ఏలూరు జిల్లా: స్థానిక శ్రీ వేంకటేశ్వర విశాల సహకార సంఘం (సొసైటీ) పెట్రోల్ బంకులో గుమస్తాగా పనిచేస్తున్న బాలిన వెంకటేశ్వరరావు(అంజిబాబు) (56) సోమవారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య, కుటుంబ సభ్యులు సొసైటీ యాజమాన్యం వేధింపులే అంజిబాబు మృతికి కారణమని ఆరోపిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసుస్టేషన్‌లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. స్థానికుల కథనం ప్రకారం.
అంజిబాబు గత 11 ఏళ్ల నుంచి పెట్రోల్ బంకులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. భార్య నాగలక్ష్మి శ్రీవారి దేవస్థానంలో ఎన్‌ఎంఆర్‌గా పనిచేస్తోంది. గతేడాది నవంబర్ నెలలో సొసైటీ బంకులోకి ఆయిల్ ట్యాంకర్ వచ్చింది. సిబ్బంది పొరపాటున పవర్ పెట్రోల్ ట్యాంకులో డీజిల్‌ను నింపారు. దాంతో సుమారు 4,500 లీటర్లకు పైగా డీజిల్ పెట్రోల్‌లో కలిసింది. సొసైటీకి సుమారు రూ.10 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని అంజిబాబుకు డిసెంబర్ నెలలో షోకాజ్ నోటీసు జారీ చేశారు. ట్యాంకర్ సిబ్బంది తప్పిదమే దీనికి కారణమని, తనకు సంబంధం లేదని అంజిబాబు ఆ నోటీసుకు బదులిచ్చాడు. ఈ విషయంలో అంజిబాబు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. ఆదివారం రాత్రి 10.30 గంటల వరకు స్నేహితులతో గడిపిన అనంతరం ఆయన ఇంటికి వెళ్లాడు.
రాత్రి సుమారు 2 గంటల సమయంలో బయటకు వచ్చిన అంజిబాబు సొసైటీ పెట్రోల్ బంకుకు వెళ్లి అక్కడి సిబ్బందికి తాళాలు అప్పగించాడు. సిబ్బంది ప్రశ్నించగా ‘నేను వెళ్లిపోతున్నాను.. మీరు ఇబ్బంది పడకూడదు కదా’ అని బదులిచ్చాడు. ఎక్కడికి వెళుతున్నావని సిబ్బంది అడుగగా బయటకు వెళుతున్నానని చెప్పి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సోమవారం ఉదయం 7 గంటల సమయంలో లింగయ్య చెరువు గట్టుపైన షెడ్డులో దూలానికి వేలాడుతున్న అంజిబాబు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్సై టి.సు«దీర్ సిబ్బందితో కలసి ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇబ్బంది పెట్టడం వల్లే..
తన భర్త సొసైటీలో దెబ్బతినడం ఇది రెండోసారని మృతుడి భార్య నాగలక్ష్మి అన్నారు. గతంలో 14 ఏళ్లు ఉద్యోగం ఇవ్వకుండా వేధించారన్నారు. అంజిబాబు కుటుంబానికి సొసైటీ యాజమాన్యం న్యాయం చేయాలని మృతుడి బంధువులు డిమాండ్ చేశారు. సొసైటీ చైర్మన్ స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. చైర్మన్ అందుబాటులో లేరని సొసైటీ కార్యదర్శి చెప్పడంతో, ఆయన వచ్చే వరకు మృతదేహాన్ని ఇంటి వద్దే ఉంచుతామన్నారు. కొందరు పెద్దలు న్యాయం జరిగేలా చూస్తామని నచ్చజెప్పడంతో మృత దేహాన్ని ఖననం చేసేందుకు ఒప్పుకున్నారు.


