
రిలయన్స్ ఇండస్ట్రీస్ అప్పులు భారీగా పెరిగిపోయాయి. మంచి లాభాల్లో నడుస్తున్న, దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీకి చెందిన కంపెనీకి అప్పులేంటి అనుకుంటున్నారా? కంపెనీ ఎంత లాభాలను ఆర్జిస్తున్నప్పటికీ వ్యాపారాలను విస్తరించడానికి అప్పులు అవసరమవుతాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వివిధ రంగాల్లో దూకుడుగా పెట్టుబడులను కొనసాగిస్తోంది. అందుకే అప్పులు పెరిగాయి.
ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం.. కంపెనీ మొత్తం అప్పు రూ.3.47 లక్షల కోట్లు కాగా, నికర రుణం రూ.1.17 లక్షల కోట్లు. గతేడాది అంటే 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం అప్పు రూ.3.24 లక్షల కోట్లు. బలమైన ఆర్థిక స్థితిని కొనసాగిస్తూనే వ్యాపారాలను పెంచుకునేందుకు భారీ పెట్టుబడులు పెట్టినట్లు కంపెనీ తన వార్షిక నివేదికలో పేర్కొంది.
2025 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.1,31,107 కోట్ల మూలధన వ్యయాన్ని చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం 2023-24లో ఈ మొత్తం రూ.1,31,769 కోట్లుగా ఉంది. వార్షిక నివేదిక ప్రకారం, 2025 ఆర్థిక సంవత్సరం పెట్టుబడులలో ఎక్కువ భాగం క్రూడాయిల్ నుంచి కెమికల్స్ తయారు చేసే
కొత్త ఓ2సీ ప్రాజెక్టులు, రిటైల్ స్టోర్ల ఏర్పాటు, డిజిటల్ సర్వీసుల పెంపు, నూతన ఇంధన వెంచర్లను అభివృద్ధి వైపు మళ్లించింది రిలయన్స్ ఇండస్ట్రీస్.
ఇక ఆదాయం విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.5,57,163 కోట్ల ఆదాయం ఆర్జించింది. అంతక్రితం ఏడాది రూ.5,74,956 కోట్లతో పోలిస్తే ఇది 3.1 శాతం తక్కువ. కంపెనీ ఎబిటా గత ఏడాది రూ.86,393 కోట్ల నుంచి 14.2 శాతం క్షీణించి రూ.74,163 కోట్లకు పరిమితమైంది.