దేశంలోని యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం ఇంటర్న్‌షిప్ పథకం (PMIS) ఆశించిన ఫలితాలను ఇవ్వడంలో వెనుకబడుతోంది. భారీ బడ్జెట్ కేటాయింపులు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో నిధుల వినియోగం నామమాత్రంగా ఉంటోంది. ఇందుకు అభ్యర్థుల నుంచి స్పందన తగ్గడం ఆందోళన కలిగిస్తోంది.
నిధుల వినియోగంలో భారీ వ్యత్యాసం
కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలు విస్తుపోయే నిజాలను వెల్లడిస్తున్నాయి. 2025-26 బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.11,500 కోట్లు కేటాయించారు. అయితే, నవంబర్ 2025 వరకు చేసిన ఖర్చు కేవలం సుమారు రూ.500 కోట్లు. మొత్తం కేటాయింపులో ఇది కేవలం 4 శాతం మాత్రమే. ఇంకా మిగిలి ఉన్న నిధులు దాదాపు రూ.10,800 కోట్లు.
గత ఆర్థిక సంవత్సరం (2024–25)లో కూడా ఇదే పరిస్థితి పునరావృతమైంది. అప్పట్లో నిధుల వినియోగం లేకపోవడంతో బడ్జెట్‌ను రూ.2,667 కోట్ల నుంచి రూ.1,078 కోట్లకు తగ్గించగా అందులోనూ కేవలం రూ.680 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
పథకం పట్ల యువతలో ఆసక్తి ఉన్నప్పటికీ కంపెనీలు ఇచ్చే ఆఫర్లను స్వీకరించడంలో వారు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ పథకం తొలి దశ లేదా పైలట్ ప్రాజెక్ట్ పరిశీలిస్తే, మొత్తం 1.27 లక్షల ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. వివిధ కంపెనీలు అభ్యర్థుల కోసం 82,000కు పైగా ఆఫర్లను జారీ చేశాయి. అయితే, వీటిలో కేవలం 28,000 మంది అభ్యర్థులు మాత్రమే ఆఫర్లను అంగీకరించారు. దీనివల్ల తొలి దశలో అంగీకార శాతం కేవలం 34 శాతానికే పరిమితమైంది.
ఈ పథకం రెండో దశలో అభ్యర్థుల ఆసక్తి మరింత తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ దశలో 1.18 లక్షల అవకాశాలు లభ్యం కాగా, కంపెనీలు 83,000కు పైగా ఆఫర్లను ఇచ్చాయి. కానీ, అభ్యర్థుల నుంచి అంగీకారం లభించినవి 24,600 కంటే తక్కువగానే ఉన్నాయి. దీని ఫలితంగా రెండో దశలో అంగీకార రేటు 30 శాతం కంటే దిగువకు పడిపోవడం గమనార్హం. అయితే, నవంబర్ 30, 2025 నాటికి ఈ పథకం కింద ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన వారి సంఖ్య కేవలం 2,066 మాత్రమే ఉండటం పథకం నత్తనడకను సూచిస్తోంది.
కారణం ఏంటి?
ఈ పథకం కింద ఇంటర్న్‌లకు నెలకు రూ.5,000 స్టైపెండ్, ఒకసారి రూ.6,000 గ్రాంట్, బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఈ మొత్తం చాలా స్వల్పమని, అందుకే యువత ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ముందుకు రావడం లేదని అధికారులు అంతర్గతంగా విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చకపోతే బడ్జెట్‌లో కేటాయించిన భారీ నిధులు తిరిగి ప్రభుత్వ ఖజానాకు చేరక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: పండగవేళ కరుణించిన కనకం.. వెండి మాత్రం..


