15 ఎయిర్‌బ్యాగ్‌లతో.. తొలి ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్‌ కారు! | Mercedes Launched First Plug In Hybrid Car in India | Sakshi
Sakshi News home page

15 ఎయిర్‌బ్యాగ్‌లతో.. తొలి ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్‌ కారు!

Jun 16 2026 4:37 PM | Updated on Jun 16 2026 4:48 PM

Mercedes Launched First Plug In Hybrid Car in India

లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ భారత మార్కెట్లోకి తమ ప్రతిష్టాత్మక ఎస్‌–క్లాస్‌ శ్రేణిలో సరికొత్త మోడల్‌ను ప్రవేశపెట్టింది. దేశీయంగా తమ మొదటి ప్లగ్‌–ఇన్‌–హైబ్రిడ్‌ వాహనం (పీహెచ్‌ఈవీ) ‘ఎస్‌ 450ఈ’ లాంచ్‌ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. ఈ మోడల్‌లో 2,700 కి పైగా పరికరాలను సరికొత్తగా తీర్చిదిద్దడం లేదా రివైజ్‌ చేయడం విశేషం.

భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ దేశంలోనే మొదటిసారిగా ఈ కారులో 15 ఎయిర్‌బ్యాగ్‌లను సంస్థ ప్రవేశపెట్టింది. ఎస్‌ 450ఈ లాంచ్‌ ఎడిషన్‌ ధర రూ. 2.20 కోట్లుగా నిర్ణయించగా, మ్యానుఫ్యాక్చర్‌ ఎడిషన్‌ ధరను రూ. 2.38 కోట్లుగా (ఎక్స్‌ షోరూమ్) ఖరారు చేసింది. బుకింగ్స్‌ ఇప్పటికే ప్రారంభం కాగా, 2026 క్యూ4 నుంచి డెలివరీలు ఉంటాయని కంపెనీ వెల్లడించింది.

ఈ లగ్జరీ కారులో 22 కేడబ్ల్యూహెచ్‌ లిథియం అయాన్‌ బ్యాటరీని అమర్చారు. ఇది కేవలం ఎలక్ట్రిక్‌ పవర్‌తోనే పట్టణ ప్రయాణాలకు సరిపడేలా 115 కిలోమీటర్ల వరకూ రేంజ్‌ని అందిస్తుంది. సుదీర్ఘ ప్రయాణాల్లో చార్జింగ్‌ అయిపోతుందనే ఆందోళన లేకుండా, అవసరాన్ని బట్టి వాడుకునేందుకు పెట్రోల్‌ ఇంజిన్‌ లభ్యతను కూడా కల్పించారు. ఈ వాహనం మొత్తం మీద 320 కిలోవాట్ (435 హెచ్‌పీ) సామర్థ్యంతో పాటు 680 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 5.7 సెకన్ల వ్యవధిలోనే గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అలాగే ఎలక్ట్రానిక్‌గా దీని గరిష్ట వేగాన్ని గంటకు 250 కిలోమీటర్లుగా నిర్దేశించారు.

ప్రీమియం కస్టమర్ల నుంచి ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్‌ కార్లకు వస్తున్న భారీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ ఎస్‌ 450ఈ మోడల్‌ను అందుబాటులోకి తెచ్చాము. కస్టమర్ల అంచనాలకు మించి, భారత్‌లో ఎస్‌ క్లాస్‌ వారసత్వాన్ని ఇది మరింత ముందుకు తీసుకెళ్తుందని ఆశిస్తున్నాము. ఈ వాహనం ద్వారా ఐసీఈ, బీఈవీ, పీహెచ్‌ఐవీ పవర్‌ట్రైన్ల నుంచి కస్టమర్లు తమకు అనువైన ఆప్షన్‌ను ఎంచుకునేందుకు మరింత వెసులుబాటు లభిస్తుంది’’ అని మెర్సిడెస్‌–బెంజ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈవో సంతోష్‌ అయ్యర్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement