లాభాలు ఓకే.. డివిడెండ్లు ప్చ్‌! | More than 20 loss making firms paid dividends in FY24 | Sakshi
Sakshi News home page

లాభాలు ఓకే.. డివిడెండ్లు ప్చ్‌!

Jun 27 2024 6:08 AM | Updated on Jun 27 2024 8:30 AM

More than 20 loss making firms paid dividends in FY24

దేశీ కార్పొరేట్ల సరికొత్త ట్రెండ్‌ 

2023–24లో రికార్డ్‌ లాభాలు 

డివిడెండ్‌ చెల్లింపుల్లో నేలచూపు 

2022–23లో రికార్డ్‌ డివిడెండ్లు 

దేశీయంగా లిస్టెడ్‌ కంపెనీలు మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో సగటున రికార్డ్‌ స్థాయిలో లాభాలు ఆర్జించాయి. అయితే లాభాలను వాటాదారులకు పంచే(డివిడెండ్‌ పేఔట్‌)  విషయంలో వెనుకంజ వేస్తున్నాయి.  వార్షికంగా పేఔట్‌ దాదాపు 5 శాతం  నీరసించింది. ఇందుకు పలు అంశాలు ప్రభావాన్ని చూపుతున్నాయి. డివిడెండ్‌  ప్రకటించిన 999 లిస్టెడ్‌ కంపెనీలను  పరిగణించిన ఒక నివేదిక రూపొందించిన వివరాలు చూద్దాం..  

ముంబై: దేశీ లిస్టెడ్‌ కార్పొరేట్లు గతేడాది(2023–24)కి డివిడెండ్లను ప్రకటించడంలో ఆచితూచి అడుగేస్తున్నాయి. దీంతో సగటున అంతక్రితం ఏడాది(2022–23)తో పోలిస్తే డివిడెండ్‌ చెల్లింపు 4.7 శాతం తగ్గింది. రూ. 4.03 లక్షల కోట్లను పంచిపెట్టాయి. అయితే 2022–23లో సరికొత్త రికార్డును లిఖిస్తూ చెల్లించిన రూ. 4.23 ట్రిలియన్లతో పోలిస్తే తక్కువే. ఇక నికర లాభాల విషయానికివస్తే(అనుకోని లాభాలు లేదా నష్టాల సర్దుబాటు తదుపరి) గతేడాది వార్షికంగా 30 శాతం వృద్ధితో రూ. 14.75 లక్షల కోట్లను ఆర్జించాయి. 

ఇవి చరిత్రాత్మక గరిష్టంకాగా.. 2022–23లో రూ. 11.36 ట్రిలియన్‌ నికర లాభాన్ని సాధించాయి. కరోనా మహమ్మారి తదుపరి గత మూడేళ్లుగా దేశీ కార్పొరేట్‌ లాభాలు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందుతూ వస్తున్నాయి. దీంతో డివిడెండ్‌ చెల్లింపులు సైతం 2020–23 కాలంలో వార్షిక పద్ధతిన 29.5 శాతం చొప్పున ఎగశాయి. వార్షిక చెల్లింపులు 2023కల్లా 4.23 లక్షల కోట్లకు జంప్‌చేసింది. 2020లో ఇవి రూ. 1.95 ట్రిలియన్లు మాత్రమే. ఇదే కాలంలో మొత్తం లిస్టెడ్‌ కంపెనీల నికర లాభం దాదాపు 34 శాతం దూసుకెళ్లాయి. అయినప్పటికీ గతేడాది లాభాల పంపకం డీలా పడటం గమనార్హం! 

కోవిడ్‌–19 ముందు.. 
గత మూడేళ్లతో పోలిస్తే ఈక్విటీ డివిడెండ్ల చెల్లింపులు కోవిడ్‌–19కు ముందు తక్కువగానే నమోదయ్యాయి. 2017–20 కాలంలో లిస్టెడ్‌ కంపెనీల ఈక్విటీ డివిడెండ్ల పంపకం వార్షికంగా కేవలం 3 శా తం వృద్ధిని అందుకుంది. దీంతో 2017లో నమోదైన రూ. 1.78 ట్రిలియన్‌ డివిడెండ్లు 2020కల్లా రూ. 1.95 లక్షల కోట్లకు మాత్రమే బలపడ్డాయి. ఇందుకు నికర లాభాలు నీరసించడం కారణమైంది. 

2017లో మొత్తం లిస్టెడ్‌ కంపెనీల నికర లాభం రూ. 4.81 లక్షల కోట్లుకాగా.. 2020కల్లా రూ. 4.75 ట్రిలియన్లకు పరిమితమైంది. కాగా.. ప్రస్తుతానికి వస్తే గత ఐదేళ్లలో తొలిసారి వార్షికంగా డివిడెండ్‌ పేఔట్‌ రేషియో గతేడాది తగ్గింది. ఇలా ఇంతక్రితం 2019 లోనూ పేఔట్‌లో క్షీణత నమోదైంది. 2018లో రూ. 1.87 లక్షల కోట్లుకాస్తా 2019లో రూ.1.85 ట్రిలియ న్లకు బలహీనపడింది. ఇక గతేడాది లాభాలు, డివిడెండ్లు వ్యతిరేక దిశలో నమోదయ్యాయి. గత 9 ఏళ్లలోనే కనిష్టంగా డివిడెండ్‌ పేఔట్‌ నిష్పత్తి 27 శాతానికి పరిమితమైంది. 2023లో ఇది 37 శాతంకాగా.. 2020లో ఆల్‌టైమ్‌ గరిష్టం 41 శాతాన్ని తాకింది. 

కారణాలు.. 
సగటున పేఔట్‌ రేషియో నీరసించడానికి మార్కెట్‌ విశ్లేషకులు కొన్ని కారణాలను ప్రస్తావిస్తున్నారు. గతేడాది కొన్ని కీలక రంగాలలో కార్పొరేట్‌ ఆర్జన మందగించింది. దీంతో కొన్ని కంపెనీలు నగదును అంతర్గత వనరుల కోసం పక్కన పెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. పీఎస్‌యూ బ్యాంకులు, చమురు కంపెనీలు అధిక లాభాలను ఆర్జించగా.. అధిక డివిడెండ్లు పంచే ఐటీ, ఎఫ్‌ఎంసీజీ తదితర  రంగాలలో డిమాండ్‌ మందగించడం, వినియోగ వ్యయాలు తగ్గడం ప్రభావం చూపినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement