జియో ఫ్రీ రీచార్జ్‌ ఆఫర్ గురించి తెలుసా? | Reliance Jio 6 months free recharge offer | Sakshi
Sakshi News home page

జియో ఫ్రీ రీచార్జ్‌ ఆఫర్ గురించి తెలుసా?

Sep 27 2026 2:00 PM | Updated on Sep 27 2026 2:06 PM

Reliance Jio 6 months free recharge offer

కొత్త ఫోన్ కొంటున్నారా? అయితే 6 నెలలు రీచార్జ్‌ ఉచితంగా పొందే అవకాశం ఉందని మీకు తెలుసా? కొత్త ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునే జియో వినియోగదారులకు రిలయన్స్ జియో ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. జియో 10వ వార్షికోత్సవం సందర్భంగా 2026 సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 20 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అయితే ఇది ప్రతి కొత్త ఫోన్‌కు వర్తించే సాధారణ ఆఫర్ కాదు. జియో నిర్దేశించిన ఫోన్‌ను (Eligible Device) ఈ కాలంలో కొనుగోలు చేసి, జియో నెట్‌వర్క్‌లో తొలిసారి యాక్టివేట్ చేసిన వారికి మాత్రమే ప్రయోజనాలు లభిస్తాయి.

ఆరు రీఛార్జ్‌ల ప్రయోజనం

అర్హత పొందిన కస్టమర్లకు గరిష్ఠంగా ఆరు రీఛార్జ్ సైకిళ్ల వరకు ప్రయోజనం లభిస్తుంది. ఒక్కో సైకిల్‌కు 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతి సైకిల్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 0.5GB హైస్పీడ్ డేటా, మొత్తం 14GB డేటా, 300 SMSలు అందుతాయి. అయితే అంతర్జాతీయ కాల్స్, అంతర్జాతీయ SMSలు ఈ ప్రయోజనాల్లో ఉండవు. ఆరు సైకిళ్లను కలిపితే మొత్తం 168 రోజుల వ్యాలిడిటీ, 84GB డేటా, 1,800 SMSలు లభిస్తాయి.

ఈ ప్రయోజనాలు ఒకేసారి మొత్తం క్రెడిట్ కావు. జియో నిబంధనల ప్రకారం, కస్టమర్ IMEI–మొబైల్ నంబర్ (MSISDN) లింక్‌ను నిరంతరం ఒక రీఛార్జ్ సైకిల్ పాటు కొనసాగించిన తర్వాత తదుపరి రీఛార్జ్ ప్రయోజనం క్రెడిట్ అవుతుంది. ఒకవేళ ప్రయోజనాలను ఉపయోగించుకోకపోతే తర్వాతి సైకిల్‌కు క్యారీ ఫార్వర్డ్ చేసేందుకు వీలుండదు.

సిమ్ విషయంలో ఈ నిబంధన తప్పనిసరి

ఈ ఆఫర్‌లో అత్యంత ముఖ్యమైన షరతు జియో సిమ్‌ను ఫోన్‌లోని సిమ్‌ స్లాట్‌ 1 లేదా ప్రైమరీ సిమ్‌ స్లాట్‌లోనే ఉంచడం. ఆరు సైకిళ్ల ప్రయోజనాల కాలంలో IMEI, మొబైల్ నంబర్ లింక్‌ కూడా కొనసాగాలి. జియో సిస్టమ్‌లో ఈ లింక్‌ సరిపోలకపోతే ప్రయోజనాలకు అర్హత కోల్పోయే అవకాశం ఉంది.

కొత్త జియో సిమ్ తీసుకున్నా, మరో నెట్‌వర్క్ నుంచి జియోకు పోర్ట్ చేసినా లేదా ఇప్పటికే ఉన్న జియో సిమ్‌ను అర్హత ఉన్న కొత్త పరికరంలో యాక్టివేట్ చేసినా నిబంధనలకు అనుగుణంగా ప్రయోజనం పొందవచ్చు. అయితే పరికరం, సిమ్, IMEI–MSISDN జతపై జియో చేసే అర్హత తనిఖీ తప్పనిసరి.

ఇతర ప్రయోజనాలు

రీచార్జ్‌ ప్రయోజనాలతోపాటు మరిన్ని బినిఫిట్లు ఉన్నాయి. ఆఫర్‌లో భాగంగా అజియో (AJIO)పై రూ.1,000 కొనుగోలుకు రూ.200 తగ్గింపు, అభీబస్‌లో 25 శాతం వరకు తగ్గింపు, జూమ్‌ఇన్‌లో రూ.409 విలువైన ఫోటో ఫ్రేమ్ వంటి పార్టనర్ వోచర్లు కూడా ఉన్నాయి. వీటికి ఆయా భాగస్వామ్య సంస్థల ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి.

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. జియో అధికారిక నిబంధనల్లో ఈ ప్రయోజనాలకు సంబంధించిన రూ.950 వన్‌టైమ్‌ చార్జ్‌(OTC)ను పేర్కొంది. ఈ మొత్తం ఆఫర్ ప్రయోజనాలు, రీఛార్జ్ బెనిఫిట్లు, పార్టనర్ వోచర్ల డెలివరీ/ఎనేబుల్‌మెంట్‌కు కేటాయించిన మొత్తంగా నిబంధనల్లో వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement