
యూపీఐ చెల్లింపులు ఆన్‌లైన్ లావాదేవీలు చేసే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటే.. డబ్బు స్వీకరించేవారికి మాత్రం ఇబ్బందులు తెచ్చి పెడుతుందనే వాదనలున్నాయి. ఇటీవల బెంగళూరులోని వీధివ్యాపారులకు వారి యూపీఐ లావాదేవీల ఆధారంగా జీఎస్టీ నోటీసులు అందడంతో చాలామంది జాగ్రత్త పడుతున్నారు. బెంగళూరులోని ఓ పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహం రెంట్ నగదు రూపంలోనే చెల్లించాలని, ఆన్‌లైన్ లావాదేవీలపై 12% జీఎస్‌టీ ఉంటుందని పోస్టర్లు వెలిశాయి. ఇదికాస్తా వైరల్‌గా మారింది.
రెడ్డిట్‌లో వెలసిన ఈ పోస్ట్‌లోని వివరాల ప్రకారం.. ‘అద్దె నగదు రూపంలోనే చెల్లించాలి. ఆన్‌లైన్ పేమెంట్‌పై 12 శాతం జీఎస్టీ ఉంది’ అని పీజీ ముందు పోస్టర్ వేసినట్లు ఫోటో తీసి పోస్ట్‌లో అప్‌లోడ్ చేశారు. ఎస్కేడీజీక్ అనే హ్యాండిల్ నుంచి షేర్ చేసిన ఈ పోస్ట్‌కు 31,000 వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.
ఇదీ చదవండి: పెట్రోల్ పంపుల ఏర్పాటు మరింత సులువు?
చాలా మంది నెటిజన్లు ఈ పద్ధతి చట్టవిరుద్ధమని, దర్యాప్తు చేసి కఠినమైన శిక్షలను అమలు చేయాలని అధికారులను కోరారు. రెసిడెన్షియల్ రెంట్ పై జీఎస్టీ లేదని, ప్రాపర్టీని వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తే తప్ప జీఎస్టీ విధించరని కొందరు తెలిపారు. ‘మీరు జీఎస్టీ బిల్లు అడగండి’ అని ఒకరు కామెంట్ చేశారు. రెసిడెన్షియల్ పీజీలకు సాధారణంగా జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంటుందని కొందరు చెప్పారు. రిజిస్ట్రేషన్, సరైన ఇన్‌వాయిసింగ్ లేకుండా ఏకపక్షంగా జీఎస్టీని విధించలేరని కొన్ని కామెంట్లు వచ్చాయి.