త్వరలో జియో, ఎన్‌ఎస్‌ఈ బాహు‘బుల్’ ఇష్యూలు...
దాదాపు రూ.70,000 కోట్ల నిధుల సమీకరణకు రెడీ
గత బడా లిస్టింగ్‌లలో నిరాశే...
రిటైలర్లు దీర్ఘకాలిక దృష్టితోనే ఇన్వెస్ట్ చేయాలంటున్న నిపుణులు
స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల సందడి మొదలవుతోంది. టెలికం దిగ్గజం జియోతో పాటు దేశంలో అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్‌ఎస్‌ఈ మెగా పబ్లిక్ ఆఫర్లకు రంగం సిద్ధమైంది. అయితే, బడా ఐపీఓలు వస్తున్నాయంటే.. ఇన్వెస్టర్లలో భారీ ఆసక్తితో పాటు ఆందోళన కూడా తప్పడం లేదు. గతంలో వచ్చిన మెగా ఇష్యూలు అధిక వేల్యుయేషన్ల కారణంగా లిస్టింగ్‌లో తుస్సుమనడమే దీనికి కారణం. అంతేకాదు, భారీ ఐపీఓలు వచ్చినప్పుడల్లా మార్కెట్లు తీవ్ర కుదుపులకు గురవడం గమనార్హం. ఈ నేపథ్యంలో రిటైల్ ఇన్వెస్టర్లు లిస్టింగ్ లాభాల కోసం కాకుండా దీర్ఘకాలిక దృష్టితోనే ఈ ఆఫర్లలో పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. –సాక్షి, బిజినెస్ డెస్క్
భారత క్యాపిటల్ మార్కెట్ల చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా రికార్డు సృష్టించేందుకు జియో ప్లాట్‌ఫామ్స్ రెడీ అవుతోంది. దాదాపు రూ.37,000 కోట్ల (4 బిలియన్ డాలర్లు) సమీకరణ లక్ష్యంతో సెబీకి తాజాగా దరఖాస్తు చేసింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) సైతం రూ.30,000 కోట్ల భారీ ఐపీఓకు తెరతీసింది. మరో రెండు మూడు నెలల్లో ఈ రెండు మెగా ఐపీఓలు ఇన్వెస్టర్ల తలుపుతట్టనున్నాయి. జియో 27 కోట్ల తాజా షేర్ల జారీ ద్వారా నిధులను సొంత అవసరాల కోసం వినియోగించుకోవాలనుకుంటోంది. ఈ ఇష్యూతో కంపెనీ మార్కెట్ విలువ దాదాపు రూ.13 లక్షల కోట్లకు చేరుతుందనేది
విశ్లేషకుల అంచనా. కాగా, ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ఉంటుంది. తద్వారా ఎస్‌బీఐ సహా ప్రస్తుత వాటాదారులు సుమారు 6% వాటాలను విక్రయించనున్నారు. దీని మార్కెట్ విలువను రూ.5 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నా రు. మరోపక్క, క్విక్ కామర్స్ దిగ్గజం జెప్టో, ఫిన్‌టెక్ అగ్రగామి ఫోన్‌పే కూడా బిలియన్ డాలర్లకు పైగా నిధుల సమీకరణ రేసులో ఉన్నాయి. అంటే ఈ నాలుగు ఇష్యూలే సుమారు రూ. లక్ష కోట్లను మార్కెట్ల నుంచి లాగేసే అవకాశం ఉంది.
మళ్లీ కళకళ...
ప్రైమరీ మార్కెట్ గతేడాది కొత్త రికార్డులు నెలకొ ల్పింది. 104 కంపెనీలు పబ్లిక్ ఆఫర్ల ద్వారా సుమారు రూ.1.76 లక్షల కోట్లకు పైగానే సమీకరించాయి. అయితే, ఈ ఏడాది ఇప్పటిదాకా సుమారు 23 కంపెనీలు మాత్రమే (దాదాపు రూ.27,000 కోట్లు)
లిస్టింగ్ బాట పట్టాయి. పశ్చిమాసియా యుద్ధం తర్వాత మార్కెట్ల తిరోగమనంతో ఐపీఓలకు వచ్చే సాహసం చేయలేదు. ఏప్రిల్‌లో 2 ఇష్యూలు రాగా.. మే నెలలో ఒక్కటి కూడా లేదు. అయితే, ఇప్పుడిప్పుడే ఉద్రిక్తతలు శాంతిస్తుండటం.. మార్కెట్ల రికవరీతో జూన్‌లో మళ్లీ ఆఫర్ల బాటపట్టాయి. ఇప్పటికే మూడు కంపెనీలు లిస్టవగా.. మరో మూడు ఆరంభమయ్యాయి. ఇక రాబోయే జియో, ఎన్‌ఎస్‌ఈ, జెప్టో, ఫోన్‌పే, ఓయో వంటి భారీ ఇష్యూలతో మళ్లీ ప్రైమరీ మార్కెట్ కళకళలాడనుంది. 163 కంపెనీలకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మరో 73 సంస్థలు ఆమోదం కోసం వేచిచూస్తుండటం గమనార్హం.
గతంలో మెగా నిరాశ...
దేశీ స్టాక్ మార్కెట్ చరిత్రలో నాలుగు భారీ ఇష్యూలూ ఇన్వెస్టర్లకు నిరాశే మిగిల్చాయి. ఇందులో రూ.27,859 కోట్లతో ఇప్పటిదాకా అతిపెద్ద ఐపీఓగా నిలుస్తున్న హ్యుందాయ్ ఇండియా నష్టాలతో అరంగేట్రం చేసింది. ఇప్పటికీ ఇది ఇష్యూ ధర వద్దే కదలాడుతుండటం విశేషం. ఇక ఎంతో హైప్ క్రియేట్ చేసిన ఎల్‌ఐసీ, పేటీఎం సైతం మెప్పించలేకపోగా.. భారీ నష్టాల్లోకి జారిపోయాయి. టాటా క్యాపిటల్ ఒక్కటే లిస్టింగ్‌లో ఏదో పర్వాలేదనిపించియినా.. పెద్దగా లాభాలను పంచలేదు. ఎల్‌ఐసీ బోనస్ షేర్లను పరిగణనలోకి తీసుకుంటే షేరు ఇంకా ఇష్యూ ధర కంటే 7% దిగువనే ట్రేడవుతున్నట్లు లెక్క. పేటీఎం 50% నష్టాల్లో ఉంది. అధిక వేల్యుయేషన్ కారణంగానే ఐపీఓలు సక్సెస్ కాలేకపోయాయనేది మార్కెట్ వర్గాల విశ్లేషణ.
సరైన షేరు ధరే కీలకం..
ప్రస్తుతం అన్‌లిస్టెడ్ మార్కెట్లో ఎన్‌ఎస్‌ఈ షేరు రూ.1,950–2,000 వరకు పలుకుతోంది. ఇంత భారీ వేల్యుయేషన్‌తో షేరు ధరను నిర్ణయిస్తే.. రిటైల్ ఇన్వెస్టర్లు ముఖం చాటేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరోపక్క, జియో షేరు ధర ఎంత పెడతారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ రెండు ఐపీఓలు దీర్ఘకాలంలో మంచి రాబడులే అందించే అవకాశం ఉందని.. అయితే, లిస్టింగ్ లాభాలు మాత్రం ఆయా షేర్ల ఇష్యూ ధర పైనే ఆధారపడి ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.
‘రిటైల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకోవాలంటే ఎన్‌ఎస్‌ఈ, జియో ఐపీఓ షేర్ల ప్రైసింగ్‌ను ఎంత నిర్ణయిస్తారనేది కీలకం. కేవలం లిస్టింగ్ లాభాల కోసమైతే రిటైలర్లు వీటి జోలికెళ్లకపోవడమే మంచిది. ఆయా కంపెనీల వ్యాపారం, వృద్ధి అవకాశాలు, మార్కెట్లో పోటీ, వేల్యుయేషన్ వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. దీర్ఘకాలంలో వాటి రాబడుల సామర్థ్యంతో పోలిస్తే సరైన ధరను గనుక నిర్ణయిస్తే.. రిటైలర్లకు మంచి సంపదనే సృష్టించవచ్చు. కాబట్టి రిటైలర్లు దీర్ఘాకాలిక వ్యూహంతో ఇన్వెస్ట్ చేస్తే బెటర్‘ అని ఆనంద్ రాఠి స్టాక్ బ్రోకర్స్ ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ నరేంద్ర సోలంకి చెప్పారు.


