
మహీంద్రా & మహీంద్రా దేశీయ మార్కెట్లో 'బీఈ 6 బ్యాట్‌మాన్' ఎడిషన్ లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ.27.79 లక్షలు. కంపెనీ ఈ మోడల్ కోసం ఆగస్టు 23 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించనుంది. డెలివరీలు సెప్టెంబర్ 20న బ్యాట్‌మ్యాన్ డే సందర్బంగా మొదలవుతాయి. కాగా సంస్థ దీనిని 300 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. అంటే దీనిని 300 మంది కస్టమర్లు మాత్రమే కొనుగోలు చేయడానికి సాధ్యమవుతుంది.
మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్.. కస్టమ్ శాటిన్ బ్లాక్ బాడీ కలర్‌తో వస్తుంది. ముందు డోర్స్ మీద బ్యాట్‌మ్యాన్ డెకాల్స్, టెయిల్‌గేట్‌పై డార్క్ నైట్ బ్యాడ్జ్, ఫెండర్‌పై బ్యాట్‌మ్యాన్ లోగో, బంపర్ & రివర్స్ లాంప్ ఉన్నాయి. బ్రేక్‌లు, స్ప్రింగ్‌లు ఆల్కెమీ గోల్డ్ పెయింట్ పొందాయి. ఇది చూడగానే ఒక సూపర్ హీరోను గుర్తుకు తెస్తుంది.
మహీంద్రా బ్యాట్‌మ్యాన్ ఎడిషన్.. 79 kWh బ్యాటరీ ప్యాక్‌తో.. ఒకే ఫుల్ ఛార్జ్‌పై 682 కి.మీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 286 హార్స్ పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుందని సమాచారం.
ఇదీ చదవండి: దేశీయ దిగ్గజం హవా.. ఒకేసారి నాలుగు కొత్త కార్లు
మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ లోపల కూడా అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ పొందుతుంది. డాష్‌బోర్డ్‌పై ఆల్కెమీ గోల్డ్‌లో నంబర్ ఉన్న బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ప్లేక్, ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ కోసం చార్‌కోల్ లెదర్ & గోల్డ్ సెపియా స్టిచింగ్‌తో కూడిన స్వెడ్ లెదర్ అపోల్ స్ట్రే వంటివి ఉన్నాయి. గోల్డ్ యాక్సెంట్‌లు స్టీరింగ్ వీల్, ఇన్ టచ్ కంట్రోలర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వరకు విస్తరించి ఉండగా, బ్యాట్ లోగో బూస్ట్ బటన్, సీట్లు మొదలైనవాటిపై కనిపిస్తాయి.