చేతులు లేని మహిళకు డ్రైవింగ్‌ లైసెన్స్‌.. సీఎం చేతుల మీదుగా.. | Sakshi
Sakshi News home page

చేతులు లేని మహిళకు డ్రైవింగ్‌ లైసెన్స్‌.. సీఎం చేతుల మీదుగా..

Published Fri, Dec 8 2023 11:23 AM

Jilumol Mariet Thomas To Get A Licence To Drive Without Hands - Sakshi

మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం, వాహనాలను డ్రైవ్ చేయాలంటే తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయం దాదాపు అందరికి తెలుసు. ఇటీవల రెండు చేతులూ లేని ఓ మహిళకు కేరళ మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ లైసెన్స్ జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

పుట్టుకతోనే చేతులు లేకుండా పుట్టిన 'జిలుమోల్ మరియెట్ థామస్' (Jilumol Mariet Thomas) ఎలాగైనా డ్రైవింగ్ నేర్చుకోవాలనే పట్టుదలతో ఐదు సంవత్సరాలు కృషి చేసి డ్రైవింగ్ నేర్చుకుంది. నేర్చుకోవడమే కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొందింది.

జిలుమోల్ కారు డ్రైవింగ్ చేయడానికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో మీరు గమనించినట్లయితే ఈమె కాళ్లతోనే కారుని డ్రైవ్ చేయడం చూడవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం మొదట్లో అప్లై చేసుకున్నప్పుడు అధికారులు తిరస్కరించారు. కానీ పట్టు వదలకుండా డ్రైవింగ్ నేర్చుకుని చివరికి సంబంధిత అధికారుల చేతులమీదుగానే డ్రైవింగ్ లైసెన్స్ పొందింది.

లైసెన్స్ కోసం జిలుమోల్ చేసిన అభ్యర్థనను ఐదేళ్ల క్రితం అధికారులు తిరస్కరించడంతో ఆమె రాష్ట్ర వికలాంగుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ కేసు కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌ను కోరింది.  ఈ కేసును క్షుణ్ణంగా అధ్యయనం చేసి తగిన పరిష్కారం చూపాలని ఎర్నాకులం జిల్లాలోని మోటారు వాహన శాఖ అధికారులను రవాణా కమిషనర్‌ ఆదేశించింది.

జిలుమోల్ కారుని సవ్యంగా డ్రైవింగ్ చేయగలదా లేదా అనే విషయాన్నీ మోటారు వాహన శాఖ అధికారులు పూర్తిగా తెలుసుకున్నారు. అయితే ఈమె కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కారు ఉండాలని వారు తీర్మానించారు. దీంతో ఒక సంస్థ 2018 మోడల్ సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌కి కావలసిన మార్పులను చేస్తూ సవరించింది.

జిలుమోల్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కారుని ఆమె తన పాదాలతోనే ఆపరేట్ చేయవచ్చు. అంతే కాకుండా ఈ కారులోని కొన్ని ఫీచర్స్ యాక్టివేట్ చేయడానికి వాయిస్ రికగ్నిషన్‌ కూడా అందించింది. ఈమె ఈ ఏడాది మార్చిలో లెర్నర్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, నవంబర్‌లో డ్రైవింగ్ టెస్ట్ కూడా పాసయ్యింది.

ఇదీ చదవండి: ఆర్‌బీఐ ఖాతాలో మరో బ్యాంక్.. లైసెన్స్ క్యాన్సిల్ చేస్తూ ఉత్తర్వు

కస్టపడి అనుకున్నది సాధించిన 'జిలుమోల్'కు కేరళ ముఖ్యమంత్రి స్వయంగా డ్రైవింగ్ లైసెన్స్ అందించారు. చేతులు లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ సాధించిన మొదటి మహిళా ఈమె కావడం గమనార్హం. జిలుమోల్ ఆర్టిస్ట్ కావడం వల్ల ప్రస్తుతం ఒక ప్రైవేట్ సంస్థలో గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేస్తోంది.

Advertisement
 
Advertisement