ముంబై: భారతీయ టెక్నాలజీ రంగానికి మరో కీలక మైలురాయిగా, రిలయన్స్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ (Jio Platforms) ప్రపంచ మేధోసంపత్తి సంస్థ (WIPO) పేటెంట్ కోఆపరేషన్ ట్రీటీ (PCT) 2025 ర్యాంకింగ్స్‌లో ప్రపంచ టాప్-20 ఇన్నోవేటర్ల జాబితాలో చోటు దక్కించుకుంది. గ్లోబల్ టాప్-20లో స్థానం సంపాదించిన ఏకైక భారతీయ టెక్నాలజీ సంస్థగా జియో నిలిచింది. 2025లో జియో ఏకంగా 320 స్థానాలు ఎగబాకి, అత్యంత వేగంగా ఎదుగుతున్న ఇన్నోవేటర్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.
జియో పేటెంట్ పోర్ట్‌ఫోలియో ప్రధానంగా 5G, 6G, కృత్రిమ మేధస్సు (AI), క్లౌడ్-నేటివ్ ప్లాట్‌ఫార్మ్స్, ఎడ్జ్ ఇంటెలిజెన్స్, నెట్‌వర్క్ స్లైసింగ్ వంటి భవిష్యత్ డిజిటల్ సాంకేతికతలపై కేంద్రీకృతమైంది. సంస్థ ఇప్పటివరకు మొత్తం 6,817 పేటెంట్లను దాఖలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా 1,009 పేటెంట్లు జియో ప్లాట్‌ఫామ్స్‌కు మంజూరయ్యాయి. మార్చి 31, 2026 నాటికి భారత్‌లో 538, విదేశాల్లో 471 పేటెంట్లు జియోకు లభించాయి.
ఈ సందర్భంగా జియో ప్లాట్‌ఫార్మ్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ (Akash Ambani) మాట్లాడుతూ, భారత్‌ను సాంకేతికతను సృష్టించే, ఎగుమతి చేసే దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి ఈ విజయం నిదర్శనమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా PCT దాఖలాలు 2025లో కేవలం 0.7% మాత్రమే పెరిగినప్పటికీ జియో టాప్-20లోకి ప్రవేశించడం విశేషమని డబ్ల్యూఐపీవో వెల్లడించింది. హువావే, శాంసంగ్, గూగుల్, యాపిల్ వంటి దిగ్గజాల సరసన జియో చేరడం భారత డీప్‌టెక్ సామర్థ్యానికి అంతర్జాతీయ గుర్తింపుగా నిలిచింది.


