
సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల దిగ్గజం ఫోన్‌పే పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి గోప్యతా విధానంలో ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవో నిర్వహణ కోసం కంపెనీ కొటక్ మహీంద్రా క్యాపిటల్, జేపీమోర్గాన్ చేజ్, సిటీగ్రూప్, మోర్గాన్ స్టాన్లీని ఎంపిక చేసుకున్నట్లు జూన్‌లో వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.
కాగా.. గ్లోబల్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ గ్రూప్ సంస్థ 2023లో ఇన్వెస్టర్ల నుంచి 85 కోట్ల డాలర్లు(రూ. 7,021 కోట్లు) సమీకరించింది. 12 బిలియన్ డాలర్ల(రూ. లక్ష కోట్లు) విలువలో జనరల్ అట్లాంటిక్, వాల్‌మార్ట్, రిబ్బిట్ క్యాపిటల్, టైగర్ గ్లోబల్, టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్ తదితరాలు ఫోన్‌పేలో ఇన్వెస్ట్ చేశాయి. ఐపీవో ద్వారా రూ. 12,000 కోట్లు సమీకరించే అవకాశమున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
గతేడాది(2024–25) కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నష్టాలు తగ్గి రూ. 1,727 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది ఇవి రూ. 1,996 కోట్లుగా నమోదయ్యాయి. టోఫ్లర్ వివరాల ప్రకారం మొత్తం ఆదాయం 40 శాతంపైగా జంప్‌చేసి రూ. 7,115 కోట్లను తాకింది.
డిజిటల్ పేమెంట్ సొల్యూషన్లతోపాటు కంపెనీ ఇన్సూరెన్స్, రుణాలు, వెల్త్ మేనేజ్‌మెంట్ తదితర సర్వీసులు సైతం అందిస్తోంది. ఇటీవల కాలంలో గ్రో, ఫిజిక్స్‌వాలా, షాడోఫాక్స్ టెక్నాలజీస్, షిప్‌రాకెట్, బోట్, టాటా క్యాపిటల్ సైతం గోప్యతా మార్గంలోనే సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన విషయం విదితమే. గతేడాది(2024)లో స్విగ్గీ, విశాల్ మెగామార్ట్ ఇదే విధానంలో లిస్టింగ్‌కు వెళ్లడం గమనార్హం!