
భారతీయ కుబేరుడు & రిలయన్స్ చైర్మన్ 'ముకేశ్ అంబానీ', వారి కుటుంబం విలాసవంతమైన జీవితం గడుపుతారని అందరికీ తెలుసు. ఈ కారణంగానే వీరు ఖరీదైన బంగ్లాలో నివసిస్తూ.. లగ్జరీ కార్లలో తిరుగుతూ ఉంటారు. ఇప్పటికే లెక్కలేనన్ని కార్లను కలిగి ఉన్న అంబానీ గ్యారేజిలోకి రూ. 100 కోట్ల విలువైన కారు చేరినట్లు తెలిసింది.
నీతా అంబానీ రూ.100 కోట్ల ఖరీదైన 'ఆడి ఏ9 క్యామెలియాన్' (Audi A9 Chameleon) సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అంబానీ ఫ్యామీలీగానీ, ఆడి కంపెనీ గానీ అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నీతా అంబానీ ఆడి ఏ9 క్యామిలియెన్ కొనుగోలు చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఆడి ఏ9 క్యామెలియాన్ పేరుకు తగ్గట్టుగానే ఊసరవెల్లి మాదిరిగా రంగులు మార్చే టెక్నాలజీని కలిగి ఉండటం దీని ప్రత్యేకత. ఈ మోడల్ కార్లు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కేవలం 11 మాత్రమే ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే.. ఇది ఎంత అరుదైన కారు అనే విషయం స్పష్టమవుతుంది.
సింగిల్ పీస్ విండ్‌స్క్రీన్, రూఫ్ కలిగి ఉండటం వల్ల ఆడి ఏ9 క్యామెలియాన్ చూడటానికి ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఐదు మీటర్ల పొడవున్న ఈ కారు రెండు డోర్స్ మాత్రమే పొందుతుంది. ఇది 4.0 లీటర్ వీ8 ఇంజిన్ ద్వారా 600 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. 3.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమయ్యే ఈ కారు టాప్ స్పీడ్ 250 కిమీ/గం.
ఇదీ చదవండి: 'అలాంటి ఒక్క వాహనం చూపించండి': గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్
నీతా అంబానీ ఉపయోగించే కార్ల జాబితాలో రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII ఈడబ్ల్యుబీ, మెర్సిడెస్ మేబాచ్ ఎస్600 గార్డ్, ఫెరారీ 812 సూపర్‌ఫాస్ట్, బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్, రోల్స్ రాయిస్ కల్లినన్, బీఎండబ్ల్యు 7 సిరీస్ 760ఎల్ఐ వంటి మరెన్నో ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి.