భారత టెలికాం, డిజిటల్ రంగాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన జియో ఇప్పుడు మరో కీలక ఘట్టానికి సిద్ధమవుతోంది. చాన్నాళ్లుగా వస్తున్న ఊహాగానాలు, పెట్టుబడిదారుల అంచనాలకు తెరదించుతూ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ కీలక ప్రకటన చేశారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ.. జియో ప్లాట్‌ఫామ్స్ బోర్డు, డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP)ను ఆమోదించిందని, దానిని సెబీకి సమర్పించనున్నట్లు ముకేశ్ అంబానీ వెల్లడించారు.
ఈ ప్రకటనతో భారత పెట్టుబడి మార్కెట్‌లో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జియో ఐపీఓకు అధికారికంగా శ్రీకారం చుట్టినట్టైంది. దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా ఇది నిలిచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. జియో ఐపీఓ అనేది కేవలం ఒక వ్యాపార నిర్ణయం మాత్రమే కాదని, ఇది తనకు, రిలయన్స్ కుటుంబానికి, లక్షలాది వాటాదారులకు ఎంతో భావోద్వేగమైన క్షణమని ముకేశ్ అంబానీ అన్నారు.
ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ తన తండ్రి ధీరూబాయ్ అంబానీ వారసత్వాన్ని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి కలలుగన్న ''అందరి అభివృద్ధి'' అనే లక్ష్యాన్ని తాను ముందుకు తీసుకువచ్చానని, ఇప్పుడు అదే బాధ్యతను తదుపరి తరం స్వీకరిస్తోందని చెప్పారు. తన పిల్లలు ఆకాష్, ఇషా, అనంత్ అంబానీలు జియో ఐపీఓ ప్రక్రియకు నాయకత్వం వహిస్తున్నారని వెల్లడించారు. భవిష్యత్తులో విలువ సృష్టించే కొత్త అవకాశాలను కూడా వారే ముందుండి నడిపిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
పదేళ్ల క్రితం జియో ప్రారంభమైనప్పుడు భారతదేశంలో డిజిటల్ అసమానతలను తొలగించడమే తమ లక్ష్యమని అంబానీ గుర్తుచేశారు. ఆ సమయంలో కాల్ ఛార్జీలు అధికంగా ఉండేవని, డేటా ఖరీదైనదిగా ఉండేదని, ఇంటర్నెట్ వేగం కూడా తక్కువగా ఉండేదని చెప్పారు. జియో వచ్చాక వాయిస్ కాల్స్, తక్కువ ధరలకు అధిక వేగం కలిగిన డేటా అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఫలితంగా కోట్లాది భారతీయులకు డిజిటల్ జీవనశైలి చేరువైందని పేర్కొన్నారు.
The Board of Jio Platforms has approved its DRHP, and it will be filed with SEBI today. This is a deeply emotional moment for me, for the entire Reliance Family, and millions of its shareholders. The relationship Reliance shares with its shareholders is a deep and sacred… pic.twitter.com/osVRfVQstP
— Reliance Industries Limited (@RIL_Updates) June 19, 2026
ప్రస్తుతం జియో దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా ఎదిగింది. 52.4 కోట్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న ఈ సంస్థ, భారత టెలికాం రంగంలో అగ్రస్థానంలో ఉంది. జియో 5జీ సేవలకు 26.8 కోట్ల మంది వినియోగదారులు ఉండగా, జియో ఎయిర్‌ఫైబర్ ద్వారా 1.3 కోట్ల ఇళ్లకు కనెక్టివిటీ అందుతోంది. ఈ గణాంకాలే జియో ఎంత వేగంగా విస్తరించిందో తెలియజేస్తున్నాయి.
జియో లిస్టింగ్ కేవలం ఒక వ్యాపార ప్రక్రియ మాత్రమే కాదని, భారతదేశం ప్రపంచ స్థాయి టెక్నాలజీ కంపెనీలను నిర్మించగలదని ప్రపంచానికి చూపించే అవకాశం అని ముకేశ్ అంబానీ అన్నారు. ప్రపంచ స్థాయి సామర్థ్యం, సాంకేతిక నైపుణ్యం, విలువ కలిగిన సంస్థలను భారత్ సృష్టించగలదని జియో నిరూపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
మార్కెట్ అంచనాల ప్రకారం, జియో ఐపీఓ ద్వారా సుమారు 4 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించే అవకాశం ఉంది. గతంలో ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ జెఫరీస్ జియో విలువను సుమారు 180 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. ఈ అంచనాలు నిజమైతే, జియో ఐపీఓ భారత చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలిచే అవకాశముంది.
ఇప్పటివరకు భారతదేశంలో అతిపెద్ద ఐపీఓగా హ్యుందాయ్ మోటార్ ఇండియా నిలిచింది. 2024 అక్టోబర్‌లో ఆ సంస్థ సుమారు రూ.27,870 కోట్లను సమీకరించింది. అయితే జియో ఐపీఓ ఆ రికార్డును అధిగమించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.


