ప్రమాదంలో ప్రాణాలను కాపాడంలో ఎయిర్ బ్యాగులు ప్రధాన పాత్ర వహిస్తాయి. అయితే ఎయిర్ బ్యాగ్స్ కార్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టే, కారు ప్రమాదానికి గురైనప్పుడు ప్రయాణికులు కొన్నిసార్లు ప్రాణాలతో బయటపడతారు. బైక్ రైడర్లకు కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉంటే?, ఎంతబాగుంటుందో కదా.. దీనిని దృష్టిలో ఉంచుకునే నియోకవాచ్ (NeoKavach) కంపెనీ మొదటిసారి బైకర్స్ కోసం ఎయిర్‌బ్యాగ్ లాంచ్ చేసింది. దీనికి ధర ఎంత?, ఇదెలా ఉపయోగపడుతుంది? అనే ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.
100 మిల్లీ సెకన్లలోపు
బైక్ రైడర్ల భద్రత కోసం.. ఇండో-ఫ్రెంచ్ జాయింట్ వెంచర్ అయిన నియోకవాచ్, నియోకవాచ్ ఎయిర్ వెస్ట్‌ను ప్రవేశపెట్టింది. ఇది బైకర్స్ కోసం రూపొందించిన భారతదేశంలోని మొట్టమొదటి ఎయిర్‌బ్యాగ్ సిస్టం. ప్రమాదం జరిగినప్పుడు రైడర్ ఛాతీ, వెన్నెముక, మెడ వంటి భాగాలను ఇది రక్షిస్తుంది. ఈ ఎయిర్‌బ్యాగ్ ప్రమాదం జరిగినప్పుడు కేవలం 100 మిల్లీ సెకన్లలోపు యాక్టివేట్ అవుతుంది. ముఖ్యమైన ప్రాంతాలకు కుషనింగ్ అందిస్తుంది.

సాధారణంగా కారులో ప్రయాణించే వారితో పోలిస్తే.. మోటార్‌సైకిల్‌పై ప్రయాణించేవారికి ప్రమాదంలో తీవ్ర గాయలయ్యే అవకాశం ఎక్కువ. కాబట్టి ఇలాంటి వాటిని నివారించడానికే ఈ నియోకవాచ్ ఎయిర్ వెస్ట్ వచ్చింది.
భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా
ఎలక్ట్రానిక్ ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్‌ల మాదిరిగా కాకుండా.. నియోకావాచ్ ఎయిర్ వెస్ట్ ఛార్జింగ్, బ్యాటరీలు లేదా సబ్‌స్క్రిప్షన్‌ల అవసరం లేని సరళమైన మెకానికల్ టెథర్ ట్రిగ్గర్‌ను ఉపయోగిస్తుంది. దీనిని రీసెట్ చేయవచ్చు. డిప్లాయ్‌మెంట్ తర్వాత తిరిగి ఉపయోగించవచ్చు. దీనిని రోజువారీ ప్రయాణంలో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది తేలికైనది కావడంతో రైడర్లకు అసౌకర్యంగా ఉండే అవకాశం లేదు. అంతే కాకుండా.. ఇది ప్రపంచ భద్రతా ధృవీకరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.
ఇదీ చదవండి: బెస్ట్ 7 సీటర్ కార్లు: ధరలు ఇలా..
మొత్తం మూడు
నియోకావాచ్ ఎయిర్ వెస్ట్ (రూ. 32,400) మాత్రమే కాకుండా.. కంపెనీ నియోకవాచ్ టెక్ బ్యాక్‌ప్యాక్ ప్రో (రూ. 40,800), నియోకవాచ్ టెక్‌ప్యాక్ ఎయిర్ (రూ. 36,000) లను కూడా ప్రవేశపెట్టింది. ఈ మూడు ఉత్పత్తులు ఇప్పుడు నియోకావాచ్ అధికారిక వెబ్‌సైట్‌లో & భారతదేశం అంతటా ఎంపిక చేసిన అధీకృత రిటైలర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.


