రష్యాలో ప్లేగు అనుమానాలపై డబ్ల్యూహెచ్‌ఓ ఆరా | Russia Siberia Health Scare WHO Demands Clarity Over Mysterious Death | Sakshi
Sakshi News home page

రష్యాలో ప్లేగు అనుమానాలపై డబ్ల్యూహెచ్‌ఓ ఆరా

Oct 8 2026 9:13 AM | Updated on Oct 8 2026 9:13 AM

Russia Siberia Health Scare WHO Demands Clarity Over Mysterious Death

రష్యాలోని సైబీరియాలో ఓ ల్యాబ్‌లో పని చేస్తున్న ఉద్యోగి మృతిపై నెలకొన్న అనుమానాల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సమగ్ర సమాచారాన్ని కోరింది. 28 ఏళ్ల దర్యా షిపిలోవా అనే ల్యాబ్‌ ఉద్యోగి ఇటీవల న్యూమోనియాతో మరణించగా వ్యాధికి కచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదని రష్యా అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుమారు 200 మందిని తొలుత క్వారంటైన్‌లో ఉంచారు.

సమగ్ర సమాచారం ఇవ్వాల్సిందే..

డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గెబ్రేయేసస్‌ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. న్యూమోనియాకు కారణమైన వ్యాధికారక సూక్ష్మజీవి ఏదో, అనారోగ్యానికి దారితీసిన పరిస్థితులు ఏమిటనే అంశాలపై పూర్తి సమాచారం ఇవ్వాలని రష్యాను కోరారు. మరో ఉద్యోగికి కూడా కారణం తెలియని న్యూమోనియా సోకినట్లు వస్తున్న మీడియా కథనాలపై వివరాలు ఇవ్వాలని డబ్ల్యూహెచ్‌ఓ కోరింది. అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల ప్రకారం సమయానుకూలంగా, సంపూర్ణంగా, పారదర్శకంగా సమాచారాన్ని పంచుకోవడం అత్యవసరమని టెడ్రోస్‌ పేర్కొన్నారు.

మీడియాలో తప్పుడు కథనాలు

మరోవైపు, రష్యా ఆరోగ్య పర్యవేక్షణ సంస్థ మృతురాలితో సంబంధం ఉన్న వ్యక్తుల్లో ఇప్పటివరకు ప్లేగు కేసులు గుర్తించలేదని తెలిపింది. క్వారంటైన్‌లో ఉంచిన వారిలో 60 శాతం మందిని విడుదల చేసినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. డబ్ల్యూహెచ్‌ఓ మరింత సమాచారం కోరడంపై క్రెమ్లిన్‌ స్పందిస్తూ.. రష్యా తనకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని నిర్ణీత విధానాల ప్రకారం డబ్ల్యూహెచ్‌ఓకు అందించిందని తెలిపింది. అదే సమయంలో, ఘటనపై మీడియా ప్రచారం చేస్తున్న కొన్ని కథనాలను క్రెమ్లిన్‌ తప్పుడు సమాచారంగా అభివర్ణించింది.

అసలేం జరిగిందంటే..

దర్యా షిపిలోవా (28) సైబీరియాలోని ఇర్కుట్స్క్‌ యాంటీ-ప్లేగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేశారు. అక్టోబర్‌ 2న ఆమె మరణించారు. రష్యా అధికారికంగా ఆమె మృతిపై స్పందిస్తూ.. తెలియని కారణంతో వచ్చిన న్యూమోనియా వల్ల చనిపోయినట్లు తెలిపింది. అయితే ప్లేగు అని మాత్రం నిర్ధారించలేదు. ఆమె పనిచేసేది ప్లేగు వంటి ప్రమాదకర వ్యాధికారకాలను అధ్యయనం చేసే సంస్థలో కావడంతో మొదట రష్యన్‌ మీడియా, సోషల్‌ మీడియాల్లో ల్యాబ్‌లో ప్రమాదం జరిగిందా? లేదా ప్లేగు సోకిందా? అనే అనుమానాలు వ్యాపించాయి. ల్యాబ్‌లో టెస్ట్‌ట్యూబ్‌ పగిలిందనే కథనాలు కూడా వచ్చాయి.

అయితే రష్యా అధికారులు అలాంటి ల్యాబ్‌ ప్రమాదాన్ని ఖండించారు. ఆమెతో సంబంధం ఉన్న సుమారు 200 మందిని తొలుత క్వారంటైన్‌/మెడికల్‌ అబ్జర్వేషన్‌లో ఉంచారు. రష్యా ఆరోగ్య నియంత్రణ సంస్థ రోస్పోట్రెబ్నాడ్జోర్‌ ప్రకారం, మృతురాలిలో పరిచయం ఉన్న వ్యక్తుల్లో ప్లేగు గుర్తించలేదు. వందలాది పరీక్షల్లో ప్రమాదకర వ్యాధికారకాలు కనిపించలేదని తెలిపింది.

ఇదీ చదవండి: ప్రజాధనం ఖర్చు చేస్తున్నా.. లెక్కలు సున్నా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement