దేశంలో దాదాపు అన్ని నగరాల్లోనూ రియల్ ఎస్టేట్ ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఐదేళ్ల క్రితం రూ.26 లక్షలకు కొనుగోలు చేసిన ఒక చిన్న ఫ్లాట్‌కు ఇప్పుడు రూ.42 లక్షల ఆఫర్ రావడం నోయిడా రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో పెరిగిన ధరలకు ఉదాహరణగా నిలిచింది. నోయిడా సెక్టార్ 52లో 2021లో 1 బీహెచ్‌కే ఫ్లాట్‌ను పెట్టుబడి కోసం కొనుగోలు చేసిన వివేక్ అనే వ్యక్తి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో వెల్లడించారు. అయితే మంచి ధర వచ్చినప్పటికీ ప్రస్తుతం ఆస్తిని విక్రయించే ఉద్దేశం తనకు లేదని ఆయన తెలిపారు.
వివేక్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2021లో రూ.26 లక్షలకు ఫ్లాట్‌ను కొనుగోలు చేసిన ఆయన, అందులో తాను నివసించబోనని ముందే నిర్ణయించుకున్నారు. అందుకే దాన్ని పెట్టుబడిగా మాత్రమే చూశారు. కొనుగోలు అనంతరం ఫ్లాట్‌ను ఫర్నిష్ చేసి, అద్దెకు ఇచ్చే బాధ్యతను ఒక ఏజెంట్‌కు అప్పగించారు. గత ఐదేళ్లలో తాను ఆ ఫ్లాట్‌ను కేవలం రెండుసార్లు మాత్రమే సందర్శించినట్లు చెప్పారు. సెక్టార్ 52కు ఢిల్లీ మెట్రో, నోయిడా మెట్రో సదుపాయాలు అందుబాటులో ఉండటంతో దాదాపు మొత్తం కాలంలో ఫ్లాట్ అద్దెకు కొనసాగిందని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల ఏజెంట్ ఫోన్ చేసి, ఆ ఫ్లాట్‌ను కొనుగోలు చేసేందుకు ఓ వ్యక్తి రూ.42 లక్షలు ఆఫర్ చేస్తున్నట్లు చెప్పడంతో విషయం ఆసక్తికరంగా మారింది. అంటే ఐదేళ్లలో కొనుగోలు ధరపై రూ.16 లక్షల పెరుగుదల నమోదైంది. ఇది సుమారు 61.5 శాతం ధర పెరుగుదల. అయితే ఇది స్థూల ధర పెరుగుదల మాత్రమే. ఫర్నిషింగ్ ఖర్చులు, రిజిస్ట్రేషన్/లావాదేవీ వ్యయాలు, పన్నులు, నిర్వహణ ఖర్చులు వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటే వాస్తవ పెట్టుబడి రాబడి దీనికంటే భిన్నంగా ఉంటుంది. అదేవిధంగా ఈ లెక్కలో ఐదేళ్ల అద్దె ఆదాయం కూడా కలపలేదు.
ధరల్లో భారీ మార్పు
వివేక్ వ్యక్తిగత అనుభవానికి మార్కెట్ గణాంకాలు కూడా కొంత మేర బలం చేకూరుస్తున్నాయి. అనరాక్ డేటా ప్రకారం 2020 తొలి త్రైమాసికం నుంచి 2025 తొలి త్రైమాసికం వరకు నోయిడాలో సగటు నివాస ధరలు చదరపు అడుగుకు రూ.4,795 నుంచి రూ.9,200కు పెరిగాయి. అంటే ఐదేళ్లలో సుమారు 92 శాతం వృద్ధి నమోదైంది. అదే కాలంలో గురుగ్రామ్‌లో సగటు ధరలు 84 శాతం పెరిగినట్లు ఆ నివేదిక ఆధారంగా వెల్లడైంది.
ఏదేమైనా తన ఫ్లాట్ విలువ పెరిగిందని, భారీ ఆఫర్ వచ్చిందని వివేక్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. చాలా మంది తమ అనుభవాలను, అభిప్రాయాలను కామెంట్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: రూ.711 కోట్ల ఇల్లు కొంటున్న ‘ఇంటర్’ బిజినెస్‌మ్యాన్!
I purchased a 1 BHK flat in Noida for 26 lakhs in 2021, since I was never going to live there, it was purely an investment(no emotional baggage). Got it furnished & gave the keys to the agent to rent out. Visited only twice in last 5 years. Thanks to Sector 52 being near the Delhi and Noida metros, the flat was never vacant for even a week in the last five years. The agent called 2 days back saying someone is offering 42 lakhs to buy it. I am not going to sell it because I don’t need the money now and somehow I became emotionally attached to it too! Moral: Real estate is still giving good returns even in 2026 and overtime whether it’s a person or possession, you would start loving it for real.
— VIVEK (@Mr_Vivekji) September 25, 2026


