జియో ‘విశ్వ’రూపం.. అంతరిక్షంలో 1,600 శాటిలైట్లు | Jio 1600 Satellites 23 Ground Stations Satellite Connectivity India | Sakshi
Sakshi News home page

జియో ‘విశ్వ’రూపం.. అంతరిక్షంలో 1,600 శాటిలైట్లు

Oct 8 2026 6:23 PM | Updated on Oct 8 2026 6:45 PM

Jio 1600 Satellites 23 Ground Stations Satellite Connectivity India

టెలికాం రంగంలో మొబైల్‌ నెట్‌వర్క్‌, ఫైబర్‌ సేవల విస్తరణ తర్వాత రిలయన్స్‌ జియో ఇప్పుడు అంతరిక్ష ఆధారిత కనెక్టివిటీపై దృష్టి సారిస్తోంది. సుమారు 1,600 లో ఎర్త్‌ ఆర్బిట్‌ (LEO) శాటిలైట్లతో కూడిన కాన్‌స్టెలేషన్, దేశవ్యాప్తంగా 23 గ్రౌండ్‌ స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదిత ప్రణాళికను జియో ప్రదర్శించింది. భౌగోళిక పరిస్థితుల కారణంగా సంప్రదాయ టెలికాం మౌలిక వసతులు ఏర్పాటు చేయడం కష్టమైన ప్రాంతాలకు సైతం కనెక్టివిటీని అందించడం దీని ప్రధాన లక్ష్యం.

ఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ (ఐఎంసీ) 2026లో జియో తన శాటిలైట్‌ కనెక్టివిటీ విజన్‌ను ఆవిష్కరించింది. దీనిని ‘సావరిన్‌ శాటిలైట్‌ కనెక్టివిటీ’గా పేర్కొన్న సంస్థ.. శాటిలైట్‌ వ్యవస్థకు సంబంధించిన డిజైన్‌, ఇంజినీరింగ్‌, ఇంటిగ్రేషన్‌, పరీక్షలు, ప్రయోగం, ఉపగ్రహాల మోహరింపు, నిర్వహణ వంటి కీలక దశల్లో భారత్‌లోనే నియంత్రణ ఉండేలా వ్యవస్థను అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని వెల్లడించింది.

23 గ్రౌండ్‌ స్టేషన్లతో అనుసంధానం

ప్రతిపాదిత ప్రాజెక్టులో 23 గ్రౌండ్‌ స్టేషన్లు కీలకంగా పనిచేయనున్నాయి. ఇవి శాటిలైట్‌ నెట్‌వర్క్‌ను దేశంలోని భూభాగ ఆధారిత మౌలిక వసతులతో అనుసంధానించడంతో పాటు, జియో ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న టెరెస్ట్రియల్‌ నెట్‌వర్క్‌తోనూ కలపనున్నాయి. తద్వారా భూమిపై ఉన్న టెలికాం మౌలిక వసతులు, అంతరిక్ష ఆధారిత నెట్‌వర్క్‌ కలిసి పనిచేసే సమగ్ర కనెక్టివిటీ వ్యవస్థను రూపొందించాలన్నది సంస్థ ఉద్దేశం.

జియో ప్రదర్శనలో దేశవ్యాప్తంగా, సముద్ర ప్రాంతాల్లోనూ విస్తృత కవరేజీ అందించే లక్ష్యాన్ని చూపించింది. 6 లక్షలకు పైగా గ్రామాలను అనుసంధానించడంతో పాటు మారుమూల ప్రాంతాలు, ద్వీపాలు, సరిహద్దు ఔట్‌పోస్టులకు కనెక్టివిటీని విస్తరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో డైరెక్ట్‌-టు-డివైస్‌ (D2D) కాలింగ్‌ వంటి సేవలను అందించే అవకాశాలను కూడా ప్రస్తావించింది.

ఏవియేషన్‌ నుంచి రక్షణ వరకు..

శాటిలైట్‌ ఆధారిత కనెక్టివిటీని కేవలం మొబైల్‌ సేవలకే పరిమితం చేయకుండా పలు రంగాలకు విస్తరించే అవకాశాలను జియో ప్రదర్శించింది. ఎంటర్‌ప్రైజ్‌ కనెక్టివిటీ, మారుమూల ప్రాంతాల్లోని సంస్థలు, విమానయాన, సముద్ర రవాణా, ప్రభుత్వ రంగం, రక్షణ, విపత్తు నిర్వహణ వంటి విభాగాల్లోనూ ఈ వ్యవస్థను వినియోగించుకోవచ్చని తెలిపింది.

ఈ ఏడాది ఐఎంసీకి ‘స్కేల్‌ వితౌట్‌ బౌండరీస్‌’ అనే థీమ్‌ను ఎంచుకున్నారు. గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐఎంసీ 10వ ఎడిషన్‌ను ప్రారంభించారు. టవర్లు, ఫైబర్‌ వంటి సంప్రదాయ నెట్‌వర్క్‌ మౌలిక వసతుల పరిధిని దాటి కనెక్టివిటీని విస్తరించాలన్న ఈ థీమ్‌కు జియో ప్రతిపాదిత శాటిలైట్‌ ప్రాజెక్ట్‌ అనుగుణంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement