జనం రాని సభపై ఎమ్మెల్యే ఫైర్‌ | - | Sakshi
Sakshi News home page

జనం రాని సభపై ఎమ్మెల్యే ఫైర్‌

Mar 10 2026 12:43 PM | Updated on Mar 10 2026 12:43 PM

‘మాకు పనిలేక వచ్చామా?’ అంటూ నాయకులపై ఆగ్రహం

జగన్‌ సర్కారుపై అక్కసు వెళ్లగక్కిన నరసాపురం ఎమ్మెల్యే నాయకర్‌

నరసాపురం రూరల్‌: మండలంలోని కొత్త నవరసపురం గ్రామంలో సోమవారం ఉదయం జరిగిన ఓ కార్యక్రమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం వచ్చిన నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌ కొత్త నవరసపురం సచివాలయం వద్ద సభా ప్రాంగణంలో జనం లేకపోవడంతో కూటమి నాయకులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా ఖాళీ కుర్చీలే కనిపించడంతో విస్మయానికి గురయ్యారు. ప్రజలు ఎందుకు రాలేదని ఎమ్మెల్యే ప్రశ్నించగా అందరూ పొలం పనుల నిమిత్తం బయటకు వెళ్లారని స్థానిక నాయకులు సమాధానమిచ్చారు. దీంతో మరింత ఆగ్రహించిన ఎమ్మెల్యే ‘ప్రజలు వస్తారో రారో చూసుకోకుండా కార్యక్రమం ఎలా ఏర్పాటు చేస్తారు? మేమేమన్నా ఇక్కడ ఖాళీగా ఉన్నామా? మాకు వేరే పనులు లేక వచ్చామా?’ అంటూ మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో నాయకులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయకర్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘మీరంతా జగన్‌ మాయలోనే ఉంటానంటే మీ ఊరిని ఎవరూ బాగు చేయలేరు’ అంటూ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపైనా అసహనాన్ని వెళ్ల గక్కారు. ఎమ్మెల్యే నాయకర్‌ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా సభకు జనం రాలేదని మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ పలువురు కూటమి నేతలు ఎమ్మెల్యే తీరును తప్పు పడుతున్నారు.

ఎమ్మెల్యే గారూ ఇదేం పద్ధతి

నరసాపురం: కొత్త నవరసపురంలో ఎమ్మెల్యే నాయకర్‌ వ్యవహరించిన తీరు సరికాదని వైఎస్సార్‌సీపీ ఐటీ వింగ్‌ జిల్లా కన్వీనర్‌ బుడితి సుమన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎ మ్మెల్యే కార్యక్రమానికి జనం రాకపోతే మాజీ సీఎం జగన్‌ కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. జనం మెచ్చే పనులు చేస్తే ఎమ్మెల్యే నాయకర్‌కు ఇలా తన కార్యక్రమానికి ప్రజాస్పందన కరువయ్యే పరిస్థితి ఉండదన్నారు. ఎమ్మెల్యే నాయకర్‌ నైజాన్ని కూటమి నాయకులు ఇప్పటికై నా తెలుసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement