే.. ప్రస్తుత పరిస్థితులనే బంగారం ధరల భవిష్యత్తుకు పూర్తిస్థాయి సంకేతంగా చూడలేమని కొందరు ఫండ్ మేనేజర్లు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పెరిగినప్పుడు పెట్టుబడిదారులు తమ డబ్బుకు సురక్షితమైన పెట్టుబడులతో (గోల్డ్) ఇన్వెస్ట్ చేస్తారు. అలాంటి సమయంలో బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే.. ప్రస్తుతం ధరలు తగ్గుతున్నప్పటికీ, రానున్న రోజుల్లో మళ్లీ అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ట్రాయ్ అసెట్ మేనేజ్మెంట్ ఫండ్ మేనేజర్ షార్లెట్ యంగ్ అంచనా ప్రకారం.. రాబోయే 12 నుంచి 18 నెలల్లో బంగారం ధరలు ఎవరూ ఊహించని స్థాయికి చేరుకుంటాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, డొనాల్డ్ ట్రంప్ తీసుకునే అనూహ్య నిర్ణయాలు ప్రపంచ మార్కెట్లలో అస్థిరతను పెంచే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులే బంగారానికి డిమాండ్ పెంచుతాయని చెబుతున్నారు.
ఇదీ చదవండి: పండగొచ్చిందని బంగారం కొంటున్నారా? ఈ విషయం తెలుసుకోండి!


