భౌతికశాస్త్రం.. ప్రశ్నల సరళి కీలకం
తెలుగు: భాషా పరిజ్ఞానం ముఖ్యం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యార్థి జీవితంలో కీలకమైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు వస్తున్నాయంటే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకూ టెన్షనే.. ఈ గట్టు ఎక్కితే విద్యార్థి ఉన్నత విద్యకు చక్కని సోపానం ఏర్పడుతుంది. కనీసం ఉత్తీర్ణత సాధిస్తే చాలని కొందరు భావిస్తే, పదికి పది సాధించాలని మరికొందరు పట్టుదలతో ఉంటారు. అయితే పరీక్షలంటే ఎక్కడో చిన్న ఒత్తిడితో సాధించలేమేమోననే అనుమానం సహజం. అయితే ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా టెన్త్‌లో పదికి పది సాధించాలంటే ఇలా చేస్తే సులభమని నిపుణులైన సబ్జెక్టు టీచర్లు చెబుతున్నారు. ఇప్పటికే జరిగే ఎఫ్‌ఏ–1, 2, 3, స్లిప్ టెస్ట్‌లు, ప్రీ ఫైనల్, గ్రాండ్ టెస్ట్ పేపర్లను ప్రాక్టీస్ చేయడం ద్వారా పూర్తి అవగాహన వస్తుందని సూచిస్తున్నారు. ఈనెల 16 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 465 పాఠశాలల నుంచి 24,314 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
‘టెన్’షన్ వద్దు
ఒత్తిడిని అధిగమించాలి
అన్ని సబ్జెక్టులపై పట్టు ప్రధానం
నిపుణులైన ఉపాధ్యాయుల సూచనలు
16 నుంచి పదో తరగతి పరీక్షలు
జిల్లాలో 24,314 మంది విద్యార్థులు
గణితం.. సృజనాత్మక వ్యూహం
బీఆర్‌వీ కుమార్, గణితం టీచర్, ఎం.నాగులపల్లి హైస్కూల్
గణితం ప్రశ్నాపత్రంలో సృజనాత్మకతకు ప్రాధాన్యమిస్తూ కొన్ని మార్పులు జరిగాయి.
వెనుకబడిన విద్యార్థులు వాస్తవ సంఖ్యలు, బహుపదులు, రేఖీయ సమీకరణాల జత, నిరూపక రేఖాగణితం, సంఖ్యాక శాస్త్రం, సంభావ్యతపై దృష్టి సాధించడం ద్వారా
63 మార్కుల వరకు సాధించవచ్చు.
ముఖ్యంగా 1, 3, 7, 13, 14 అధ్యాయాలు మిగతా వాటితో పోలిస్తే సులభంగా ఉండటమే కాకుండా, ఎక్కువ మార్కులను తెచ్చిపెడతాయి.
ఎస్‌ఎస్ అహ్మద్, ఫిజికల్ సైన్స్ టీచర్, భీమడోలు జెడ్పీ హైస్కూల్
ముందుగా 8 మార్కులు, తర్వాత 4 మార్కులు, 2 మార్కులు, చివరిగా ఒక మార్పు ప్రశ్నలకు సమాధానాలు స్పష్టంగా రాయాలి.
8 మార్కుల ప్రశ్నల విభాగంలో పట్టు కోసం బ్లూప్రింట్ పాఠాలు చదవాలి.
4 మార్కుల ప్రశ్నల విభాగంలో ముఖ్యంగా చిత్రపటాలు, రేఖా చిత్రాల పాఠాలపై పట్టు సాధించాలి.
2, 1 మార్కుల ప్రశ్నల విభాగంలో ప్రశ్నలను క్షుణ్ణంగా సిద్ధం చేసుకోవాలి.
ఎం.మంజుల, తెలుగు టీచర్, భీమడోలు హైస్కూల్
అవగాహన–ప్రతిస్పందన విభాగంలో సమాధానాలను పూర్తి వాక్యాలతో స్పష్టంగా రాయాలి.
పద్య, గద్యభాగం, ఉపవాచకంపై ప్రశ్నల స్వభావాన్ని బట్టి పరిధి మేరకు సమాధానాలు రాయాలి.
పాఠ్యపుస్తకంలో ప్రతి పాఠం చివర ఉండే అభ్యాసాలను క్షుణ్ణంగా చదవాలి.
చక్కని దస్తూరి, విరామ చిహ్నాలను పాటిస్తూ అక్షర దోషాలు లేకుండా రాస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చు.


