దేవుడా.. ఏమిటీ పరీక్ష? | A stampede occurred at the Alipiri Bhudevi complex | Sakshi
Sakshi News home page

దేవుడా.. ఏమిటీ పరీక్ష?

Dec 26 2025 5:49 AM | Updated on Dec 26 2025 6:26 AM

A stampede occurred at the Alipiri Bhudevi complex

క్యూలైన్‌లో జరిగిన తొక్కిసలాటలో కింద పడిపోతున్న వృద్ధురాలు

అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో ఆర్తనాదాలు  

శ్రీవారి దివ్య దర్శన టోకెన్ల కోసం పోటెత్తిన భక్తులు

క్యూలైన్లలో అరుపులు, కేకలు, తోపులాటలు  

ఉద్రిక్తతకు దారితీసిన పరిస్థితులు  

టీటీడీ నిర్లక్ష్యం.. నియంత్రణలో సిబ్బంది వైఫల్యం

తిరుపతి అన్నమయ్య సర్కిల్‌: ప్రభుత్వం, టీటీడీ నిర్లక్ష్యంతో భక్తులకు తిప్పలు తప్పడం లేదు. గత ఏడాది వైకుంఠ ఏకాదశి టోకెన్ల పంపిణీ సమయంలో చోటుచేసుకున్న దుర్ఘటన నుంచి పాఠాలు నేర్చుకోలేదు. అందుకు అలిపిరి వద్ద గురువారం దివ్యదర్శనం టోకెన్ల పంపిణీ సమయంలో చోటు చేసుకున్న తోపులాటే నిదర్శనం. వారాంతపు సెలవులు రావడంతో గురువారం తిరుమల శ్రీవారి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. శ్రీవారి మెట్టు నడకదారిలో తిరుమలకు చేరుకునే భక్తులు.. శ్రీవారి దివ్యదర్శన టోకెన్ల కోసం తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌కు చేరుకున్నారు. 

పరిమితికి మించి భారీగా భక్తులు రావడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భద్రతా సిబ్బంది క్యూలైన్‌ కౌంటర్‌ ప్రధాన గేటు సకాలంలో తెరవక పోవడంతో తీవ్ర ఉద్రిక్తత  చోటు చేసుకుంది.  ఒక్కసారిగా క్యూలైన్‌ గేటు తెరవడం, అదే సమయంలో భక్తులకు తగిన సూచనలు చేసే వారు లేకపోవడంతో టోకెన్‌ కౌంటర్‌ వద్ద తోపులాట జరిగింది. క్యూలైన్లలో అరుపులు, కేకలతో తీవ్ర ఆందోళనకర పరిస్థితి నెలకొంది. 

ఏమి జరుగుతుందోనని భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.  భక్తులు తమ పిల్లలు, కుటుంబ సభ్యుల కోసం ఇనుప కంచెపైకి ఎక్కిమరీ అరుపులు, కేకలు వేయడం, మరికొందరు కంచెను ఎక్కి టోకెన్ల కోసం పరుగులు తీయడం, భక్తులను నిలువరించేందుకు అవసరమైన సిబ్బంది లేకపోవటం వంటి పరిస్థితుల్లో కొందరికి గాయాలయ్యాయి.   

టీటీడీ నిర్లక్ష్యంపై భక్తుల ఆగ్రహం 
టీటీడీ తీరుపై భక్తులు మండిపడ్డారు. గురువారం తెల్లవారు జాము నుంచి టోకెన్ల కోసం తిండి తిప్పలు మాని క్యూలో వేచి ఉంటే.. మధ్యాహ్నం 12.30 గంటలకే టోకెన్ల జారీ ప్రక్రియ అయిపోయిందంటూ ప్రకటించడం... పైగా క్యూలైన్లలో అరుపులు, కేకలు, తోపులాటలు చోటుచేసుకోవడంపై భక్తుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పండుగలకు ముందు సెలవులు వస్తాయని, ఆ సమయంలోనే భక్తులు అధిక సంఖ్యలో తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తారని అధికారులకు ముందే తెలుసు. అయినా  టీటీడీ అధికార యంత్రాంగం ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోకపోవడాన్ని భక్తులు తప్పుపట్టారు.  

అంతా గందరగోళం 
అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌లో సాధారణ భక్తులకు ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి 15 వేల స్లాటెడ్‌ సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డి) టోకెన్లు జారీ చేస్తారు. అదే విధంగా కాలినడకన శ్రీవారిమెట్టు, అలిపిరి మెట్టు వైపు వెళ్లే భక్తులకు వేర్వేరు కౌంటర్ల ద్వారా రోజుకు 5 వేల చొప్పున 10 వేల దివ్యదర్శనం టోకెన్లను జారీ చేస్తున్నారు. 

ఈ లెక్కన ప్రతి రోజు 25 వేల టోకెన్ల జారీ జరుగుతోంది. కాగా వారాంతపు సెలవులు రావడంతో అత్యధిక సంఖ్యలో దాదాపు 50 వేల మంది భక్తులు అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌కు చేరుకోవడం, టోకెన్ల కోసం శ్రమించడంలో గందరగోళం చోటుచేసుకుంది. దాదాపు 25 వేల మంది భక్తులు టోకెన్లు పొందలేక వెనుతిరగాల్సిన పరిస్థితి చోటుచేసుకుంది.  

టోకెన్ల జారీ విధాన మార్పుతోనే సమస్య 
శ్రీవారి మెట్టు నడక మార్గంలోనే గతంలో దివ్యదర్శనం టోకెన్లు ఇచ్చేవారు. అయితే గత కొంత కాలంగా అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్‌లోనే అదనంగా కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. గురువారం కౌంటర్‌ వద్ద గందరగోళ పరిస్ధితి ఏర్పడటానికి అది కూడా ఒక కారణం అని భక్తులు విమర్శిస్తున్నారు. టోకెన్ల జారీ ప్రక్రియ పూర్తయిన వెంటనే మైకు ద్వారా అనౌన్స్‌మెంట్‌ ఇచ్చి ఉంటే పరిస్థితి సజావుగా సాగేదని చెబుతున్నారు. దివ్యదర్శనం టోకెన్లు లభించని వేలాది మంది భక్తులు ‘గోవిందా నీవే దిక్కు.. నీదర్శనమే మాకు మొక్కు’ అంటూ తిరుగు పయనమవడం కనిపించింది. 

తగిన చర్యలు తీసుకుంటాం: ఎస్పీ సుబ్బరాయుడు 
వారాంతపు సెలవుల నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు క్యూలైన్లలోకి రావడం వల్ల  తోపులాట చోటుచేసుకుందని ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు. సోషల్‌ మీడియాలో తొక్కిసలాట అంటూ వచి్చన వార్తల్లో వాస్తవం లేదన్నారు.  మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆయన టీటీడీ సీవీఎస్‌వో మురళీకృష్ణతో కలిసి అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లోని శ్రీవారి మెట్టు నడకదారి దివ్యదర్శన టోకెన్ల జారీ కౌంటర్‌ వద్దకు చేరుకున్నారు. 

పరిస్థితిని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ,  మొదట ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీ ప్రక్రియ పూర్తి కావడంతో భక్తులు ఒక్కసారిగా దివ్య దర్శన టోకెన్లకు ఎగబడ్డారన్నారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకుందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మున్ముందు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు.  

ఎందుకొచ్చావ్‌.. 
సాక్షి ఫొటోగ్రాఫర్‌ సెల్‌ఫోన్‌ లాక్కున్న ఏవీఎస్‌వో  తోపులాటకు సంబంధించి మీడియా కవరేజి చేస్తున్న సాక్షి ఫొటోగ్రాఫర్‌ కేతారి క్రిష్ణమోహన్‌పై అక్కడే ఉన్న ఏవీఎస్‌వో రమేష్ కృష్ణ దౌర్జన్యం చేశారు. ఆయనను అడ్డుకుని సెల్‌ఫోన్‌ లాక్కున్నారు. ‘ఎందుకొచ్చావ్‌’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏవీఎస్‌వో వ్యవహార శైలి తీవ్ర కలకలం రేపింది. ‘కింద స్థాయిలో అధికారులు మీడియాకు సహకరించాలి’’ అని ఉన్నతాధికారులు చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్నదానికి పొంతన కుదరడంలేదంటూ పలువురు జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు.  

టీటీడీ యంత్రాంగం విఫలం..
అడ్డదారుల్లో వచ్చే వారికి టోకెన్‌ పొందే అవకాశాన్ని కల్పించారు. ఉదయం నుంచి క్యూలైన్‌లో ఏమీ తినకుండా.. పిల్లలకు కూడా పెట్టకుండా ఇబ్బందులు పడ్డాం. సా­మా­న్యులకు శ్రీవారి దర్శనం కల్పించడంలో టీటీడీ యంత్రాంగం విఫలం అయ్యింది. – మాధురి, భక్తురాలు (బెంగళూరు) 

ఏ రోజూ ఇంత దారుణంగా లేదు
గోవిందమాల ధరించి వేంకటేశ్వరస్వామి దర్శనా­ర్థం 13వ సారి 20 మంది మాలధారులతో కలిసి వచ్చాను. తీరా కౌంటర్‌ వద్దకు సమీపించగానే టోకెన్లు లేవని చెప్పడం తీవ్ర నిరాశ కలిగించింది. ఏ రో జూ ఇంత దారుణంగా లేదు. –రఘురామయ్య, భక్తులు (నాయుడుపేట) 

నిర్వహణ తీరు దారుణం..
ఉదయం నుంచీ క్యూలైన్లో వేచివున్నా.. టోకెన్లు లభించకపోగా.. సెక్యూరిటీ సిబ్బందితో చేదు అనుభవం ఎదురైంది. నేను  డాక్టర్‌నని చెప్పినా.. సెక్యూరిటీ సిబ్బంది ఎటువంటి గౌరవం లేకుండా నాతోపాటు మా అమ్మను తోసేశారు. నిర్వహణ తీరు దారుణంగా ఉంది.  – తల్లితో డాక్టర్‌ వెంకటేశ్, భక్తుడు (హైదరాబాద్‌) 

ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు.. 
కౌంటర్‌ వద్దకు చేరుకునే సరికే టోకెన్లు అయిపోయాయని చెప్పారు. తీవ్ర నిరాశ ఎదురైంది. పైగా తీవ్ర తోపులాటలో కిందపడిన నా పిల్లలకు గాయాలయ్యాయి.  ఇలాంటి పరిస్థితి ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. 
–  విజయలక్ష్మి, భక్తురాలు (బళ్లారి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement