
విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల అభివృద్ధి కోసం రూ.వందలు, రూ.వేలు, రూ.లక్షల్లో.. విరాళం ఇవ్వడం సహజంగా చూస్తూంటాం. కానీ తమను అంతటివారిని చేసిన బడి కోసం ఏకంగా రూ.300 కోట్లు విరాళం ఇచ్చి వార్తల్లో నిలిచారు. ఇంతకీ వారు ఎవరని అనుకుంటున్నారా.. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ అజయ్ బంగా, ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ ఛైర్మన్ ప్రేమ్ వత్స. ఇంతకీ వారు విరాళం ఇచ్చిన, వారు చదివిన పాఠశాల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్‌పీఎస్).
హెచ్‌పీఎస్‌లోని మౌలిక సదుపాయాలను ఆధునీకరించడానికి, ఉన్న సదుపాయాలను మరింత విస్తరించడానికి ఈ విరాళం ప్రకటించారు. ఈ సహకారం పూర్వ విద్యార్థుల నేతృత్వంలో భారతదేశంలోని అతిపెద్ద విద్యా విరాళాల్లో ఒకటిగా నిలిచింది. క్రెడాయ్ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విరాళానికి సంబంధించిన వివరాలు పంచుకుంటూ సదరు సీఈఓలను ప్రశంసించారు. తాము చదువుకున్న నగరానికి, పాఠశాలకు తిరిగి సాయం చేయాలనుకుంటున్నట్లు సీఎం చెప్పారు.
ఇదీ చదవండి: రక్షణ రంగంలో స్టార్టప్‌లతో స్వావలంబన
ఈ నిధులను కొత్త అకడమిక్ బ్లాక్ నిర్మాణానికి, ఇప్పటికే ఉన్న కొన్ని తరగతి గదులను పునరుద్ధరించడానికి వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రణాళిక పాఠశాల విస్తృత విజన్ 2050కు అనుగుణంగా ఉందని చెప్పారు. ఈ శతాబ్దం మధ్య కాలం నాటికి హెచ్‌పీఎస్‌ను ప్రపంచంలోని టాప్-10 పాఠశాలల్లో ఒకటిగా ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈమేరకు రెండు సంవత్సరాల క్రితం జరిగిన శతాబ్ది ఉత్సవాల్లోనే నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. రూ.150 కోట్లతో రూపొందించిన విజన్ 2050 బ్లూప్రింట్‌లో అకడమిక్ అప్‌గ్రేడ్స్, గ్లోబల్ పార్టనర్‌షిప్స్, స్పోర్ట్స్ ఎక్సలెన్స్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి. 1923లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ను స్థాపించారు.