భారతదేశంలో అత్యంత సంపన్నుడు, రిలియన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులతో.. భక్తులకు మా నిరాడంబరమైన సేవను కొనసాగిస్తూ, తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కొరకు ఒక ఆధునికమైన, అత్యున్నత ప్రమాణాలతో కూడిన వంటశాలను (కిచెన్) నిర్మించనున్నట్లు తెలియజేయడానికి మేము ఎంతో గౌరవంగా భావిస్తున్నామని ఈ సందర్భంగా అంబానీ పేర్కొన్నారు.
ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానములు (TTD) భాగస్వామ్యంతో మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ సహకారంతో చేపడుతున్నాము. ఈ కొత్త వంటశాల అధునాతన ఆటోమేషన్‌ను కలిగి ఉంటుంది. ఇది ప్రతిరోజూ రెండు లక్షల కంటే ఎక్కువ మందికి కావలసిన భోజనాలను తయారుచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తద్వారా, ప్రతి భక్తుడికి అత్యంత భక్తి, పరిశుభ్రత, శ్రద్ధతో తయారుచేసిన పౌష్టికాహార అన్నప్రసాదం ప్రేమతో అందించడం జరుగుతుంది.
#WATCH | Andhra Pradesh | Chairman & Managing Director of Reliance Industries Limited, Mukesh Ambani, visits Sri Venkateswara Swamy Temple in Tirumala and offers prayers. pic.twitter.com/uDS0SnaIie
— ANI (@ANI) November 9, 2025
తిరుమల.. విశ్వాసం, కరుణ & నిస్వార్థ సేవకు శాశ్వత చిహ్నంగా నిలుస్తోంది. ఈ ప్రయత్నం ద్వారా, TTD దేవాలయాలన్నింటికీ అన్నసేవ సంప్రదాయాన్ని విస్తరించాలనే ఏపీ సీఎం ఉన్నత ఆశయానికి సహకరించడం మాకు అదృష్టంగా భావిస్తున్నాము. వేంకటేశ్వర స్వామివారికి సేవ చేయడం, 'ఏ భక్తుడూ ఆకలితో ఉండకూడదు' అనే తిరుమల దివ్య సంకల్పంలో ఒక చిన్న భాగం కావడం మాకు లభించిన భాగ్యం.
ముఖేష్ అంబానీ.. కేరళలోని త్రిస్సూర్ జిల్లా, గురువాయూర్ పట్టణంలో ఉన్న గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయాన్ని కూడా సందర్శించారు. ఆయన ఆ దేవాలయానికి రూ. 15 కోట్ల రూపాయలను విరాళంగా అందించారు.


