50 ఏళ్లుగా వెండి ధరను అణిచేస్తున్నారా? | Robert Kiyosaki says 50 YEARS OF SUPPRESSED SILVER | Sakshi
Sakshi News home page

50 ఏళ్లుగా వెండి ధరను అణిచేస్తున్నారా?

Sep 27 2026 2:27 PM | Updated on Sep 27 2026 3:20 PM

Robert Kiyosaki says 50 YEARS OF SUPPRESSED SILVER

వెండి ధరలు, దాని పారిశ్రామిక ప్రాధాన్యంపై ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ నిపుణుడు, ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ రచయిత రాబర్ట్‌ కియోసాకి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెండి మార్కెట్‌ను 50 ఏళ్లుగా ఉద్దేశపూర్వకంగా అణిచివేస్తున్నారంటూ కియోసాకి ఆరోపించారు. వెండిని బ్యాంకులు పెద్దఎత్తున నిల్వ చేసుకుంటున్నాయని, మరోవైపు సాధారణ ఇన్వెస్టర్లు మాత్రం కేవలం పేపర్‌ ఆస్తులపైనే ఆధారపడేలా ఆర్థిక వ్యవస్థను తయారు చేశారని ఆయన తన ఫేస్‌బుక్‌ పోస్టులో పేర్కొన్నారు.

సాధారణ ఇన్వెస్టర్లు మార్కెట్‌ పతనాలను చూసి భయపడుతుంటే, సంపన్న పెట్టుబడిదారులు మాత్రం వాటిని అవకాశాలుగా చూస్తారని కియోసాకి అన్నారు. మార్కెట్లు కుప్పకూలినప్పుడు వ్యూహాత్మక ఆస్తులను తక్కువ ధరలకు కొనుగోలు చేసి సంపదను మరింతగా పెంచుకుంటారని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారీ డెరివేటివ్స్‌ మార్కెట్‌ ఏర్పడటం వల్ల అధిక రిస్క్‌తో కూడిన ఆర్థిక సాధనాలు పెరిగాయని ఆయన అభిప్రాయపడ్డారు.

వెండి కేవలం ఆభరణాల తయారీకే పరిమితమైన లోహం కాదని కియోసాకి వివరించారు. కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో వెండిని ఉపయోగిస్తున్నారని, సోలార్‌ ప్యానెళ్లు, సైనిక అవసరాల్లోనూ దీనికి డిమాండ్‌ ఉందని అన్నారు. ప్రపంచంలో ఇప్పటికే 95 శాతం వెండి వినియోగించేశారన్న ఆయన బంగారంలా వెండిని పెద్దఎత్తున నిల్వ చేయలేమని, అందువల్ల కొన్ని సందర్భాల్లో వెండికి బంగారం కంటే ఎక్కువ విలువ ఉండొచ్చని వ్యాఖ్యానించారు. టోమాహాక్‌ క్షిపణుల్లోనూ గణనీయమైన మొత్తంలో వెండి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

వెండి మార్కెట్‌ను పెద్ద బ్యాంకులు కృత్రిమంగా నియంత్రించి ధరను తక్కువగా ఉంచుతున్నాయని కియోసాకి ఆరోపించారు. ఈ సందర్భంగా జేపీ మోర్గాన్‌ గతంలో చెల్లించిన 920 మిలియన్‌ డాలర్ల జరిమానాను ప్రస్తావించారు.

ఇక మ్యూచువల్‌ ఫండ్లు, 401(k) వంటి పేపర్‌ ఆస్తులపై మాత్రమే ఆధారపడటం కంటే వాస్తవ ఆస్తులపై దృష్టి పెట్టాలని కియోసాకి సూచించారు. సంపన్నులు ఆస్తులను కొనుగోలు చేస్తే, పేద, మధ్యతరగతి ప్రజలు తరచూ ఆస్తులుగా భావించే బాధ్యతలను (లయబిలిటీస్‌) కూడబెట్టుకుంటారని తన పాత సిద్ధాంతాన్ని మరోసారి ప్రస్తావించారు. జీతాల కొనుగోలు శక్తి తగ్గుతున్న సమయంలో వ్యూహాత్మక లోహాల ప్రాధాన్యాన్ని గుర్తించాలని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఆస్తులు ఉచితమే.. అప్పులూ ఉచితమే!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement