
అటు జీఎస్‌టీ రేట్ల తగ్గింపు, ఇటు దసరా నవరాత్రులు ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియాకి బాగా కలిసొచ్చాయి. నవరాత్రులు ప్రారంభమైనప్పటి నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు కంపెనీ 75,000 పైచిలుకు వాహనాలను విక్రయించింది. చిన్న కార్లలో కొన్ని వేరియంట్ల డెలివరీ కోసం నిరీక్షించే పరిస్థితి కూడా నెలకొందని సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు.
ప్రస్తుతం రోజుకు 80,000 పైచిలుకు ఎంక్వైరీలు వస్తున్నాయని, ఇది సాధారణంగా వచ్చే 40,000–45,000 ఎంక్వైరీలకు రెట్టింపని వివరించారు. రోజుకు సుమారు 18,000 బుకింగ్స్ నమోదవుతున్నాయన్నారు. ‘నవరాత్రులు ప్రారంభమయ్యాక గురువారం సాయంత్రం 6 గం.ల సమయానికి 75,000 వాహన విక్రయాలు నమోదయ్యాయి. రోజు ముగిసే సరికి ఇది 80,000 యూనిట్లకు పెరుగుతుందని భావిస్తున్నాం‘ అని పార్థో బెనర్జీ తెలిపారు. పండుగ సీజన్‌లో చిన్న కార్లపై గణనీయంగా ఆసక్తి నెలకొందని ఆయన చెప్పారు.
ఎంట్రీ లెవెల్ కార్ల సెగ్మెంట్‌లో దేశవ్యాప్తంగా బుకింగ్స్ 50 శాతం పెరిగాయని పేర్కొన్నారు. జీఎస్‌టీ రేట్ల తగ్గింపు కోసం కొనుగోలుదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారని, అప్‌గ్రేడ్ కావడానికి ఇదే సరైన సమయమని బెనర్జీ వివరించారు. ఉత్పత్తిని ఒక్కసారిగా పెంచడానికి లేనందున బ్రెజా, డిజైర్, బాలెనో లాంటి కార్లలో కొన్ని వేరియంట్లను నాలుగైదు రోజుల తర్వాత సత్వరం సరఫరా చేసే అవకాశం ఉండదన్నారు.
ఇదీ చదవండి: చెప్పులు ధరించి డ్రైవింగ్ చేస్తే చలానా!?