
ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి, దేశ క్లీన్ ఎనర్జీ పరివర్తనను ముందుకు తీసుకెళ్లడానికి విధానపరమైన చర్యల్లో మార్పులు చేయాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగా పెట్రోల్ పంపుల ఏర్పాటుకు లైసెన్సింగ్ నిబంధనలను సులభతరం చేయడానికి సిద్ధమవుతోంది. ఇంధన రిటైల్ మార్కెట్‌ను వైవిధ్యపరచడానికి, పోటీని పెంపొందించడానికి, ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఎలక్ట్రిక్ మొబిలిటీ మౌలిక సదుపాయాలను వేగవంతం చేయడానికి విస్తృత వ్యూహంలో భాగంగా ఈమేరకు చర్యలు తీసుకుంటోంది.
నిబంధనలు సమీక్ష
2019లో ప్రవేశపెట్టిన ఇంధన రిటైల్ ఆథరైజేషన్ నిబంధనలను పునసమీక్షించడానికి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) మాజీ మార్కెటింగ్ డైరెక్టర్ సుఖ్మల్ జైన్ నేతృత్వంలో నలుగురు సభ్యుల నిపుణుల కమిటీని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. అభివృద్ధి చెందుతున్న ఇంధన ప్రాధాన్యతలను ప్రతిబింబించే సవరణలను సూచించేలా కమిటీ ప్రస్తుత రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను సమీక్షిస్తోంది. పారదర్శకత, సమగ్రతను నిర్ధారించడానికి మంత్రిత్వ శాఖ ఈ ప్రక్రియ కోసం ప్రజల అభిప్రాయాలకు కూడా కోరుతోంది. ఆగస్టు 6న జారీ చేసిన అధికారిక నోటీసు ప్రకారం 14 రోజుల్లోగా వాటాదారులు, పౌరులు తమ అభిప్రాయాలను తెలియజేయాలని తెలిపింది.
2019లో సంస్కరణలు ఇలా..
ఇంధన రిటైల్ లైసెన్సింగ్ నిబంధనలను చివరిసారిగా 2019లో ప్రభుత్వం సవరించింది. ఇది ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలకు అనుకూలంగా ఉన్న కొన్ని ఆంక్షల్లో మార్పులు చేసింది. సవరించిన ఫ్రేమ్‌వర్క్ ప్రకారం చమురుయేతర సంస్థలు, గ్లోబల్ ఎనర్జీ సంస్థలు దేశీయ ఇంధన రిటైల్ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి అనుమతించింది.
2019 నిబంధనల్లోని ముఖ్యాంశాలు
రిటైల్ లైసెన్స్ కోసం కంపెనీలు రూ.250 కోట్ల నికర విలువ కలిగి ఉండాలి. రిటైల్ + బల్క్ మార్కెటింగ్ కోసం రూ.500 కోట్లు నికర విలువ కలిగి ఉండాలి. ప్రత్యామ్నాయ ఇంధన మార్కెట్ కోసం సీఎన్‌జీ, ఎల్ఎన్జీ, జీవ ఇంధనాలు(బయో ఫ్యూయెల్స్) లేదా ఈవీ ఛార్జింగ్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలు 3 సంవత్సరాలలోపు ఏర్పాటు చేయాలి. కొత్త కంపెనీలు దేశంలో కనీసం 100 రిటైల్ అవుట్‌లెట్లను ఏర్పాటు చేయాలి. అందులో గ్రామీణ ప్రాంతాలకు కనీసం 5% కేటాయించాలి.
2019లో మార్పులు చేయకముందు రిటైల్ లైసెన్స్ కోసం అర్హత సాధించడానికి కంపెనీలు అప్‌స్ట్రీమ్ ఆయిల్ లేదా గ్యాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో కనీసం రూ.2,000 కోట్లు పెట్టుబడి పెట్టాల్సి ఉండేది. ఇది కొత్త కంపెనీలకు సవాలుగా మారింది. దాంతో ఈ విభాగంలో మార్కెటింగ్ కోసం ఎక్కువ కంపెనీలు ముందుకు రాలేకపోయాయి. ఫలితంగా 2019లో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. తాజాగా వాటిలో కూడా కొన్ని మార్పులు చేయాలని కమిటీ ఏర్పాటు చేశారు.
కొత్త సంస్కరణలు ఎందుకంటే..
వేగంగా విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థకు, జనాభాకు వీలుగా దేశవ్యాప్తంగా 97,000కు పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంధన మార్కెట్‌కు ఇది ఉదాహరణ. దేశీయ డిమాండ్ పెరుగుతున్న కొద్దీ, ఇంధన రిటైలర్ల సంఖ్యను పెంచుతూ వారి సర్వీసులను వైవిధ్యపరచాల్సి ఉంది. అందుకు అడ్డంకులను తగ్గించడానికి, సరఫరా గొలుసులను పెంచడానికి కొన్ని మార్పులు అవసరమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
భారతదేశం దీర్ఘకాలిక డీకార్బనైజేషన్ లక్ష్యాలకు అనుగుణంగా కొత్త సమీక్షలో మార్పులు చేయనున్నారు. ఇంధన రిటైల్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం ద్వారా, ముఖ్యంగా సీఎన్‌జీ, ఎల్ఎన్జీ, జీవ ఇంధనాలు, ఈవీ ఛార్జింగ్ కోసం క్టీన్ ఎనర్జీ పరివర్తనను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
కొత్త నిబంధనలు విస్తృత శ్రేణి దేశీయ, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షిస్తాయని భావిస్తున్నారు. పెరిగిన పోటీ సేవల నాణ్యతను మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. ఈ విధానాలు ఇంధన ధరలను తగ్గిస్తాయని, స్థిరమైన ఇంధన ప్రత్యామ్నాయాల్లో పెట్టుబడులను వేగవంతం చేస్తాయని అంచనా వేస్తున్నారు.
నెక్ట్స్ ఏంటి?
సంప్రదింపుల వ్యవధి ముగిసిన తర్వాత నిపుణుల కమిటీ ఫీడ్ బ్యాక్‌ను తయారు చేసి మంత్రిత్వ శాఖకు సిఫార్సులను సమర్పిస్తుంది. దీనిపై సదరు శాఖ తుది నిర్ణయం తీసుకుని సవరించిన మార్గదర్శకాలను విడుదల చేస్తుంది.
ఇదీ చదవండి: సీఈఓ కనుసన్నల్లోనే వేతన పెంపు