
సెక్యూరిటీలలో 10 శాతం ఇన్వెస్ట్‌మెంట్స్
సెబీ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: దేశీయంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులపట్ల కుటుంబాలలో ఆసక్తి కనిపిస్తున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చేపట్టిన సర్వే పేర్కొంది. కుటుంబ ఆదాయాలలో 10 శాతం సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలియజేసింది. కుటుంబీకులలో 63 శాతం కనీసం ఒక మార్కెట్ ప్రొడక్ట్‌పై అవగాహన ఉన్నట్లు సెబీ ఇన్వెస్టర్ల సర్వే వెల్లడించింది. సెక్యూరిటీలలో పట్టణ ప్రాంతాల నుంచి 15 శాతం పార్టిసిపేషన్ కనిపించగా.. గ్రామీణ ప్రాంతాలలో 6 శాతమే పెట్టుబడులు నమోదయ్యాయి.
రాష్ట్రాలలో 20.7 శాతం వాటాతో ఢిల్లీ ఆధిపత్యంవహించగా.. 15.4 శాతం కుటుంబాల పార్టిసిపేషన్‌తో గుజరాత్ తదుపరి ర్యాంకులో నిలిచింది. అయితే 36 శాతంమంది ఇన్వెస్టర్లకు మాత్రమే సెక్యూరిటీ మార్కెట్లపట్ల ఓమాదిరి అవగాహన ఉన్నట్లు సర్వే తెలియజేసింది. దీంతో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ విస్తరించవలసిన అవసరం ఉన్నట్లు అభిప్రాయపడింది.
పెట్టుబడి రక్షణకే ఓటు
సెబీ తాజా సర్వే ప్రకారం 80 శాతం కుటుంబీకులు అధిక రిటర్నులకంటే పెట్టుబడి పరిరక్షణకే ప్రాధాన్యత ఇస్తున్నారు. వెరసి వివిధ వయసులవారు రిస్క్ తీసుకోవడంలో విముఖత చూపుతున్నట్లు సర్వే తెలియజేసింది. నిజానికి జెన్‌జెడ్ కుటుంబీకులలోనూ 79 శాతంమంది రిస్‌్కలకు వెనకాడుతున్నట్లు పేర్కొంది. ప్రధానంగా ఫైనాన్షియల్ ప్రొడక్టులలో క్లిష్టత, అవగాహనాలేమి, విశ్వాసరాహిత్యం, నష్టాల భయం వంటి అంశాలు అధికశాతం మందిలో పెట్టుబడులకు అడ్డుతగులుతున్నట్లు వివరించింది. దేశీ మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్(యాంఫీ)తోపాటు.. ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌డీఎల్, సీడీఎస్‌ఎల్ తదితర మార్కెట్ ఇన్‌ఫ్రా సంస్థల సహకారంతో సెబీ ఇన్వెస్టర్ల సర్వే చేపట్టింది. సుమారు 400 పట్టణాలలోని 90,000 కుటుంబాలు, 1,000 గ్రామాలలో సర్వే నిర్వహించింది.