
సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ సందీప్ ముదాల్కర్
ప్రస్తుతం టెక్నాలజీని ఓ రేంజ్‌లో వాడుతున్నాం. అది మితిమీరితే ఎలాంటి ప్రమాదాలు వస్తాయన్న విషయాన్ని కూడా మర్చిపోయి దాన్ని అంతగా ఉపయోగిస్తున్నాం. ఇటీవల కాలంలో జిబ్లీ ఆర్ట్, జెమినీ ఏఐ(GeminiAI)..వంటివి చూశాం. తాజాగా నానో బనానా(Nano Banana) ఉపయోగిస్తున్నాం. మన ఫొటోస్‌ను అప్‌లోడ్ చేస్తే ఎడిట్ చేసి ఇతర ఫార్మాట్‌లో ఇది మన ముందుంచుతుంది. అసలు ఒరిజినల్‌గా అప్‌లోడ్ చేసిన ఫోటోలు అన్నీ ఏమవుతున్నాయి.. ఇటీవల జరుగుతున్న సైబర్ అటాక్స్‌కు ఈ కొత్త టెక్నాలజీలకు ఎదైనా సంబంధం ఉండే అవకాశం ఉందా.. అనే విషయాలను సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ సందీప్ ముదాల్కర్ తెలిపారు.
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఏఐకి ఆదరణ అధికం అవుతోంది. అయితే దీంతో ఎంత ప్రయోజనం ఉందో అంతే నష్టాలున్నాయి. కొన్నేళ్ల కిందట క్రైమ్స్‌ను గమనిస్తే.. సోషల్ క్రైమ్స్ ఎక్కువగా జరిగేవి. అంటే వ్యక్తుల వద్దకు వెళ్లి సమాచారం తెలుసుకుని దాన్ని క్రైమ్ కోసం ఉపయోగించుకునేవారు. కానీ ఇప్పుడు క్రైమ్ తీరు మారింది. అంతా సైబర్ క్రైమ్. ఫిజికల్‌గా వ్యక్తుల ప్రమేయం లేకుండా క్రైమ్ జరుగుతుంది. ఇప్పుడు వస్తున్న టెక్నాలజీల్లో కొన్ని అందుకు తోడ్పడుతున్నాయి.
ఆర్గనైజ్డ్ ఇంటెలిజెన్స్
మనిషి చనిపోయినా తన ఆలోచనలు, తెలివితేటలు ఎల్లకాలం ఉండేలా ‘ఆర్గనైజ్డ్ ఇంటెలిజెన్స్’ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఆలోచనలున్న పరిస్థితుల్లో టెక్నాలజీ పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. సైబర్ నేరాలు(cyber attack) చేసేవారు చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కనిపెడుతున్నారు. కానీ సాధారణ యూజర్లకు ఆ విషయాలు తెలిసే అవకాశం ఉండదు. సైబర్ క్రైమ్‌కు సంబంధించి ఒక కేసు ఇన్వెస్టిగేట్ చేయాలన్నా, ఒక డివైజ్ నుంచి కొంత డేటా కలెక్ట్ చేయాలన్నా సరైన టూల్స్ లేవు. కానీ సైబర్ క్రిమినల్స్ మాత్రం నేరం చేసేందుకు కొత్త టూల్స్ కనుగొంటున్నారు. అందుకు ఎక్కువ రీసెర్చ్ చేస్తున్నారు. ప్రజలు కూడా మార్కెట్‌లో ఏదైనా టూల్ ఉచితంగా వచ్చిందంటే దానిపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దానికితోడు ఈ సోషల్‌మీడియా ప్రభావం కూడా ఎక్కువైంది.
డేటా సేకరిస్తున్నారు.. జాగ్రత్త!
ఇప్పుడు వస్తున్న టెక్నాలజీలు యూజర్లను వదులుకోవాలని అనుకోవడం లేదు. ఉదాహరణకు Facebookను తీసుకుందాం. దీని ఖాతాను డిలీట్ చేయాలనుకుంటే వెంటనే డిలీట్ అవ్వదు. అందుకు కొంత టైమ్ ఇస్తున్నారు. ఒకవేళ ఈ గ్యాప్‌లో మళ్లీ లాగిన్ చేస్తే రికవరీ అవుతుంది. ఎందుకంటే Facebook మన ఖాతాను డిలీట్ చేయాలని అనుకోవడంలేదు. ఇప్పటికే దాదాపు అన్ని టెక్ కంపెనీలు యూజర్ల ఇంట్రెస్ట్ ఏంటీ.. వారికి ఎలాంటి డేటా ముఖ్యం.. వారి అభిరుచులు ఏమిటి.. ఎలా కమ్యునికేట్ చేస్తున్నారు.. ఏం కొంటున్నారు.. ఏ ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు..వంటివి గమనిస్తున్నాయి. ఈ సమాచారం స్టోర్ అవ్వడంతో భవిష్యత్తులో ఇది దుర్వినియోగం అయ్యే అవకాశం కూడా ఉంది.
అనైతికంగా వాడుతారు..
ప్రస్తుతం నానో బనానా టూల్ ద్వారా ఫొటోలు అప్‌లోడ్ చేస్తున్నారు. ఆ సర్వర్‌లో నుంచి డేటాని హ్యాకర్స్ గానీ, సైబర్ క్రిమినల్స్ గానీ దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. యూజర్లకు ఎలాంటి సమాచారాన్ని తెలపకుండా వారి ఫొటోలను సైబర్ నేరగాళ్లు కార్టూన్ వీడియోస్‌కు, యనిమేషన్స్ చేయడానికి, పొర్నోగ్రఫీ కంటెంట్‌లో వాడుకోవడానికి, యడ్స్ ప్రమోట్ చేసుకోవడానికి, ఏదైనా డేటింగ్ సైట్స్‌లో అప్‌లోడ్ చేసేందుకు..వాడే అవకాశం ఉంది.
కొత్త ఛాలెంజ్‌లతో..
శారీ ఛాలెంజ్ అనే కొత్తరకం టూల్స్ పుట్టుకొస్తున్నాయి. ఇందులో తాజా ఫోటోను అప్‌లోడ్ చేస్తే 1990ల్లో శారీ లుక్‌లో మనం ఎలా ఉండేవాళ్లమో తిరిగి చూపుతుంది. ఇలాంటి టెక్నాలజీలను కొన్నిసార్లు హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు ఉపయోగించే అవకాశం ఉంది. హ్యాకర్లకు కొత్త డేటా కావాలనుకుంటే కొత్త ఛాలెంజెస్ రిలీజ్ చేస్తారు. ఉదాహరణకు.. గ్రీన్ సారీ ఛాలెంజ్ అనగానే మహిళలు గ్రీన్ సారీ వేసుకొని ఫొటోలు దిగి అప్లోడ్(uploading photos) చేస్తారు. హాష్‌టాగ్ పెట్టేస్తారు. ఆ డేటాని హ్యాకర్స్ కలెక్ట్ చేసుకుంటారు. అదే విధంగా చికెన్ బిర్యానీ ఛాలెంజ్ అని పెడతారు. అప్పుడు లేడీస్ చికెన్ బిర్యానీ చేస్తూ వీడియోలు చేసి ఫొటోలని అప్లోడ్ చేస్తారు. దీన్ని సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేస్తారు. లైక్స్, కామెంట్స్ కోసం చేసే పనులు కొన్నిసార్లు విపరీత పరిస్థితులకు దారితీస్తాయని గుర్తుంచుకోవాలి.
ఇప్పుడేం చేయాలి?
కొన్ని సంస్థలకు చెందిన ఏఐ టూల్స్ మన అనుమతి లేకుండా మన ఇమేజెస్‌ను వెబ్‌సైట్‌ల్లో అప్‌లోడ్ చేసి, దాన్ని మనం గ్రహించి తొలగించమంటే కూడా తొలగించే అవకాశం ఉండదు. ఎందుకంటే వాటిలో అంతర్జాతీయ కంపెనీలు ఉంటాయి. అవి వాటి దేశ చట్టాలను అనుసరిస్తున్నట్లు చెబుతాయి. ఒకవేళ తమ దేశంలోని యూజర్ల కంటెంట్‌ను దుర్వినియోగం చేసినా డిపార్ట్‌మెంట్ రైట్స్‌కు వెళుతాయి. కాబట్టి వారు ఆ కంటెంట్‌ను డిలీట్ చేయడం చాలా కష్టం. ఇతర దేశాల వారు తమపై లీగల్ యాక్షన్ తీసుకోవాలన్న కూడా వీలుండదు. కాబట్టి టెక్నాలజీ వాడే ముందు అప్రమత్తంగా ఉండాలి. అలా అని అసలే వాడకూడదని కాదు. అధికారిక వెబ్‌సైట్‌లను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి. నిబంధనల ప్రకారం అత్యవసరం అయితే తప్పా ఏ సమాచారాన్ని పంచుకోవద్దు. మనం మితిమీరిన ఆలోచనలతో చేసే పనులే సైబర్ నేరగాళ్లకు తోడ్పడుతున్నాయని గుర్తుంచుకోవాలి.
ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి!