
భారతదేశంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించడం చాలా ముఖ్యం. బైక్‌లో వెళ్లినా, కారు నడుపుతున్నా.. ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి ట్రాఫిక్ చట్టాలకు కట్టుబడి ఉండాల్సిందే. నిబంధనలు పాటించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే ట్రాఫిక్ రూల్స్‌ను సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు ప్రజలు సాధారణ ట్రాఫిక్ నియమాలను తప్పుగా అర్థం చేసుకుంటారు. చెప్పులు ధరించి డ్రైవింగ్ చేయడంపై ఇటీవల సామాజిక మాధ్యమాల్లో భిన్న అభిప్రాయాలతో పోస్టులు వైరల్‌గా మారుతున్నాయి.
చెప్పులు ధరించి కారు లేదా ద్విచక్ర వాహనం నడపడం భారతదేశంలో చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుందని కొందరు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. అయితే నిబంధనల ప్రకారం ఇది నిజం కాదు. మోటారు వాహన చట్టం ప్రకారం చెప్పులు ధరించి ఎవరైనా వాహనం నడుపుతున్నట్లయితే జరిమానా విధించడం లేదా చలానా వేసే నిబంధన ఏదీ లేదు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గతంలో ట్రాఫిక్ నిబంధనలను తప్పుగా అర్థం చేసుకోవడం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని ట్వీట్ చేశారు.
చెప్పులు ధరించి డ్రైవింగ్ చేయడం సురక్షితమేనా?
చెప్పులు ధరించి డ్రైవ్ చేయడం అంత సురక్షితం మాత్రం కాదని కొందరు రోడ్డు, రవాణా నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అవి పెడల్స్, గేర్ లీవర్‌పై పట్టుతప్పే అవకాశం ఉందంటున్నారు. అందువల్ల డ్రైవింగ్ చేసేటప్పుడు షూ ధరిస్తే మేలని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: లైక్స్, కామెంట్స్ కోసం ఆరాటపడితే అంతే..