రెండింటిలోనూ ఇన్వెస్ట్‌ చేసే ఫండ్‌.. | Kotak Equity Hybrid Fund performance review analysis | Sakshi
Sakshi News home page

రెండింటిలోనూ ఇన్వెస్ట్‌ చేసే ఫండ్‌..

Mar 24 2025 7:40 AM | Updated on Apr 3 2025 10:26 AM

Kotak Equity Hybrid Fund performance review analysis

ఇటీవలి కాలంలో మన మార్కెట్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇది చూసి దీర్ఘకాలానికి ఈక్విటీలు బ్రహ్మాండమైన రాబడులు ఇస్తాయన్న ప్రచారంలో వాస్తవం ఎంత? అన్న సందేహాలు కూడా కొందరు ఇన్వెస్టర్లలో ఏర్పడ్డాయి. ఈ సమయంలో ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలా? లేక డెట్‌లో పెట్టుబడులు పెట్టుకోవాలన్న సంశయం కూడా ఎదురుకావచ్చు. కానీ, పెట్టుబడుల ప్రయాణం చాలా సుదీర్ఘమైనది. దీర్ఘకాల లక్ష్యాల కోసం నిధిని సమకూర్చుకోవాలని కోరుకునే ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీలకు తప్పకుండా చోటు ఉండాలి. అదే సమయంలో పెట్టుబడినంతా ఈక్విటీల్లోనే పెట్టేయడం సరికాదు. డెట్‌కు సైతం కొంత కేటాయింపులు అవసరం. ఈక్విటీ, డెట్‌ పెట్టుబడులకు వీలు కల్పించే పథకాల్లో కోటక్‌ ఈక్విటీ హైబ్రిడ్‌ ఫండ్‌ ఒకటి.  

రాబడులు 
గడిచిన ఏడాది కాలంలో కోటక్‌ ఈక్విటీ హైబ్రిడ్‌ ఫండ్‌ డైరెక్ట్‌ ప్లాన్‌లో రాబడి 7.30 శాతంగా ఉంది. గత ఐదు నెలలుగా మార్కెట్లు తీవ్ర కుదుపులను చూస్తున్నాయి. అలాంటి తరుణంలోనూ ఏడాది కాలంలో రాబడి సానుకూలంగా ఉండడం గమనార్హం. ఏడాది కాల పనితీరు విషయంలో ఈక్విటీ ఆధారిత హైబ్రిడ్‌ విభాగంలో ఈ పథకం రెండో స్థానంలో నిలిచింది. మూడేళ్ల కాలంలో ఈ పథకం ఏటా 14 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని తెచ్చిపెట్టింది. ఇక ఐదేళ్లలో చూస్తే 21 శాతం, ఏడేళ్లలో 14 శాతం, 10 ఏళ్లలో 12.75 శాతం చొప్పున వార్షిక రాబడిని అందించింది. అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఫండ్‌ విభాగంతో పోల్చి చూస్తే  అన్ని కాలాల్లోనూ ఈ పథకంలోనే రాబడి అధికంగా ఉండడాన్ని గమనించొచ్చు.  

పెట్టుబడుల విధానం 
ఈ పథకం అగ్రెస్సివ్‌ అలోకేషన్‌ విధానాన్ని అనుసరిస్తుంది. 75 శాతం వరకు ఈక్విటీలకు, 25 శాతం వరకు డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటుంది. వివిధ మార్కెట్‌ క్యాప్‌ల మధ్య తగినంత వైవిధ్యాన్ని పాటిస్తుంది. అధిక వేల్యూషన్లకు చేరితే లాభాలు స్వీకరించి, అదే సమయంలో చౌక విలువల వద్ద అందుబాటులో ఉన్న స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగంగా గుర్తించొచ్చు.

ఇందుకు నిదర్శనం గత ఆరు నెలల్లో క్యాపిటల్‌ గూడ్స్, ఆటోల్లో అమ్మకాలు చేయగా, అదే సమయంలో టెక్నాలజీ, కెమికల్స్, ఫార్మా, హెల్త్‌కేర్‌లో ఎక్స్‌పోజర్‌ పెంచుకుంది. ఈ విధానంతో నష్టాలను పరిమితం చేసి లాభాలను పెంచుకునే వ్యూహాన్ని ఫండ్‌ నిర్వహణ బృందం అమలు చేసింది. ఈ తరహా విధానాలతో రిస్క్‌ తగ్గించి, రాబడులు పెంచుకునే విధంగా పథకం పనిచేస్తుంటుంది.  

పోర్ట్‌ఫోలియో 
ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.6,324 కోట్ల పెట్టుబడులున్నాయి. ఇందులో 73 శాతం వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసింది. డెట్‌ సాధనాల్లో 25 శాతం పెట్టుబడులు పెట్టగా, రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (రీట్‌)లలో 0.43 శాతం మేర ఇన్వెస్ట్‌ చేసింది. 1.64 శాతం మేర నగదు నిల్వలు ఉన్నాయి. ఈక్విటీ పెట్టుబడులను గమనిస్తే 68 శాతం మేర లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో 30 శాతం ఇన్వెస్ట్‌ చేస్తే, స్మాల్‌క్యాప్‌ కంపెనీలకు 1.92 శాతం కేటాయించింది.

ఈక్విటీల్లో టెక్నాలజీరంగ కంపెనీల్లో అత్యధికంగా 18 శాతం మేర ఇన్వెస్ట్‌ చేసింది. ఆ తర్వాత 15 శాతం మేర బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలకు, 9.68 శాతం మెటీరియల్స్‌ కంపెనీలకు, 8 శాతం హెల్త్‌కేర్‌ కంపెనీలకు కేటాయించింది. డెట్‌ పెట్టుబడుల్లో రిస్క్‌ దాదాపుగా లేని ఎస్‌వోవీల్లో (ప్రభుత్వ బాండ్లు) 20 శాతం ఇన్వెస్ట్‌ చేయగా, మెరుగైన క్రెడిట్‌ రేటింగ్‌కు నిదర్శనంగా ఉండే ఏఏఏ సెక్యూరిటీల్లో 3.41 శాతం పెట్టుబడులు ఉండడాన్ని 
గమనించొచ్చు.

టాప్‌ ఈక్విటీ హోల్డింగ్స్‌
 

 కంపెనీ     పెట్టుబడులు శాతం
1భారతీ ఎయిర్‌టెల్‌              4.49 
2హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌           3.89 
3ఇన్ఫోసిస్‌                            3.18  
4ఫోర్టిస్‌ హెల్త్‌                         2.90
5అల్ట్రాటెక్‌ సిమెంట్‌             2.88 
6విప్రో                                    2.74
7
ఎన్‌టీపీసీ                            
2.39
8పవర్‌ఫైనాన్స్‌                     2.25
9ఒరాకిల్‌ ఫైనాన్స్‌               1.96 
10
ఐసీఐసీఐ బ్యాంక్‌              
1.89

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement