
మొరాయించిన సీఎం కాన్వాయ్
19 వాహనాలు మొరాయింపు
భోపాల్: పెట్రోల్ బంకుల్లో జరిగే ఇంధన కల్తీ తీవ్రతకు తాజా ఉదాహరణ ఇది. మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. ఏకంగా సీఎం మోహన్ యాదవ్ కాన్వాయ్‌లోని ఎస్‌యూవీలే కల్తీ కాటుకు గురికావడం గమనార్హం. రట్లాంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం మోహన్ యాదవ్ గురువారం ఇండోర్ నుంచి వాహనాల్లో బయలుదేరారు. రట్లాం వద్దకు వచ్చేసరికి డీజిల్ నిండుకోవడంతో అక్కడున్న పెట్రోల్ బంకులో వాహనాలకు డీజిల్ ఫుల్‌ట్యాంక్ చేయించారు.
అక్కడ్నుంచి ఒక కిలోమీటర్ దూరం వెళ్లాయో లేదో వాహనాలన్నీ ముందుకు వెళ్లమని మొరాయించాయి. ఒకటీరెండూ కాదు, ఏకంగా 19 వాహనాలు నిలిచిపోయాయి. సిబ్బందే వాటిని రోడ్డు పక్కకు నెట్టాల్సి వచ్చింది. రట్లాంలోని సంబంధిత పెట్రోల్ బంకులో తనిఖీలు చేపట్టిన అధికారులు డీజిల్‌లో భారీగా నీళ్లు కలిసి ఉన్నట్లు నిర్థారించారు. కాగా, కొద్దిసేపటి తర్వాత ఇండోర్ నుంచి తెప్పించిన వేరే వాహనాల్లో సీఎం కాన్వాయ్ ముందుకు సాగింది.