రూ.16,000 కోట్ల వసూలు లక్ష్యం  | PNB CEO targets record-low bad loans ratio by increasing debt recovery | Sakshi
Sakshi News home page

రూ.16,000 కోట్ల వసూలు లక్ష్యం 

May 26 2025 5:31 AM | Updated on May 26 2025 5:31 AM

PNB CEO targets record-low bad loans ratio by increasing debt recovery

ఒక శాతం లోపే కొత్త మొండి బకాయిలు  

పీఎన్‌బీ ఎండీ అశోక్‌ చంద్ర 

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున మొండి బకాయిల (ఎన్‌పీఏ) వసూలు లక్ష్యాన్ని పెట్టుకుంది. రూ.16,000 కోట్ల వసూళ్లతోపాటు.. కొత్త ఎన్‌పీఏలను ఒక శాతం లోపునకు పరిమితం చేయనున్నట్టు, అదే సమయంలో లాభదాయకతను కొనసాగించడానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు బ్యాంక్‌ ఎండీ, సీఈవో అశోక్‌చంద్ర తెలిపారు. ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆయన పలు వివరాలను వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో పీఎన్‌బీ వసూళ్లు రూ.4,733 కోట్లుగా ఉన్నాయి. 

2024–25 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద వసూళ్లు రూ.14,000 కోట్లుగా ఉండడం గమనార్హం. ఇక కొత్త ఎన్‌పీలుగా 0.73 శాతంగానే ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ గరిష్ట స్థాయిలో వసూళ్లు చేసుకోవడం, తాజా ఎన్‌పీఏలను వీలైనంత కనిష్టానికి కట్టడి చేయడం తమ ప్రాధాన్యమని అశోక్‌ చంద్ర తెలిపారు. త్రైమాసికం వారీ తాజా ఎన్‌పీఏలు రూ.1,500–1,700 కోట్ల మధ్య ఉండొచ్చని చెప్పారు. సాంకేతిక మాఫీ రూపంలో రూ.6,000 కోట్ల వసూలును సాధించనున్నట్టు తెలిపారు. అధిక విలువ కలిగిన మొండి ఖాతాల్లేవంటూ.. చాలా వరకు ఎన్‌పీఏ ఖాతాలు ఒక్కోటీ రూ.25–50 కోట్ల మధ్యనున్నవేనని పేర్కొన్నారు.  

ర్యామ్‌ రుణాలకు ప్రాధాన్యం.. 
రిటైల్, అగ్రికల్చరల్, ఎంఎస్‌ఎంఈ (ఆర్‌ఏఎం/ర్యామ్‌) రంగాలకు రుణాల వెయిటేజీని 58 శాతానికి పెంచుకోనున్నట్టు అశోక్‌ చంద్ర తెలిపారు. ఇందుకోసం ఎన్నో చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. కార్పొరేట్‌ రుణాలు, రెపో ఆధారిత రుణాల్లో తగ్గిన రేట్ల ప్రభావాన్ని అధిగమించడానికి ర్యామ్‌ పోర్ట్‌ఫోలియో కుషన్‌గా ఉంటుందన్నారు. 2025 మార్చి నాటికి ర్యామ్‌ పుస్తకం మొత్తం రుణాల్లో 56 శాతంగా (రూ.6,02,682 కోట్లు) ఉన్నట్టు తెలిపారు. తదుపరి రుణ రేట్ల కోత ప్రభావాన్ని సైతం ఎదుర్కొనేందుకు ర్యామ్‌ విభాగం మద్దతుగా నిలుస్తుందన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 12 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో లాభదాయకతను పెంచుకోవడంలో పీఎన్‌బీ ముందుంది. గత ఆర్థిక సంవత్సరంలో పీఎన్‌బీ లాభం అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూసుకుంటే 102 శాతం వృద్ధి చెందింది. రూ.8,245 కోట్ల నుంచి రూ.16,630 కోట్లకు లాభం పెరిగింది. మొత్తం వ్యాపారం 14 శాతం పెరిగి రూ.26.83 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం.   
 

Advertisement
 
Advertisement
Advertisement