న్యూఢిల్లీ: దేశీయంగా అతి పెద్ద ఫండ్ హౌస్ అయిన ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం లభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఇష్యూ పరిమాణం సుమారు రూ. 13,000 కోట్లుగా ఉండొచ్చని, వచ్చే నెలలో ప్రారంభం కావొచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నాయి. మార్చి నెలలో కంపెనీ సమర్పించిన ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం ప్రమోటర్లు 20.37 కోట్ల వరకు షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) విధానంలో విక్రయించనున్నారు. తాజా షేర్ల జారీ ఉండదు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్యారిస్‌కి చెందిన ఆమండి మధ్య జాయింట్ వెంచర్‌గా 1987లో ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ ఏర్పాటైంది. ఇందులో ఎస్‌బీఐకి 61.98 శాతం, ఆమండికి 36.40 శాతం వాటాలు ఉన్నాయి. త్రైమాసిక సగటు ప్రాతిపదికన ఎస్‌బీఐ ఎంఎఫ్ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం దాదాపు రూ. 12.5 లక్షల కోట్లుగా ఉంటుంది. ఇప్పటికే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, యూటీఐ ఏఎంసీ, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ, శ్రీరామ్ ఏఎంసీ, నిప్పన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్‌మెంట్ మొదలైనవి మ్యుచువల్ ఫండ్ విభాగం నుంచి లిస్టయిన సంస్థల్లో ఉన్నాయి.
లిస్టులో మరో 4 కంపెనీలు
మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మరో నాలుగు కంపెనీల ఐపీవోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏజీఎస్ హెల్త్, పీజీపీ గ్లాస్, శ్రేణి షేర్స్, ఎస్‌ఆర్‌ఐటీ ఇండియా ఈ జాబితాలో ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చ్ మధ్యలో ఈ కంపెనీలు ముసాయిదా పత్రాలను దాఖలు చేయగా, జూన్ 16–19 మధ్య సెబీ.. అబ్జర్వేషన్లు ఇచ్చింది. సెబీ పరిభాషలో వీటిని నియంత్రణ సంస్థ ఆమోదంగా పరిగణిస్తారు. ఏజీఎస్ హెల్త్, పీజీపీ గ్లాస్ మార్చి నెలలో తమ ముసాయిదా పత్రాలను గోప్యతా విధానంలో సెబీకి సమర్పించాయి. స్టాక్ బ్రోకింగ్ సంస్థ శ్రేణి షేర్స్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూలో 69 లక్షల షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రస్తుత షేర్‌హోల్డర్లు 82 లక్షల వరకు షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) కింద విక్రయించనున్నారు.
తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధులను వర్కింగ్ క్యాపిటల్.. సాధారణ కార్పొరేట్ అవసరాలు, నిర్దిష్ట రుణాల చెల్లింపు మొదలైన వాటి కోసం కంపెనీ ఉపయోగించుకోనుంది. ఇక ఎస్‌ఆర్‌ఐటీ ఇండియా ఐపీవోలో భాగంగా మొత్తం 1.68 కోట్ల షేర్లను తాజా ఇష్యూ కింద కంపెనీ విక్రయించనుంది. ఐపీవో నిధులను ప్రస్తుత ఉత్పత్తుల ఆధునీకరణ, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, ఇతర సంస్థల కొనుగోళ్లు మొదలైన వాటి కోసం కంపెనీ విక్రయించనుంది.


