
మరికొన్ని త్రైమాసికాలు ఆటుపోట్లు తప్పవు
జియో బ్లాక్‌రాక్ సీఐవో రిషి కోహ్లి
దేశ ఈక్విటీ మార్కెట్లలో మరికొన్ని త్రైమాసికాల పాటు ఆటుపోట్లు కొనసాగుతాయని జియో బ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ (సీఐవో) రిషి కోహ్లి పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి నుంచి స్థిరమైన అప్‌ట్రెండ్‌లో కొనసాగొచ్చని అంచనా వేశారు. ఆర్థిక మూలాలు, స్థూల ఆర్థిక, సైక్లికల్ అంశాలు మార్కెట్ గమనాన్ని నిర్ణయిస్తాయన్నారు. జూన్ త్రైమాసికం ఫలితాలు వివిధ రంగాల మధ్య అసహజంగా ఉన్నాయంటూ, రానున్న నెలల్లో ఇవి స్థిరపడతాయని చెప్పారు.
అంతర్జాతీయ అస్సెట్ మేనేజ్‌మెంట్ సంస్థ అయిన బ్లాక్‌రాక్‌తో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏర్పాటు చేసిన 50:50 జాయింట్ వెంచర్ కంపెనీయే జియో బ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్. ఇటీవలే ఈ సంస్థ ఫ్లెక్సీక్యాప్ ఫండ్‌ను ప్రారంభించడం గమనార్హం. ఈ పథకం కింద సమీకరించే పెట్టుబడుల్లో అధిక శాతాన్ని లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేయనున్నట్టు రిషి కోహ్లీ తెలిపారు.
బ్లాక్‌రాక్‌కు చెందిన సిస్టమ్యాటిక్ యాక్టివ్ ఈక్విటీస్ ప్లాట్‌ఫామ్ ఆధారితంగా ఈ పథకం పెట్టుబడులు పెట్టనుంది. డేటా విశ్లేషణ, నిపుణుల పరిశీలనతో పోర్ట్‌ఫోలియోను నిర్మించనుంది. ‘ఫ్లెక్సీక్యాప్ మా మొదటి యాక్టివ్ ఫండ్. చురుకైన, భిన్నమైన, తక్కువ వ్యయాలతో కూడిన పరిష్కారాలు అందించడమే మా లక్ష్యం. అన్ని మార్కెట్ సైకిల్స్‌లో రిస్క్ నియంత్రణ దృష్టిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో సంపద సృష్టించాలన్న లక్ష్యం పెట్టుకున్నాం’ అని వివరించారు.
ఇదీ చదవండి: జొమాటోలో ‘హెల్దీ మోడ్’ ఫీచర్