ఆదాయం అంతంతే.. మార్జిన్లు కాపాడుతాయా! | Q2 IT Results Preview Big 5 Tech Giants Face 1 percent Growth | Sakshi
Sakshi News home page

ఆదాయం అంతంతే.. మార్జిన్లు కాపాడుతాయా!

Oct 7 2026 8:36 AM | Updated on Oct 7 2026 8:36 AM

Q2 IT Results Preview Big 5 Tech Giants Face 1 percent Growth

టాప్‌ 5 సంస్థల వృద్ధి 1 శాతానికి పరిమితం

క్యూ2 ఐటీ ఫలితాలపై నిపుణుల అంచనాలు 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దేశీ ఐటీ దిగ్గజాల ఆదాయాల వృద్ధి అంతంత మాత్రంగానే ఉండనుంది. అయితే మార్జిన్లు మాత్రం నిలకడగా కొనసాగనున్నాయి. డిస్క్రెషనరీ వ్యయాలను క్లయింట్లు తగ్గించుకుంటున్న నేపథ్యంలో ఏఐ కారణంగా సంప్రదాయ సర్వీసుల ఆదాయాలపై ఎంత మేర ప్రభావం పడుతుంది, బుకింగ్స్‌ ఎంత వరకు ఆదాయాల కింద మారతాయి అనే అంశాలపై కంపెనీలు ప్రధానంగా దృష్టి పెట్టొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

త్రైమాసికాలవారీగా తొలి క్వార్టర్‌తో పోలిస్తే టాప్‌ 5 ఐటీ కంపెనీల ఆదాయాలు రెండో త్రైమాసికంలో పెద్దగా మార్పేమీ లేకుండా 0.5–1 శాతం మాత్రమే వృద్ధి చెందవచ్చని రీసెర్చ్‌ సేవల సంస్థ అన్‌ఎర్త్‌ఇన్‌సైట్‌ పేర్కొంది. ‘‘క్యూ1తో పోలిస్తే క్యూ2 అంత మెరుగ్గా ఏమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఖర్చుల విషయంలో క్లయింట్ల బడ్జెట్లలో పెద్దగా మార్పేమీ కనిపించడం లేదు. భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అంతగా అవసరం లేని వాటిపై ఖర్చుల విషయంలో కంపెనీలు ముందుకెళ్లడం లేదు. కాంట్రాక్టులపై నిర్ణయాలు తీసుకోవడానికి కూడా చాలా సమయం పట్టేస్తోంది’’ అని సంస్థ వ్యవస్థాపకుడు గౌరవ్‌ వాసు తెలిపారు.

మరోవైపు, గతంలో దక్కించుకున్న కాంట్రాక్టుల నుంచి ఆదాయం రావడం మొదలు కావడం వల్ల క్రితం త్రైమాసికంతో పోలిస్తే క్యూ2 కొంత మెరుగ్గా కనిపించవచ్చని గార్ట్‌నర్‌ సీనియర్‌ ప్రిన్సిపల్‌ అనలిస్ట్‌ బిశ్వజిత్‌ మైతీ తెలిపారు. అయినప్పటికీ ఉత్పాదకతపై మరింతగా దృష్టి పెట్టడమనేది కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేస్తుండటం వల్ల విస్తృత స్థాయిలో మార్కెట్లో పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత మార్కెట్‌ ట్రెండ్స్‌ని బట్టి చూస్తుంటే దిగ్గజ ఐటీ సేవల కంపెనీల వృద్ధి ఒక మోస్తరుగానే ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్‌ 8న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) బోణీతో క్యూ2 ఆర్థిక ఫలితాల సీజన్‌ ప్రారంభం కానుంది. ఆక్టోబర్‌ 12న హెచ్‌సీఎల్‌ టెక్, 23న ఇన్ఫోసిస్‌ తమ ఫలితాలను ప్రకటించనుండటంతో నిపుణుల అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

పూర్తి సంవత్సరానికి గైడెన్స్‌ యథాతథం..

పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గరిష్ట ఆదాయ వృద్ధి అంచనాలను కొన్ని కంపెనీలు స్వల్పంగా 0.5 శాతం మేర పెంచినప్పటికీ, మిగతావాటి గైడెన్స్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని భావిస్తున్నట్లు వాసు తెలిపారు. టాప్‌ సంస్థల ఆదాయాలు 3–4 శాతం మేర పెరగొచ్చని అన్‌ఎర్త్‌సైట్‌ పేర్కొంది. అది కూడా డిమాండ్‌ పుంజుకోవడం వల్ల కాకుండా ఇతర సంస్థల కొనుగోళ్లు, విలీన లావాదేవీల వల్ల సాధ్యపడొచ్చని వివరించింది. టెక్‌ సేవల పరిశ్రమలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 3.6 బిలియన్‌ డాలర్ల విలువ చేసే 14 విలీన, కొనుగోళ్ల డీల్స్‌ నమోదైనట్లు పేర్కొంది.

మార్జిన్లపై ఒత్తిడి..

ప్రస్తుతం బుకింగ్స్‌ పటిష్టంగానే ఉన్నా, అవి ఆదాయంగా మారడంలో జాప్యం జరుగుతోంది. నిర్ణయాలు తీసుకోవడానికి దాదాపు 12–18 నెలల వరకు సమయం పట్టేయొచ్చనే అంచనాలు ఉన్నాయి. మార్జిన్లపై ఒత్తిడి కొనసాగుతుందని వాసు తెలిపారు. వేతనాల పెంపు ప్రభావాల నుంచి కంపెనీలు ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాయని, ఏఐపై పెట్టిన పెట్టుబడుల ప్రయోజనాలను డీల్స్‌ ద్వారా రాబట్టుకునే ప్రయత్నాలు పూర్తి స్థాయిలో జరగాల్సి ఉందని వివరించారు. మార్జిన్లను పెంచుకోవాలంటే కేవలం సర్వీసులకే పరిమితం కాకుండా, అప్లికేషన్లు, ప్లాట్‌ఫాంలు మొదలైన వాటిని కూడా విక్రయించాల్సి ఉంటుందని వాసు చెప్పారు.

టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్‌లాంటి సంస్థల మార్జిన్లు స్వల్పంగా మెరుగుపడొచ్చని, మధ్య స్థాయి సంస్థలు తమ ప్రస్తుత మార్జిన్లు నిలబెట్టుకోగలవని పేర్కొన్నారు. మరోవైపు, పెరగడానికి పెద్దగా అవకాశాలు లేకుండా మార్జిన్లు స్థిరంగా కొనసాగవచ్చని గార్ట్‌నర్‌ తెలిపింది. వినియోగాన్ని పెంచుకోవడం, ఆటోమేషన్‌తో ఉత్పాదకత పెరుగుతున్నప్పటికీ ఏఐపై పెట్టుబడులు పెట్టాల్సి వస్తుండటం, వేతనాలను పెంచడం, రేట్లను తగ్గించాలంటూ క్లయింట్ల నుంచి డిమాండ్లు వస్తుండటం వల్ల ఆ ప్రయోజనాలు పరిమితంగానే ఉంటున్నాయని వివరించింది. అటు క్లయింట్లు.. సాంకేతికతపై ఆచితూచి ఖర్చు చేస్తున్నాయని మైతీ పేర్కొన్నారు. రిసు్కలు తగ్గించే, వ్యయాలను నియంత్రించే, నిర్దిష్ట ఫలితాలను అందించే వాటికే ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు.  

ఆదాయాలకు ఏఐ దన్ను..

కంపెనీలు నెమ్మదిగా ఏఐ ఆదాయాలను ప్రకటిస్తున్నాయి. జూన్‌ త్రైమాసికంలో తమ మొత్తం ఆదాయంలో ఏఐ వాటా 8.2 శాతంగా ఉన్నట్లు ఇన్ఫోసిస్‌ వెల్లడించగా, వార్షిక ప్రాతిపదికన ఏఐ ఆదాయం 2.6 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉంటుందని టీసీఎస్‌ వెల్లడించింది.  ఈ నేపథ్యంలో పరిశ్రమలో ఏఐ ఆధారిత ఆదాయం వాటా 5 శాతం స్థాయిలో ఉందని వాసు చెప్పారు. అమెరికా, యూరప్‌ క్లయింట్ల బడ్జెట్‌లో అధిక భాగాన్ని ఏఐ ప్లాట్‌ఫాంలు, స్టార్టప్‌లకు కేటాయించడం పెరుగుతోందన్నారు. శాప్, ఒరాకిల్‌ లాంటి సాఫ్ట్‌వేర్‌ వెండార్లు.. ఏఐని పొందుపర్చిన మరిన్ని ఉత్పత్తులను విక్రయిస్తున్నాయని పేర్కొన్నారు. జెనరేటివ్, ఏజెంటిక్‌ ఏఐ మొదలైన వాటితో మేనేజ్డ్‌ సర్వీసెస్‌, సర్వీస్‌ డెస్క్‌ విధుల్లో ఉద్యోగుల అవసరం తగ్గుతోందని గార్ట్‌నర్‌ వివరించింది.

ఇదీ చదవండి: ‘ఓటు హక్కు హరిస్తే’.. న్యాయస్థానాల హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement