అమ్మో.. ఆయన మాటలు నిజమౌతాయా? | Silver Prices At Rs 2 lakh Rich Dad Poor Dad Robert Kiyosakis Prediction Sparks Debate, Know More Details | Sakshi
Sakshi News home page

అమ్మో.. ఆయన మాటలు నిజమౌతాయా?

Jun 19 2025 3:11 PM | Updated on Jun 19 2025 3:48 PM

Silver prices at Rs 2 lakh Rich Dad Poor Dad Robert Kiyosakis Predict Sparks Debate

ఓ వైపు బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూ రూ.లక్షను (10 గ్రాములకు) చేరుకుంటే ఇంకో వైపు మరో విలువైన లోహం వెండి కూడా రికార్డుల మోత మోగిస్తోంది. ఇజ్రాయెల్‌–ఇరాన్‌ మధ్య తీవ్ర ఘర్షణల నేపథ్యంలో వెండి, బంగారం ధరల ర్యాలీ కొనసాగింది. ముఖ్యంగా వెండి ధర గత ఆల్‌టైమ్‌ గరిష్టం రూ.1,08,100ను అధిగమించింది. ఢిల్లీ మార్కెట్లో రూ.1,000 పెరిగి రూ.1,08,200 స్థాయికి చేరుకుంది. మరోవైపు 99.9 శాతం స్వచ్ఛత బంగారం రూ.1,00,710 స్థాయిని తాకింది. రూ.540 లాభపడింది. ‘అంతర్జాతీయ మార్కెట్లో 2012 ఫిబ్రవరి తర్వాత మొదటిసారి 37 డాలర్లను వెండి అధిగమించింది.

ఈ నేపథ్యంలో ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మాటలపై అటు ఇన్వెస్టర్లతో పాటు ఇటు సామాన్య జనంలోనూ చర్చ సాగుతోంది. అమ్మో బంగారం అంత పెరిగింది... ఇంత పెరిగింది.. అని చర్చించుకుంటున్న జనం ఇప్పుడు పెరుగుతున్న వెండి ధరలను చూసి నోరెళ్లబెడుతున్నారు. ఆర్థిక అంశాల్లో ఎప్పటికప్పుడు తన అంచనాలను వెల్లడించే రాబర్ట్‌ కియోసాకి ఇటీవల వెండి గురించి సంచలన అభిప్రాయం ప్రకటించారు. కిలో వెండి ధర రూ.2 లక్షలకు చేరొచ్చని కియోసాకి అభిప్రాయపడ్డారు.


👉 ఇదిగో ఈ ఖర్చులే జేబులు ఖాళీ చేసేది!


 

ఇటీవలి ఆర్థిక అస్థిరత, స్థిరమైన ఆస్తులకు పెరుగుతున్న డిమాండ్ గురించి ప్రస్తావిస్తూ కియోసాకి వెండిని దాని పారిశ్రామిక ఉపయోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా రక్షణ కవచంగా ఉదహరిస్తూ "నేడు ప్రపంచంలోనే భలే మంచి బేరం" అని అభివర్ణించారు. అంటే వెండి ఇప్పుడే కొనుక్కోండి.. రాబోయే రోజుల్లో కొనడం కష్టమవుతుందున్న భావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర రూ.1.06 లక్షలుగా ఉండగా, వెండి ఇప్పటికే గత ఏడాదిగా అద్భుతమైన లాభాలను చవిచూసింది.

ఆర్థిక విశ్లేషకులు ఆచితూచి ఆశావహంగా ఉన్నారు. కొంతమంది కియోసాకి అంచనాను తీవ్రమైనదిగా భావిస్తుండగా, మరికొందరు ఆయనతో ఏకీభవిస్తున్నారు. ఇందుకు ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన సాంకేతికతలలో పెరిగిన వెండి వినియోగం, అలాగే పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను ఎత్తి చూపుతున్నారు. వెండి జోరు నిజమే కానీ ఏకంగా రూ.2 లక్షలకు చేరుతుందా అన్నదానిపై ‘దీనికి కొన్ని తీవ్రమైన కారణాలు ఉండవచ్చు' అని ముంబైకి చెందిన కమోడిటీస్ స్ట్రాటజిస్ట్ మీరా దేశ్ పాండే అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement