
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన క్రెడిట్ కార్డు (Credit Card) వినియోగదారులకు నవంబర్ 1 నుండి కొత్త ఛార్జీల విధానాన్ని ప్రకటించింది. ఈ కొత్త నిబంధన ప్రకారం.. ఎస్బీఐ క్రెడిట్ కార్డును ఉపయోగించి క్రెడ్, చెక్ లేదా మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్ల ద్వారా స్కూల్ లేదా కాలేజీ ఫీజులను చెల్లిస్తే, వారు లావాదేవీ మొత్తంలో 1% అదనపు ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆయా స్కూల్ లేదా కాలేజీలు, విశ్వవిద్యాలయాల అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా పీఓఎస్ మెషీన్ ద్వారా నేరుగా చెల్లింపు చేస్తే ఎటువంటి రుసుము ఉండదు.
మరో కొత్త ఛార్జీ ఏంటంటే ఎస్బీఐ కార్డుదారులు రూ .1,000 కంటే ఎక్కువ మొత్తంతో వాలెట్ లోడ్ చేస్తే, 1% రుసుము వర్తిస్తుంది. ఈ నియమం నెట్ వర్క్ భాగస్వాముల ద్వారా సెట్ చేసిన మర్చంట్ కోడ్ లకు వర్తిస్తుంది. ఈ మార్పు గురించి ఎస్బీఐ కార్డుదారులకు ముందుగానే తెలియజేసింది. తద్వారా వారు తమ ఖర్చులను సముచితంగా ప్లాన్ చేసుకోవచ్చు. గతంలో రూ.500 వరకు లావాదేవీలపై రుసుము ఉండేది కాదు.
ఇక నగదు ఉపసంహరణ రుసుములు, చెక్ చెల్లింపు రుసుములు , ఆలస్య చెల్లింపు రుసుములు వంటి ఇతర సాధారణ ఛార్జీలు మారవు. అయితే, వరసగా రెండు బిల్లింగ్ సైకిల్స్లో కనీస నెలవారీ బ్యాలెన్స్ చెల్లించడంలో విఫలమైనట్లయితే, ప్రతి సైకిల్ కు అదనంగా రూ.100 ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.