
సమకాలీన ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానం (FinTech) పెరుగుతున్న నేపథ్యంలో స్టేబుల్ కాయిన్ల (Stablecoins) గురించి భారత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. న్యూఢిల్లీలో జరిగిన కౌటిల్య ఎకనామిక్ కాన్‌క్లేవ్ ప్రారంభ సెషన్‌లో ఆమె ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్టేబుల్ కాయిన్ల అవసరాన్ని నొక్కి చెప్పారు. కొన్ని దేశాలు వాటిని స్వాగతించినా లేదా వ్యతిరేకించినా స్టేబుల్ కాయిన్ల వాడకానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ద్రవ్య ఆవిష్కరణలకు అనుగుణంగా ఎంత త్వరగా మారాల్సిన అవసరం ఉందో ఆమె వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
స్టేబుల్ కాయిన్స్ అంటే ఏమిటి?
స్టేబుల్ కాయిన్లు అనేవి క్రిప్టోకరెన్సీలో ఒక ప్రత్యేక కేటగిరీకి చెందినవి. వీటిని ధరల అస్థిరతను తగ్గించడానికి రూపొందించారు. బిట్ కాయిన్ లేదా ఎథీరియం వంటి సాంప్రదాయ క్రిప్టోకరెన్సీల ధరలు విపరీతంగా మారే అవకాశం ఉంటుంది. అందుకు భిన్నంగా స్టేబుల్ కాయిన్లు సాధారణంగా యూఎస్ డాలర్ వంటి స్థిరమైన ఫియట్ కరెన్సీకి లేదా బంగారం వంటి వస్తువులతో ముడిపడి ఉంటాయి. ఈ మెకానిజం క్రిప్టోకరెన్సీ మాదిరిగా అస్థిరతకు లోనుకాకుండా వినియోగదారులకు డిజిటల్ కరెన్సీ ప్రయోజనాలను అందించడానికి ఉద్దేశించబడింది.
కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధాన రూపకర్తల ఆలోచనలను ప్రతిబింబిస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. డిజిటల్ కరెన్సీల పెరుగుదలను, స్టేబుల్ కాయిన్లను ఇకపై విస్మరించలేమని చెబుతున్నారు. క్రిప్టో రంగంలో భారతదేశం జాగ్రత్తగా వ్యవహరిస్తున్న సమయంలో ఆర్థిక మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. దేశీయంగా ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలకు చట్టపరమైన గుర్తింపును ఇవ్వకపోయినప్పటికీ అది వర్చువల్ డిజిటల్ ఆస్తి లావాదేవీల కోసం పన్ను ఫ్రేమ్‌వర్క్‌ను (30% పన్ను, 1% టీడీఎస్) అమలు చేస్తోంది. చాలామంది దీన్ని ఆర్థిక వ్యవస్థలో క్రిప్టో ఉనికిని అంగీకరించే చర్యగా చూస్తున్నారు.
ఆర్‌బీఐ వైఖరి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలపై సందేహాస్పదంగా ఉంది. ఆర్థిక స్థిరత్వం, వినియోగదారుల రక్షణ, ద్రవ్య విధానానికి ప్రమాదాలు సంభవించవచ్చని పేర్కొంటూ గతంలో పూర్తి నిషేధాన్ని సమర్థించింది. అదే సమయంలో తన సొంత సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) కోసం పైలట్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించింది. దీన్ని ప్రైవేట్ డిజిటల్ కరెన్సీలకు సురక్షితమైన, నియంత్రిత ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. సీబీడీసీలు కేంద్ర బ్యాంకులచే జారీ చేయబడతాయి. సాంప్రదాయ కరెన్సీ మాదిరిగానే చట్టపరమైన హోదాను పొందుతాయి. చైనా, స్వీడన్, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు కూడా తమ CBDCలను పరీక్షించి అమలు చేస్తున్నాయి.
సూక్ష్మ నియంత్రణ చర్చలకు దారి
ఇదిలాఉండగా, సీతారామన్ నిర్దిష్ట విధాన మార్పులను వివరించకపోయినా స్టేబుల్ కాయిన్లను పరివర్తన శక్తిగా గుర్తించడం భారతదేశ క్రిప్టో విధానంలో కీలకమైన క్షణాన్ని సూచిస్తుంది. ఈ ప్రకటన మరింత సూక్ష్మమైన నియంత్రణ చర్చలకు దారితీస్తుందని కొందరు భావిస్తున్నారు. డిజిటల్ ఆస్తుల కేటగిరీల మధ్య తేడాను చూపే భవిష్యత్తు ఫ్రేమ్‌వర్క్‌కు ఇది మార్గం సుగమం చేయవచ్చని చెబుతున్నారు. ఆ ఫ్రేమ్‌వర్క్‌లో స్టేబుల్ కాయిన్లు, ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలు, CBDCలను స్పష్టంగా పరిగణించే అవకాశం కూడా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: తయారీ రంగంలో వృద్ధికి వ్యూహాలు