
జనరల్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్ల లిస్టింగ్‌కు యోచన
ఎస్‌బీఐ గ్రూప్ చైర్మన్ సీఎస్ శెట్టి వెల్లడి
తెలుగు రాష్ట్రాల్లో 30 ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ శాఖలు ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రెండు అనుబంధ సంస్థల పబ్లిక్ ఇష్యూపై కసరత్తు చేస్తోందని ఎస్‌బీఐ గ్రూప్ చైర్మన్ చల్లా శ్రీనివాసులు (సీఎస్) శెట్టి తెలిపారు. ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ వీటిలో ఉన్నాయని చెప్పారు. స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్‌కు సంబంధించి నిర్దిష్ట గడువేదీ నిర్దేశించుకోలేదని పేర్కొన్నారు.
గ్రూప్‌లో ప్రస్తుతం 18 అనుబంధ సంస్థలు ఉన్నాయని, వీటిపై సుమారు రూ.6,500 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, వాటి విలువ ప్రస్తుతం రూ.4 లక్షల కోట్ల పైచిలుకు ఉంటుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అనకాపల్లి, ఖమ్మం తదితర ప్రాంతాల్లో ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన 30 హెల్త్ ఇన్సూరెన్స్ శాఖలను శనివారం ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఇవి ప్రత్యేకంగా ఆరోగ్య బీమా సర్వీసులను అందించేందుకే ఉద్దేశించినవని శ్రీనివాసులు శెట్టి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 2,100 పైగా ఆస్పత్రుల నెట్‌వర్క్‌తో సేవలు అందిస్తున్నట్లు ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ నవీన్ చంద్ర ఝా చెప్పారు.
టారిఫ్‌ల అనిశ్చితి తొలగిపోతే మంచిది..
భారత్‌పై అమెరికా టారిఫ్‌ల వల్ల ప్రత్యక్షంగా పడే ప్రభావం తక్కువే అయినప్పటికీ, వాటి వల్ల తలెత్తిన అనిశ్చితి సాధ్యమైనంత త్వరగా తొలగిపోతే మంచిదని శ్రీనివాసులు శెట్టి అభిప్రాయపడ్డారు. అమెరికాకు ఎక్కువగా ఎగుమతయ్యే రసాయనాలు, టెక్స్‌టైల్స్, ఆభరణాలు, తెలుగు రాష్ట్రాల నుంచి ఆక్వా తదితర రంగాలకు టారిఫ్‌ల వల్ల సవాళ్లు తలెత్తవచ్చని చెప్పారు. అయితే, టారిఫ్‌ల ప్రభావిత రంగాలకు రుణాలు స్వల్ప స్థాయిలోనే ఉన్నందున తమ బ్యాంకుపై ప్రభావం పెద్దగా ఉండదని తెలిపారు.